News Thumbnail Ethics: వార్తను వార్త లాగా ప్రసారం చేయాలి. విషయాన్ని విషయం తీరుగా ప్రస్తావించాలి. అంతేతప్ప వార్త నడవడిక ఒక విధంగా.. వార్తకు పెట్టిన శీర్షిక మార్గ విధంగా ఉంటే చూసే వాళ్లకు ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యూస్ కోసం ఇలాంటి ప్రయత్నాలు చేసినప్పటికీ.. అన్ని సందర్భాలలో ఇది ఆమోదయోగ్యంగా ఉండదు. పైగా వీక్షకులకు ఇబ్బంది కలిగిస్తుంది.
ఇటీవల ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ థంబ్ నెయిల్స్ ఎంతటి రచ్చను సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాటి వల్ల ఓ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేసింది. ఆ న్యూస్ ఛానల్ కార్యాలయం పై దాడి కూడా చేసింది. ఈ వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఇదే అదునుగా ఓ పార్టీ నాయకులు వైషమ్యాలు సృష్టించడానికి ప్రయత్నం చేయించారు. సీమాంధ్ర, తెలంగాణ మీడియా అంటూ వ్యాఖ్యలు చేశారు.. చివరికి ఇంకా కొన్ని చానల్స్ పై దాడులు చేయాల్సి ఉందని హెచ్చరించారు. ఈ ఘటన తర్వాత బుద్ధి జీవులు.. సీనియర్ పాత్రికేయులు మీడియా అనుసరించాల్సిన లక్ష్మణ రేఖను మరోసారి గుర్తు చేశారు. థంబ్ నెయిల్స్ పెట్టే విషయంలో జాగ్రత్త వహించాలని సూచించారు. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కొన్ని సూచనలు కూడా చేశారు. కానీ అవి గాలి మాటలు గానే మారిపోయాయి.
Also Read: జగన్ ఓడిపోతారని నేను ఊహించలేదు.. కేటీఆర్ కామెంట్స్ వైరల్!
కొన్ని చానల్స్ థంబ్ నెయిల్స్ విషయంలో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాయి. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాయి. వివరణతో సంబంధం లేకుండా.. విషయంతో సంబంధం లేకుండా ఇష్టానుసారంగా థంబ్ నెయిల్స్ పెడుతున్నారు. వార్త లో ఉన్న విషయంతో సంబంధం లేకుండా అలాంటి థంబ్ నెయిల్స్ పెట్టడాన్ని నెటిజన్లు తప్పు పడుతున్నారు. ఇలాంటి బీ గ్రేడ్ జర్నలిజంతో ఎటువంటి సంకేతాలు సమాజానికి ఇస్తున్నారంటూ మండిపడుతున్నారు.
కొన్ని చానల్స్ వైసిపి అధినేత పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన థంబ్ నెయిల్స్ ను ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు. అక్కడ జరిగిన విషయంతో సంబంధం లేకుండా కేవలం వ్యూస్ కోసం ఇష్టానుసారంగా పెట్టిన థంబ్ నెయిల్స్ ను ప్రస్తావిస్తున్నారు..” ఇటీవల ఓ న్యూస్ ఛానల్ వ్యవహారంలో ఏం జరిగిందో చూసాం. అయినప్పటికీ కొన్ని చానల్స్ మారడం లేదు. పైగా బజారు భాష వాడుతున్నాయి. బజార్ భాషలో శీర్షికలు పెడుతున్నాయి. ఇటువంటి వాటితో అవి సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నాయో అర్థం కావడం లేదు. కనీసం కుటుంబంతో కలిసి న్యూస్ ఛానల్ చూడలేని పరిస్థితి ఏర్పడింది. ఇకపై న్యూస్ ఛానల్స్ చూడాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఓ చానల్ అధినేతకు ఇటీవల తగిన శాస్తి జరిగింది. అయినప్పటికీ మిగతా వారికి బుద్ధి రావడం లేదు. వారు ప్రదర్శించే బి గ్రేడ్ జర్నలిజంలో ఎటువంటి మార్పు లేదు. ఇటువంటి వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని.. టార్గెట్ జర్నలిజాన్ని మార్చాలని..” నెటిజన్లు ఈ సందర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు.