Modi: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీని చుట్టేస్తున్నారు. తెలంగాణ ఏపీల్లో వరుసగా సభలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. విపక్షాలు ఇన్నాళ్లూ మోదీ అంబానీ, అధానీలకు దోచిపెడుతున్నారని విమర్శలు చేస్తున్నా ప్రచారం చేస్తున్నా స్పందించని మోదీ.. తాజాగా వేములవాడలో నిర్వహించిన సభలో వారి పేర్లను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మోదీకే రివర్స్ అయినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ను ఇరకాటంలోకి నెట్టేందుకు చేసిన ప్రయత్నంలో సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మోదీ ఏమన్నారంటే..
వేములవాడలో కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వమించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ‘పొద్దున్న లేస్తే అంబానీ, అదాని అని మాట్లాడే కాంగ్రెస్ నేతలు ఎన్నికలు మొదలయ్యాక వారి గురించి ఎందుకు మాట్లాడటం మానేశారు’అని ప్రశ్నించారు మోదీ. ‘అదాని, అంబానీ నుంచి ఎంత మొత్తంలో నిధులు ఇచ్చారు’ అని నిలదీశారు. మోదీ చేసిన ఈ వ్యాఖ్యలే రాజకీయ దుమారం రేపుతున్నాయి.
తిప్పికొడుతున్న కాంగ్రెస్..
మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ తిప్పికొడుతోంది. మోదీ తన మిత్రులు అదాని, అంబానీల గురించి తలుపులు మూసి మాత్రమే మాట్లాడుతారని, మొదటిసారి బహిరంగంగా మాట్లాడారని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ కౌంటర్ ఇచ్చారు. మోదీ వ్యాఖ్యలు చూస్తుంటే ఓటమి భయం స్పష్టమవుతుందని పేర్కొన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘మోదీకి ఎంత గడ్డు కాలం వచ్చింది. ఆఖరికి తనకు అండగా నిలిచిన మిత్రులపైన కూడా మాటల దాడి చేసే స్థితికి చేరుకున్నారు’ అని ట్వీట్ చేశారు.
కాంగ్రెస్‌కు ఫండింగ్ చేశారా..
ఇదిలా ఉంటే.. ప్రధాని మోదీ చెప్పినట్లుల అదాని, అంబానీ కాంగ్రెస్‌కు ఎన్నికల ఫండింగ్ చేశారా అన్న చర్చ జరుగుతోంది. ప్రధాని స్థాయిలో ఉన్న నేత ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఫండింగ్ అందడంతోనే కాంగ్రెస్ నేతలు మౌనంగా ఉంటున్నారా అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మరోవైపు అదాని, అంబానీల వద్ద భారీగా బ్లాక్‌మనీ ఉంటే ఈడీ, సీబీఐలు ఏం చేస్తున్నాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బీజేపీ ప్రత్యర్ధుల విషయంలో దూకుడుగా వ్యవహరించే దర్యాప్తు సంస్థలు అదాని, అంబానీ విషయంలో మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నాయని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.