Nandamuri Suhasini: తెలంగాణ రాజకీయాల్లో సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బయటికి కనిపించకపోయినప్పటికీ అధికార కాంగ్రెస్ లో కలహాలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు గులాబీ, కాషాయ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ పులను బయటపెడుతున్నారు. గతంలో చేసిన కుంభకోణాలను పదేపదే వల్లె వేస్తున్నారు. “మా పార్టీని కనుక ముట్టుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు రోజుల్లోనే నేలమట్టమవుతుందని” ఓ బిజెపి ఎమ్మెల్యే ఇటీవల హెచ్చరించారు. “ప్రజల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వం ఆరు నెలల్లో కూలిపోతుంది. తర్వాత భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తుందని” హరీష్ రావు ఆ మధ్య హెచ్చరించారు. వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి మద్దతు తెచ్చుకుని చేరికలకు రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో వరుస పెట్టి కాంగ్రెస్ పార్టీలోకి భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎంపీ చేరారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి ఒక విధంగా ఉంటే.. ఆంధ్రాకు సరిహద్దులో ఉన్న ఖమ్మం జిల్లాలో మరో విధంగా ఉంది.
ఖమ్మం పార్లమెంట్ స్థానం కోసం ముగ్గురు మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పోటీ పడుతున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన తమ్ముడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కోసం టికెట్ ఆశిస్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు తన కుమారుడు తుమ్మల యుగేందర్ కోసం టికెట్ కావాలని పట్టుబడుతున్నారు. భట్టి విక్రమార్క తన సతీమణి మల్లు నందిని కోసం టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ ముగ్గురు నాయకులు ప్రభుత్వంలో కీలకంగా ఉండటం.. టికెట్ కోసం పట్టు పడుతుండడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిని అర్థం కాని పరిస్థితి నెలకొంది. ముగ్గురిలో ఎవరికి టికెట్ ఇచ్చినా.. మిగతా ఇద్దరికీ రేవంత్ రెడ్డి శత్రువు అవుతారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి శత్రువులను చేసుకొనే స్థితిలో లేడు. ఈ ముగ్గురు కూడా బలమైన నాయకులు కాబట్టి ప్రభుత్వాన్ని ఏమైనా చేయగలరు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలతో మాట్లాడారు. ప్రియాంక గాంధీని ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయించాలని కోరాడు. అయితే ఆమె ఉత్తర భారతదేశం నుంచి పోటీ చేసేందుకే ఇష్టపడుతున్నారు.
ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు బయట వ్యక్తిని పోటీ చేయించాలని రేవంత్ భావించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నందమూరి కుటుంబానికి చెందిన సుహాసినిని కాంగ్రెస్ పార్టీలోకి రప్పించినట్టు తెలుస్తోంది. ఆమె కాంగ్రెస్ లోకి రావడానికి తెర వెనుక చంద్రబాబు నాయుడి పాత్ర కూడా ఉందని చెబుతున్నారు. మరోవైపు ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు ఎక్కువగా ఉన్నారు. నందమూరి అభిమానులు, టిడిపి అభిమానులున్నారు. గతంలో చంద్రబాబు ఈ ప్రాంతంలో సభ నిర్వహిస్తే భారీగా జనం వచ్చారు. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి సుహాసినిని టిడిపి నుంచి కాంగ్రెస్ లోకి రప్పించినట్టు ప్రచారం జరుగుతున్నది. అంతేకాదు ఆమెను ఖమ్మంలో నుంచి పోటీ చేయించేందుకు రకరకాల అశ్రద్ధలు అంతేకాదు ఆమెను ఖమ్మంలో నుంచి పోటీ చేయించేందుకు కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం నుంచి నామా నాగేశ్వరరావు ఎంపిక పోటీ చేస్తున్నారు. ఆయనకు భారత రాష్ట్ర సమితి టికెట్ ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ నుంచి తాండ్ర వినోద్ రావు బరిలో ఉన్నారు. ఈయన వెలమసామాజిక వర్గానికి చెందినవారు. ఈ జిల్లా వాసి కావడంతో.. ఆయనకు ఈ ప్రాంతం మీద విపరీతమైన పట్టు ఉంది. గెలుపుపై ఆయన దీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ సుహాసిని కనుక పోటీ చేస్తే ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ ఏర్పడుతుంది. అంతేకాదు రేవంత్ కు “ఆ ముగ్గురి” సమస్య కూడా పరిష్కారమవుతుంది.