NIA Raids: ఢిల్లీ లిక్కర్ స్కాం తెలంగాణ రాష్ర్టాన్ని వణికిస్తుంది. ఈ వ్యవహారం ప్రస్తుతం నిజామాబాద్‌కు పాకిందనడంలో సందేహం లేదు.. నిజామాబాద్ లో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేల నివాసాల్లో ఎన్ఐఏ విసృతంగా సోదాలు నిర్వహిస్తుంది. టీఆర్ఎస్ ను ఇరికించి తాము లబ్ధి పొందుతామని ప్రతి పక్షాలు ఈ కుట్రపూరిత దాడులు నిర్వహిస్తుందని ఒక వైపు వాదనలు వినిపిస్తున్నా. నిప్పులేనిదే పొగ రాదని మరికొందరు చర్చించుకుంటున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనంటూ ఆ ఎమ్మెల్యేలకు గుబులు పట్టుకుంది. సాక్షాత్తు సీఎం కుమార్తె స్కాంలో ఉన్నా ఏం చేయలేని పరిస్థితి ఉందని. ఇక తామెంత.. దేవుడే కాపాడాలని వారు వేడుకుంటున్నారని అనుచరులు బాహాటంగానే చెప్పుకుంటున్నారు.

నిజామాబాద్ కేంద్రంగా భారీగా ఆర్థిక లావాదేవీలా?
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎన్ఐఏకు ఎలాంటి సంబంధం లేకపోయినా ఈ సోదాలకు కారణం ఏంటని ఎజెన్సీ బయటపెట్టడం లేదు. ఈ దాడులను మిస్టరీగా ఉంచుతున్నారు. నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం జోరుగా సాగింది. గతంలో రెండేళ్ల పాటు కొనసాగిన సోదాల్లో వేలాది కోట్ల నగదు బయటపడింది. సంఘ విద్రోహ శక్తులకు ఇక్కడి నుంచి డబ్బలు వెళ్తున్నాయా? ఇతర దేశాల నుంచి ఇక్కడికి ఫండ్స్ వస్తుందా అనే అనేక సందేహాల నేపథ్యంలో ఈ దాడులు జరిగినట్లు వినిపిస్తున్నాయి.
అనూహ్యంగా దాడులు
సదరు ఎమ్మెల్యేలను పద్మవ్యూహంలో ఇరికించారు. ఎటూ కదలకుండా చేశారు. వారి ఆర్థిక లావాదేవీలు, కార్యకలాపాలపై గట్టి నిఘా పెట్టారు. ఎలాంటి సమాచారం లేకుండా హైదరాబాద్ నుంచి 30 ఎన్ఐఏ టీమ్స్ వారి నివాసాలపై దాడులు చేసినట్లు తెలుస్తోంది. శనివారం, ఆదివారం నిర్వహించిన రైడ్స్‌పై గోప్యత ప్రదర్శిస్తున్నారు. దాడి కోసం ఎన్ఐఏ బృందాలు దాదాపు మూడు రోజుల ముందుగానే పథకం వేసుకున్నట్లు తెలుస్తున్నది. జీఎస్టీ సహకారం కూడా తీసుకోవాలని కోరినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలకు సంబంధించి ఆడిట్ చేసే వారిని కూడా వారి వెంట ఎన్ఐఏ తీసుకెళ్లింది. సోదాల విషయం రెండు రోజుల ముందే ఖరారైనా గోప్యత ప్రదర్శించినట్లు తెలుస్తున్నది. దాడులకు కొంత మంది సిబ్బంది కావాలని పోలీస్, జీఎస్టీ చీఫ్, తదితర ఉన్నతాధికారులకు ముందుగానే లేఖ ద్వారి విజ్ఞప్తి చేశారు. ఇందుకు జీఎస్టీ అధికారులు 20 మందిని రెండు రోజుల పాటు పంపేందుకు అనుమతి తెలిపింది. ఆర్థిక అంశాలపై పూర్తి అవగాహన ఉంటే మంచిదని వీరిని సమకూర్చుకున్నట్లు తెలసింది.

టీఆర్ఎస్ కు మరో దెబ్బ
ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో ఈడీ నిర్వహిస్తున్న సోదాల్లో సీఎం కుమార్తె కూతురు కల్వకుంట్ల కవిత ఇటీవల బాగా వార్తల్లోకి ఎక్కింది. ఈ వ్యవహారంతో పాలక పక్షంపై ప్రతిపక్షం నిత్యం విమర్శనాస్ర్తాలు గుప్పిస్తూనే ఉంది. ఈ పూర్తి వ్యవహారంలో కవితను సీఎం మందలించినట్లుగా కూడా చర్చ జరుగుతోంది. సాక్షాత్తు ఆమె ఎమ్మెల్సీగా ప్రాతినిద్యం వహిస్తున్న ఇలాకాలోనే మరో ఇద్దరు ఎమ్మెల్యేలపై ఎన్ఐఏ సోదాల నేపథ్యంలో నియోజకవర్గంతో పాటు టీఆర్ఎస్ ఉలిక్కిపడింది. దెబ్బమీద దెబ్బ పడుతుందని ఎలా బయటపడాలని పార్టీలో చర్చ జరగుతోంది. ఆర్మూర్ పట్టణానికి చెందిన ఇద్దరు కీలక నేతలను ఎన్ఐఏ ప్రశ్నించినట్లు అనుచరుల ద్వారా తెలుస్తుంది. రెండు రోజుల్లో ఒకేసారి దాదాపు 25 ప్రాంతాలలో ఈడీ తనిఖీలు చేపట్టింది. దాడులకు సంబంధించి 12 మందికి నోటీసులు జారీ చేసింది. ఇందులోనే కవిత కూడా ఉంది. కానీ తనకు ఎలాంటి నోటీసులు అందలేదని కవిత ట్విటర్ ద్వారా సమాధానం ఇవ్వడం కొసమెరుపు.