Surya Kumar Yadav: టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా పొట్టి ఫార్మాట్ లో ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు. ఆస్ట్రేలియా నుంచి మొదలు పెడితే దక్షిణాఫ్రికా వరకు ప్రతి జట్టు మీద టీమ్ ఇండియా అద్భుతమైన విజయాలు సాధించింది. స్వదేశం, విదేశం అని తేడా లేకుండా సత్తా చూపించింది. సూర్య కుమార్ యాదవ్ నాయకత్వంలో టీమిండియా అన్ని రంగాలలో అద్భుతమైన ప్రతిభ చూపి.. అదరగొట్టింది.
సారధిగా సూర్య కుమార్ యాదవ్ జట్టును ముందుండి నడిపిస్తున్నప్పటికీ.. ఆటగాడిగా మాత్రం విఫలమవుతున్నాడు. 2025లో సూర్యకుమార్ అత్యంత దారుణంగా ఆడాడు. 19 ఇన్నింగ్స్ లలో 123.16 స్ట్రైక్ రేట్తో 218 పరుగులు మాత్రమే చేశాడు. వాస్తవానికి మేనేజ్మెంట్ అతడి నుంచి ఇటువంటి ఇన్నింగ్స్ లు ఆశించడం లేదు. అతనికి వరుసగా అవకాశాలు ఇస్తున్నప్పటికీ సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. దీంతో ఆ ప్రభావం మిగతా ప్లేయర్ల మీద పడుతుంది.
ఫిబ్రవరి 7 నుంచి మన దేశం వేదికగా టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతోంది.. దీనికి సంబంధించి ఇప్పటికే మేనేజ్మెంట్ జట్టును ప్రకటించింది. ఈ నేపథ్యంలో సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీ పై నమ్మకం ఉంచిన మేనేజ్మెంట్.. అతడికే సారధ్య బాధ్యతలు అప్పగించింది. మన దేశం వేదికగా టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
” స్కై ఫామ్ చూస్తుంటే నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అతను చాలాకాలంగా టి20 క్రికెట్ ఆడుతున్నాడు. టీమిండియా టి20 క్రికెట్లో కీలక ఆటగాడిగా రూపాంతరం చెందాడు. అతడు ఒకప్పుడు జట్టు సాధించిన విజయాలలో ముఖ్య భూమిక పోషించేవాడు. అయితే ఇటీవల కాలంలో అతడు అంచనాలకు మించి రాణించలేకపోతున్నాడు. ముఖ్యంగా అతడు మెరుగైన ఇన్నింగ్స్ లు ఆడినప్పుడు తక్కువ బంతులను మాత్రమే ఎదుర్కొనేవాడు. ఆ తర్వాత తన రూపాన్ని వేరే విధంగా బౌలర్లకు చూపించేవాడు. కానీ ఇటీవల కాలంలో అతడు కేవలం కొద్ది బంతులు మాత్రమే ఎదుర్కొని.. వెంటనే పెవిలియన్ వెళ్ళిపోతున్నాడు.. సూర్య ఆట, ఆస్ట్రేలియా జట్టులోని హెడ్ ఆట ఒకే తీరుగా ఉంటుంది. వారిద్దరు భయం అనేది లేకుండా ఆడుతుంటారని” పాంటింగ్ పేర్కొన్నాడు.
“పెవిలియన్ చేరుకుంటున్న విషయం గురించి స్కై మర్చిపోవాలి. కేవలం పరుగులు తీసే విషయంపై మాత్రమే దృష్టి సారించాలి. ముందు సూర్య తన మీద తాను నమ్మకం పెంచుకోవాలి. అతడి సమర్ధతను నమ్మాలి అప్పుడే టి20 ఫార్మాట్లో రాణించగలుగుతాడు. టీమ్ ఇండియా టి20 ప్రపంచ కప్ కోసం అక్షర్ పటేల్ ను వైస్ కెప్టెన్ గా నియమించింది. ఈ నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను. పటేల్ బహుముఖ ప్రజ్ఞ కలిగి ఉన్నవాడు. అటువంటి ఆటగాడికి ఈ స్థానం ఇవ్వడం గొప్ప విషయం. గిల్ ను టి20 జట్టు నుంచి తొలగించడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇటీవల వైట్ బాల్ ఫార్మాట్లో గిల్ ఇబ్బంది పడుతున్నాడు. 15 ఇన్నింగ్స్లలో 291 పరుగులు మాత్రమే చేశాడు. అతడి అత్యధిక స్కోరు 47 మాత్రమే. ఇంగ్లాండ్ సిరీస్లో అదరగొట్టిన గిల్.. స్వదేశంలో మాత్రం విఫలం కావడం ఇబ్బందిగా అనిపించింది. ఒక ఆటగాడు వ్యక్తిగత ఆట తీరును ప్రదర్శించే విషయంలో కొన్ని సందర్భాలలో ఎత్తు పల్లాలకు గురికావచ్చు. అంతమాత్రాన అతడిని జట్టు నుంచి తొలగించడం అవివేకమని” పాంటింగ్ వ్యాఖ్యానించాడు. పాంటింగ్ చేసిన విశ్లేషణ బాగుందని చాలామంది అభిమానులు అభిప్రాయపడ్డారు. అయితే 2024 లో టి20 వరల్డ్ కప్ సాధించిన టీమ్ ఇండియా.. 2026 లో స్వదేశంలో జరిగే టోర్నీలో కూడా అదే స్థాయి ప్రతిభను చూపించి.. వరుసగా రెండవ సారి ట్రోఫీ అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.