Kaleswaram Project : “కాలేశ్వరం లేకుండా ఎండాకాలంలో నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. మాట మాట్లాడితే లక్ష కోట్లు దోచుకున్నామని అన్నావ్. కెసిఆర్ తిన్నాడని ఆరోపించావు. కేటీఆర్ కు బినామీ కంపెనీలు ఉన్నాయని వ్యాఖ్యానించావు. హరీష్ రావు మెక్కాడని కూశావ్. ఇకపై ఇలాంటి మాటలు మాట్లాడితే కుదరదు.. ఆరోపణలు చేస్తే మామూలుగా ఉండదు” ఇలా సాగిపోయింది నమస్తే తెలంగాణ లో ఇవాల్టి కథనం. ఏకంగా మాస్టర్ హెడ్ పైకే కాలేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించిన డ్రోన్ ఫోటోను ఆరు కాలాలు పరిచేసింది. పైగా సెంటర్ స్ప్రెడ్ లో వివరణలు ఇచ్చింది. నంబర్లు ఇచ్చుకుంటూ.. గ్రాఫిక్స్ లెక్కలతో కుమ్మి పడేసింది. ఇదేమీ ఎన్నికల సీజన్ కాదు. పైగా గోదావరి కి విపరీతమైన వరదలేం రావడం లేదు. ఇలాంటి సందర్భాలేమీ లేకపోయినప్పటికీ నమస్తే తెలంగాణ కాలేశ్వరం మీద జబ్బలు చరుచుకుంది.
దాని వెనుక దాగి ఉన్నది ఇదీ
కాలేశ్వరం మీద చాలా రోజులుగా చర్చ జరుగుతున్నదే. అయితే దీనిపై విచారణ కమిషన్ చాలా ఆగ్రహంగా ఉంది. దీని వెనుక ఉన్న గుట్టు మట్లను చేదించే పని ఎప్పటినుంచో చేస్తూనే ఉంది. ఇదేదో బూమారాంగ్ అవుతుందనే భయంతోనే నమస్తే తెలంగాణ ఇలాంటి కథనాన్ని ప్రచురించిందని.. ఇది మైండ్ గేమ్ కాదని.. జస్ట్ మాయ చేయడానికి.. ప్రజల కళ్ళకు గంతలు కట్టడానికి చేసిన అక్షర విన్యాసమని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. నమస్తే తెలంగాణ అనేక రకాలుగా ఇబ్బంది పడి ఫస్ట్ పేజీ వార్తను పబ్లిష్ చేస్తే.. ఈనాడు కూడా ఫస్ట్ పేజీలోనే ఏకంగా బై లైన్ పేరుతో ఒక స్టోరీ వేసింది…”కాలేశ్వరం నిర్మాణ సమయంలో అధికారులు, కాంట్రాక్టర్లు ఎలా ములాఖాత్ అయ్యారు? నాణ్యతకు ఎలా మంగళం పాడారు? రిపోర్ట్ లలో మాయ ఎలా చేశారు? ఫేక్ ధ్రువీకరణలు ఎలా సిద్ధం చేశారు? వీటన్నింటినీ విజిలెన్స్ వాళ్ళు నిగ్గు తేల్చారు. విచారణ కమిషన్ కు చాంతాడంత నివేదిక సమర్పించారని” ఈనాడు రాసుకొచ్చింది. అయితే ఈ నివేదిక ప్రభుత్వానికి కూడా చేరిందట. ఈ నివేదిక ప్రకారం ప్రభుత్వం ఆ ఇంజనీర్ల పై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు, చర్యలు తీసుకునేందుకు వేగంగా అడుగులు వేస్తోందట. కేసీఆర్ ను పక్కా ఆధారాలతో బుక్ చేసేందుకు సిద్ధమైందట.. వీటిపై వాసన అందిందో.. లేకుంటే గాంధీభవన్ లో గులాబీ వీర విధేయులు సమాచారం అందించారో తెలియదు కాని.. నమస్తే తెలంగాణ కాలేశ్వరం పై పేజీలకు పేజీలు నింపి పడేసింది.
ఈ ప్రశ్నలకు సమాధానం ఏదీ
నమస్తే తెలంగాణ తన కథనంలో పంప్ హౌస్ లు నిక్షేపంగా ఉన్నాయని రాస్కొచ్చింది. కానీ గతంలో పంప్ హౌస్ మునిగిపోయిన విషయాన్ని మాత్రం చెప్పడం లేదు. ఎల్లంపల్లి నుంచి నీళ్లు వస్తే అది మొత్తం కాలేశ్వరం ఘనత అని చెబుతోంది. అన్నారం, మేడిగడ్డ బరాజ్ లు బాగోలేవని.. వాటి వల్ల ఎప్పటికీ ముప్పేనని ఢిల్లీ ఇంజనీర్లు ఎప్పుడో రిపోర్ట్ ఇచ్చారు. కానీ ఆ విషయాన్ని నమస్తే తెలంగాణ ప్రస్తావించలేదు. చివరికి నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ చెబుతున్న హెచ్చరికలను కూడా పట్టించుకోలేదు. కనీసం ఆ విషయాలను ప్రస్తావనకు కూడా తీసుకోలేదు. కెసిఆర్ మౌత్ పీస్ కాబట్టి అలా ఎలా రాస్తుంది.. అలా రాస్తే అది నమస్తే తెలంగాణ ఎందుకవుతుంది. తెలంగాణలో ఇంత జరుగుతున్నప్పటికీ ఆంధ్రజ్యోతికి కాలేశ్వరం పట్టలేదు. సాక్షి ఎలాగూ రాయదు. పాపం వివేకుడి వెలుగు ఈ విషయాన్ని పూర్తిగా మర్చిపోయింది. అన్నట్టు ఈనాడు కాలేశ్వరం గురించి బై లైన్ స్టోరీ ఎందుకు వేసినట్టు?!
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More