Nagarjuna Sagar Safari: ఆలస్యంగా నైనా సరే వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం ఆహ్లాదంగా ఉంది. వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ప్రకృతి కూడా ఆకుపచ్చ వర్ణాన్ని సంతరించుకుంది. ఇక ఈ సమయంలో కాంక్రీట్ జంగిల్ లాంటి నగరాలను వదిలిపెట్టి.. అడవులను సందర్శిస్తే వచ్చే మజానే వేరు. పైగా నేటి కాలంలో ఆర్థిక స్థిరత్వం పెరిగిన నేపథ్యంలో చాలామంది వీకెండ్స్ లో భిన్నమైన ప్రాంతాలను చూసేందుకు ఇష్టపడుతుంటారు. ఇందులో నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ముందు వరసలో ఉంటుంది. ఈ ప్రాంతం అభయారణ్యం కావడంతో ఇక్కడ జంతువులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా పులులు కూడా విస్తారంగా ఉంటాయి. ఈ సమయంలో సఫారీ ద్వారా పులులను చూసేందుకు చాలామంది ఇష్టపడుతుంటారు. తమ కెమెరాలలో వ్యాఘ్రాల ఫోటోలను బంధించి సంతోషపడుతుంటారు. అయితే ఇప్పుడు పర్యాటకులు సఫారీ వెళ్లడానికి అవకాశం లేదు.
Also Read: Banakacharla Project: అసలేంటి బనకచర్ల ప్రాజెక్ట్.. ఏపీకి ఏం ప్రయోజనం? కేంద్రం ఎందుకు నో చెప్పింది?
నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాంతంలో సఫారీ ఎప్పటినుంచో కొనసాగుతోంది. ఈ సఫారీలో పాల్గొనడానికి ఎక్కడెక్కడ నుంచో పర్యాటకులు వస్తుంటారు. అడవి అందాలను వీక్షిస్తూ మైమరచిపోతుంటారు. జింకల హొయలు .. నెమళ్ల నృత్యాలు.. దుప్పుల గెంతులు.. మనుబోతుల గాంభీర్యం.. పులుల వేట తంత్రం అన్నింటిని చూసి ఆనందిస్తుంటారు.. దీనికోసం ఎన్ని ప్రయాసలైనా పడతారు. ఎన్ని ఇబ్బందులు అయినా ఎదుర్కొంటారు. ఎందుకంటే పచ్చటి అడవి మధ్య ఉంటే ఆ మజా వేరే విధంగా ఉంటుంది. పైగా పచ్చని అడవిలో తిరుగుతుంటే ఒత్తిడి మాయమవుతుంది.
అయితే నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాంతంలో మరో మూడు నెలల పాటు సఫారీకి అవకాశం ఉండదు. ఎందుకంటే దట్టమైన నల్లమల్ల అడవిలోకి మనుషులు ప్రవేశించే మార్గాలను జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు అటవీశాఖ అధికారులు నిషేధించారు. ఎందుకంటే ఈ మూడు నెలలను వన్యప్రాణుల సంతాన ఉత్పత్తి కాలంగా అధికారులు చెబుతున్నారు. అందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సఫారీ వల్ల అడవిలోకి వెళ్లి జంతువులను ఇబ్బంది పెట్టడం సరికాదని అధికారులు చెబుతున్నారు..” ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి.. అడవులు దట్టమైన పచ్చని రంగును సంతరించుకున్నాయి. ఇలాంటి క్రమంలో జంతువులు సంతానోత్పత్తికి ఆసక్తిని చూపిస్తుంటాయి. ఇలాంటి సమయంలో జంతువులను ఇబ్బంది పెట్టకూడదు. వాటి ఏకాంతాన్ని భగ్నం చేయకూడదు. అందువల్లే మూడు నెలల పాటు టైగర్ రిజర్వ్ ప్రాంతంలో సఫారిని నిషేధించాం. సెప్టెంబర్ 30 తర్వాత సఫారీ పున: ప్రారంభమవుతుంది. అప్పటిదాకా ఈ నిషేధం కొనసాగుతూనే ఉంటుంది. నల్లమల అడవిలోకి మానవ ప్రవేశ మార్గాలను కూడా పూర్తిగా నిషేధించాం. పొరపాటున ఎవరైనా ప్రవేశిస్తే చర్యలు తీసుకుంటామని” అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం నల్లమల అడవిలో పుల్లల సంఖ్య గతంతో పోల్చి చూస్తే పెరిగింది. ఇక ఇటీవలి కాలంలో ఇతర ప్రాంతాల నుంచి పులులు ఈ ప్రాంతానికి వస్తున్నాయి. ఇక్కడ జింకలు, దుప్పులు విస్తారంగా ఉన్నాయి. ఫలితంగా పులులకు కావలసినంత ఆహారం లభిస్తున్నది. నీటి వనరులు కూడా ఉండడంతో పులులు స్వేచ్ఛగా విహరించగలుగుతున్నాయి. పులుల సంతతిని మరింత పెంచడానికి అటవీశాఖ అధికారులు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే వాటి సంతానోత్పత్తికి అనువైన వాతావరణం ఏర్పాటు చేస్తున్నారు. సఫారీపై మూడు నెలల పాటు నిషేధం విధించడం కూడా ఇందులో భాగమేనని తెలుస్తోంది.