HomeతెలంగాణMunicipalities: జై కేసీఆర్ అన్న వారే అవిశ్వాసం పెడుతున్నారు

Municipalities: జై కేసీఆర్ అన్న వారే అవిశ్వాసం పెడుతున్నారు

Municipalities: “జై కేసీఆర్.. జై కేటీఆర్. తెలంగాణ దేశానికి దారి చూపిస్తోంది. అన్ని రంగాలలో అగ్రగామిగా నిలుస్తోంది. ఆ పెద్ద బొందు మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ కంటే అన్ని రంగాలలో ముందుంది.” అని అన్న వారే.. వంగి వంగి దండాలు పెట్టిన వారే.. ఇప్పుడు దూరమవుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేసిన వారే మేము వేగలేమంటూ బయటికి వస్తున్నారు. పార్టీలో ఉన్న వారే పార్టీ నేతలపై అవిశ్వాసం పెడుతూ తెలంగాణలో సరికొత్త రాజకీయానికి తెరలేపుతున్నారు. ఫలితంగా ప్రతిపక్ష కారు పార్టీకి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతోంది.. ఎన్నికల్లో ఓటమి, కెసిఆర్ తుంటి ఎముక విరగటం, ఇప్పుడేమో వరుస అవిశ్వాసాలతో ఆ పార్టీలో ఒక్కసారిగా నైరాశ్యకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి.

అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారత రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా ఎన్నో ఎత్తులు వేసింది. 2014లో టిడిపి, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల నుంచి ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించి తన పార్టీలో కలిపేసుకుంది. 2018లో ప్రజలు భారీ మెజారిటీ ఇచ్చినప్పటికీ అదే ఆపరేషన్ ఆకర్ష్ ను కొనసాగించింది. మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ విపక్షం అనేది లేకుండా చూసుకుంది. ఎక్కడైనా విపక్షాలు గెలిచే అవకాశం ఉన్నచోట నిబంధనలకు వక్ర భాష్యం చెప్పింది. తను చెప్పిందే వేదం అనే లాగా చివరికి అవిశ్వాసం కూడా పెట్టకుండా పురపాలక చట్టంలో మార్పులు చేర్పులు తీసుకొచ్చింది. అయితే అప్పట్లో గవర్నర్ దీనికి ఆమోదముద్ర వేయలేదు. ఒకవేళ వేసి ఉంటే టీఆర్ఎస్ నాయకత్వంపై సొంత పార్టీ నాయకుల్లో ఉన్న అసంతృప్తి బయటికి వచ్చేది కాదు. ఇష్టం ఉన్నా లేకున్నా ఆ పార్టీలోనే ఉండాల్సి వచ్చేది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఓడిపోవడంతో ఆ పార్టీ నాయకుల్లో కొంతమందికి అపరిమితమైన స్వేచ్ఛ వచ్చినట్టు అనిపించింది. ఇన్నాళ్లు మూగబోయిన వాళ్ళ గొంతుకకు సరికొత్త శక్తి సమకూరినట్టయింది. అందుకే మొన్నానిన్నటిదాకా ఇబ్బంది పెట్టిన సొంత పార్టీ నాయకత్వంపై అవిశ్వాసం అనే రగల్ జెండా ఎగురుతోంది.

భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 100 మున్సిపాలిటీలలో విజయం సాధించింది. దాదాపు అన్ని కార్పొరేషన్లు కూడా దక్కించుకుంది. అప్పుడు అధికారంలో ఉంది కాబట్టి.. పైగా అధిష్టానం ఎవరు చెబితే వారే మునిసిపల్ చైర్మన్ లేదా కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు. ప్రభుత్వ అండదండలు ఉండడంతో వారు రకరకాల జిమ్మిక్కులు ప్రదర్శించారు. అది సొంత పార్టీ లోని కౌన్సిలర్లకు, కార్పొరేటర్లకు రుచించలేదు. అదే విషయాన్ని అప్పట్లో కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తే.. ఆయన అత్యంత తెలివిగా మునిసిపాలిటీలు లేదా నగర కార్పొరేషన్లలో అవిశ్వాసం పెట్టడానికి వీలు లేకుండా ఒక చట్టాన్ని రూపొందించారు. దానిని శాసనసభలో ఆమోదించి గవర్నర్ వద్దకు పంపారు. గవర్నర్ దీనికి ఆమోదముద్ర వేయలేదు. అయితే అప్పట్లో ఈ చట్టం పై నమస్తే తెలంగాణ గవర్నర్ వ్యతిరేక కోణంలో వార్త రాసింది. సరే ఆ విషయం పక్కన పెడితే.. ఇప్పుడు అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావటం.. భారత రాష్ట్ర సమితి ఏలుబడిలో ఉన్న పురపాలకాలు, నగర పాలకాల్లో రాజ్యమేలిన అవినీతి, అవకతవకలకు సంబంధించి విషయాలు వెలుగు చూడటం.. సొంత పార్టీ నాయకులు దీనిని బయట పెట్టడం.. అవిశ్వాసం రూపంలో తమ అసంతృప్తిని వెళ్ళగక్కుతుండటంతో భారత రాష్ట్ర సమితి అధినాయకత్వం ఇబ్బంది పడుతోంది. దీని తెర వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందని ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ.. అసలు అవిశ్వాసం పెడుతోందే భారత రాష్ట్ర సమితి నాయకులు కావడంతో.. కారు పార్టీ చేసే ఆరోపణలకు విలువ లేకుండా పోతుంది. నల్లగొండ, పాలమూరు, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఇప్పటికే పలు అవిశ్వాస తీర్మానాలు తెరపైకి వచ్చాయి. కొన్ని మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలో చేరిపోయాయి. ఇంకా మరికొన్ని లైన్లో ఉన్నాయి. అంటే చూడబోతే 100 మున్సిపాలిటీలు గెలుచుకున్నామనే ఆనందం భారత రాష్ట్ర సమితిలో లేకుండా పోతోంది. అయితే దీనంతటికి కారణం అప్పటి ప్రభుత్వ పెద్దలు వ్యవహరించిన తీరే అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఉపద్రవాన్ని నివారించేందుకు కేటీఆర్ ఏం చేస్తారు? కెసిఆర్ ఎలాంటి ప్రణాళిక అమలు చేస్తారు? కాలం గడిస్తే తప్ప ఈ ప్రశ్నలకు సమాధానం లభించదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular