My Home Ganesh laddu auction 2025: తెలంగాణలో గణపతి అంటే ముందుగా గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ వినాయకుడు. లడ్డు ధరలో ముందుగా గుర్తుకు వచ్చేది బాలాపూర్. ఈ రెండు కూడా హైదరాబాదు నగరానికి ఐకానిక్ సింబల్స్ లాంటివి. తెలంగాణ ప్రాంతంలో ఖైరతాబాద్ గణపతిని మించి మరొక వినాయకుడిని ఇంతవరకు తయారు చేసింది లేదు. అలాగే బాలాపూర్ ప్రాంతంలో పలికిన ధరను మరో ప్రాంతంలో ఇంకో గణపతి లడ్డు బీట్ చేసింది లేదు. ఖైరతాబాద్ గణపతిని పక్కన పెడితే.. లడ్డు ధరలో బాలాపూర్ ను మించేలా కనిపిస్తోంది రాయదుర్గం మై హోమ్ భుజ..
గత ఏడాది బాలాపూర్ ప్రాంతంలో లడ్డును వేలం వేయగా 30 లక్షల ధర లభించింది.. ఇది ఒక రకంగా ఆల్ టైం రికార్డ్ లాగా నమోదయింది. గత ఏడాది రాయదుర్గంలోని మై హోమ్ భుజ ప్రాంతంలో ఏర్పాటు చేసిన గణపతి లడ్డును వేలం వేయగా దాదాపు 20 లక్షలకు పైగా పలికింది. ఖమ్మం నగరానికి చెందిన ఓ వ్యక్తి ఆ లడ్డును సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పుడు అదే రాయదుర్గంలోని మై హోమ్ భుజా ప్రాంతంలో ఏర్పాటు చేసిన గణపతి లడ్డూను వేలం వేయగా ఏకంగా 51,77,777 ధర లభించింది. ఈ లడ్డును ఓ వ్యాపారవేత్త సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. పోటాపోటీగా సాగిన వేలం ధర 50 లక్షలకు పైచిలుకు పెరిగింది. గత ఏడాదితో పోల్చి చూస్తే 30 లక్షలు అదనంగా వచ్చాయని తెలుస్తోంది.
మై హోమ్ భుజ ప్రాంతంలో వ్యాపారవేత్తలు అధికంగా ఉంటారు. ఫార్మా, ఐటి, నిర్మాణరంగం, స్థిరాస్తి, ఎలక్ట్రానిక్స్ విభాగాలలో పనిచేసే పెద్ద పెద్ద వ్యక్తులు.. అధిపతులు ఇక్కడ నివాసం ఉంటారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు. ఇక్కడ ఆగర్భ శ్రీమంతులు ఉండడంతో లడ్డును సొంతం చేసుకోవడానికి పోటాపోటీగా వేలం పాడారు. తద్వారా రికార్డు స్థాయిలో ఈ గణపతి లడ్డుకు ధర లభించింది. అయితే లడ్డు వేలం ద్వారా వచ్చిన నగదును సమాజ హిత కార్యక్రమానికి ఉపయోగిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.
ఇటీవల ఈ గణపతి వద్ద దాండియా నృత్యం నిర్వహించారు. అన్న ప్రసాద వితరణ కూడా చేపట్టారు. ప్రఖ్యాత పాకశాస్త్ర నిపుణులను తీసుకొచ్చి అన్నదానం నిర్వహించారు. విగ్రహాన్ని ఏర్పాటు చేసిన దగ్గర నుంచి నవరాత్రి ఉత్సవాలు ముగింపు వరకు ప్రతిరోజు ఇక్కడ అన్నదానం నిర్వహించినట్టు నిర్వాహకులు పేర్కొన్నారు. లడ్డు వేలం ఉదయం పదిగంటలకు మొదలు కాగా.. మధ్యాహ్నం 12 గంటలకు పూర్తయింది. బాలాపూర్ లడ్డు వేలం శుక్రవారం జరుగుతుందని తెలుస్తోంది. బాలాపూర్ లడ్డు మై హోం భుజా కంటే ఎక్కువ ధర పలుకుతుందని పలువురు అంచనా వేస్తున్నారు.
రాయదుర్గం మైహోమ్ భుజాలో రికార్డు ధర పలికిన గణేష్ లడ్డు
రూ.51,77,777 లక్షలు పలికిన వినాయకుడి లడ్డు https://t.co/8oP1DWta2q pic.twitter.com/3zGNaYwnva
— Telugu Scribe (@TeluguScribe) September 4, 2025