నేటి కాలంలోనూ ఆడవాళ్ళ మీద వివక్ష ఘోరంగా ఉంది. అన్ని రంగాలలో అద్భుతంగా ప్రతిభ చూపిస్తున్నప్పటికీ ఆడవాళ్ళ మీద ఆంక్షలు ఇప్పటికి కొనసాగుతూనే ఉన్నాయి. బయట సమాజంలోనే కాదు, ఇంట్లో కూడా ఆడవాళ్లకు అనేక రకాల అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. ఇన్ని ప్రతి బంధకాలను ఎదుర్కొంటూ ఆడవాళ్లు ముందుకు వెళ్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఆడవాళ్లను వారసులుగా తల్లిదండ్రులు భావించడం లేదు. పైగా వారిని భారంగా పరిగణిస్తున్నారు.
మన దేశంలో పురుషులతో పోల్చి చూస్తే స్త్రీల జనాభా తక్కువ. బాల బాలికల నిష్పత్తి పరంగా కూడా ఇదే వ్యత్యాసం కనపడుతోంది. అందువల్లే చాలామంది యువకులకు వివాహాలు జరగడం లేదు. దీంతో బ్రహ్మచార్యులు గానే మిగిలిపోతున్నారు. ప్రతి సామాజిక వర్గంలోనూ అమ్మాయిల కొరత తీవ్రంగా ఉంది. దీని ప్రధాన కారణం వారసులుగా అమ్మాయిలను అనుకోకపోవడం.. అమ్మాయిలను కనడానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపించకపోవడం.. గర్భంలో ఉన్నప్పుడు లింగ నిర్ధారణ పరీక్ష చేసుకోవడం.. అందులో ఆడపిల్ల అని తేలితే కడుపులోనే చంపేయడం వంటి ఘటనలు అనేకం గతంలో చోటుచేసుకున్నాయి. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. అందువల్లే ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతుంది.
మనదేశంలో ఆడపిల్లలపై వివక్ష అధికంగా ఉన్న రాష్ట్రాలలో హర్యానా ముందు వరుసలో ఉంటుంది. ఇక్కడ ఇప్పటికే లింగ వ్యత్యాసం తీవ్రంగా ఉంది. ప్రతి 1,000 మంది అబ్బాయిలకు 800+ అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. ఆ రాష్ట్రంలో పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పటికీ తల్లిదండ్రుల ఆలోచన విధానం మారడం లేదు. తాజాగా హర్యానా రాష్ట్రంలోని ఉచాన ప్రాంతంలో ఓ జంట వారసుడి కోసం ఏకంగా పదిమంది అమ్మాయిలను కన్నారు. 11వ సంతానంగా అబ్బాయి జన్మించాడు. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ మాతృమూర్తి రక్తహీనత తో బాధపడుతున్నప్పటికీ.. వారసుడు కావాలని కోరికతో గర్భం దాల్చడం విశేషం. మరోవైపు కొడుకు పుట్టాడనే ఆనందంతో ఆ తండ్రి తన పదిమంది అమ్మాయిలలో కొంతమంది పేర్లను మర్చిపోవడం విశేషం. ఈ ఘటనపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పుత్రకాంక్ష వల్ల తండ్రి చివరికి తన అమ్మాయిల పేర్లు కూడా మర్చిపోయాడని.. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదని వ్యాఖ్యానిస్తున్నారు.