Kalvakuntla Kavitha Namaste Telangana: కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన శాసన మండలి సభ్యుడు తీన్మార్ మల్లన్న గులాబీ పార్టీ శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితపై “కంచం పొత్తా, మంచం పొత్తా” చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున దుమారానికి కారణమయ్యాయి. కల్వకుంట్ల కవితను ఉద్దేశించి తీన్మార్ మల్లన్న ఆ వ్యాఖ్యలు చేయడంతో సహజంగానే జాగృతి కార్యకర్తలు భగ్గుమన్నారు. ఆదివారం మేడిపల్లి ప్రాంతంలోని క్యు న్యూస్ కార్యాలయం పై దాడి చేశారు. ఈ దాడిని జాగృతి కార్యకర్తలు సమర్థించుకున్నారు. సహజంగానే తీన్మార్ మల్లన్న తనకు అలవాటైన భాషలో ఖండించాడు. అటు కల్వకుంట్ల కవిత కూడా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తనను దూషించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ డిజిపి కి ఫిర్యాదు చేశారు. తీన్మార్ మల్లన్న కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read: ఏపీకి కొత్త నేషనల్ హైవే.. ఆ జిల్లాలకు మహర్దశ!
జాగృతి కార్యకర్తలు అంతస్థాయిలో దాడి చేసినప్పటికీ నమస్తే తెలంగాణ పట్టించుకోలేదు. పైగా తీన్మార్ మల్లన్న గన్మెన్ కాల్పులు చేర్పాడంటూ లోపల పేజీలో ఓ సింగిల్ కాలం వార్తను ప్రచురించింది. ఇక ఇటీవల కేటీఆర్ పై అడ్డగోలుగా థంబ్ నెయిల్స్ పెట్టి.. విష ప్రచారానికి తెరలేపిన ప్రైవేటు న్యూస్ ఛానల్ కార్యాలయం పై గులాబీ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. దానిని సహజంగానే నమస్తే తెలంగాణ గొప్పగా ప్రచురించింది. తెలంగాణ వాసుల్లో రగిలిన ఆగ్రహం అంటూ వార్తను అచ్చేసింది . కేటీఆర్.. కవితపై జరిగిన దూషణల విషయంలో నమస్తే తెలంగాణ స్పందించిన తీరు వేరే విధంగా ఉంది. ఇటీవల కాలంలో కేటీఆర్ తో విభేదాలు ఉన్నాయని కవిత స్పష్టం చేశారు. ఓ జర్నలిస్టు నిర్వహించిన ఇంటర్వ్యూలో కూడా ఆమె అదే విషయాన్ని చెప్పారు. మొత్తంగా తమ కుటుంబంలో భేదభిప్రాయాలు ఉన్నాయని కవిత స్పష్టం చేశారు. సహజంగా లోగోట్టును బయట పెట్టుకోవడానికి కేసీఆర్ ఇష్టపడరు. పైగా దానిని కవర్ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ కుటుంబంలో.. పార్టీలో జరుగుతున్న వివాదాలను కవిత ఇలా అనేక సందర్భాలలో బయట పెట్టడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తోంది. అందువల్లే ఆమెను దూరం పెడుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల కాలేశ్వరం కమిషన్ విచారణకు కేసిఆర్ హాజరవుతున్నప్పుడు ఆమె నేరుగా ఎరవల్లి వెళ్లారు. తండ్రిని కలవడానికి ప్రయత్నించారు. దానికి కేసీఆర్ ఒప్పుకోలేదు. పైగా కవితతో మాట్లాడటానికి ఆసక్తిని ప్రదర్శించలేదు. అయినప్పటికీ కవిత సమయం దొరికిన ప్రతి సందర్భంలోనూ కేసీఆర్ సుప్రీం లీడర్ అంటూ వ్యాఖ్యానిస్తోంది. ఆయనకు కాలేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని వ్యతిరేకించింది. ధర్నా కూడా చేసింది. ఇంత చేసినప్పటికీ కూడా ఆమె కెసిఆర్ మనసులో మునుపటి స్థానాన్ని సంపాదించుకోలేకపోతున్నదని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికి తన రాజకీయ వారసుడిగా కేటీఆర్ నే కెసిఆర్ భావిస్తున్నారని.. అతడికే నాయకత్వ బాధ్యతలు అప్పగించారని ప్రచారం జరుగుతోంది. పైకి ఎన్ని లెక్కలు చెప్పినప్పటికీ.. ఎన్ని సూత్రీకరణలు చేసినప్పటికీ కవిత విషయంలో టచ్ మీ నాట్ అన్నట్టుగానే కేసీఆర్ వ్యవహార శైలి ఉంటున్నదని రాజకీయ విశ్లేషకుల మాట. దానికి తగ్గట్టుగానే పరిణామాలు కూడా చోటు చేసుకోవడం విశేషం. గతంలో ఢిల్లీ మద్యం కేసులో కవితను కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్టు చేసినప్పుడు నమస్తే తెలంగాణలో తలవంచదు తెలంగాణ అనే శీర్షికతో ఓ కథనం ప్రచురితమైంది. నాడు బ్యానర్ వార్తగా ఉన్న ఆమె.. నేడు లోపలి పేజీలకు పరిమితం కావడం గమనార్హం. నమస్తే తెలంగాణలో పైనుంచి ఆదేశాలు రాకుండా ఇలా వార్తలు ప్రచురించరు. పైగా కల్వకుంట్ల కవిత కెసిఆర్ కుమార్తె. అయినప్పటికీ ఆమెను లోపలి పేజీలకు పరిమితం చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.