MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భాగంగా కవితను శుక్రవారం సాయంత్రం ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్టు చేశారు. రాత్రి ప్రత్యేక విమానంలో ఢిల్లీ తీసుకెళ్లారు.. అక్కడ రౌస్ అవెన్యూ కోర్టు ( Rouse Avenue Court) లో హాజరు పరిచారు.

Written By: Anabothula Bhaskar, Updated On : March 16, 2024 6:12 pm

MLC Kavitha

Follow us on

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi liquor scam) కేసులో అరెస్టయిన భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు శనివారం మరో బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్టు చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ (enforcement) అధికారులు రౌస్ అవెన్యూ కోర్టు ( Rouse Avenue Court) లో హాజరు పరిచారు. కస్టడీ(custody)లోకి ఇవ్వాలని కోర్టును ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు కోరారు. దీంతో ఏడు రోజులపాటు కస్టడీ ఇచ్చేందుకు కోర్టు పచ్చ జెండా ఊపింది. దీంతో కవిత ఈనెల 23 వరకు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల ఆధీనంలో ఉంటారు. వాస్తవానికి ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు కనీసం పది రోజులపాటు కవితను కస్టడీకి కోర్టును ఇవ్వాలని కోరారు. వారం రోజుల కస్టడీకి మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు జస్టిస్ నాగ పాల్ ప్రకటించారు. దీంతో కవితను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భాగంగా కవితను శుక్రవారం సాయంత్రం ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్టు చేశారు. రాత్రి ప్రత్యేక విమానంలో ఢిల్లీ తీసుకెళ్లారు.. అక్కడ రౌస్ అవెన్యూ కోర్టు ( Rouse Avenue Court) లో హాజరు పరిచారు. శనివారం ఉదయం ఆమెకు పలువురు వైద్యుల సమక్షంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం రౌస్ అవెన్యూ కోర్టు ( Rouse Avenue Court) లో హాజరు పరిచారు. కస్టడికి ఇవ్వాలని ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు కోర్టును కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు పై విధంగా తీర్పు ప్రకటించింది. కాగా, తనపై ఇలాంటి చర్యలు తీసుకోవద్దని కవిత పిటిషన్ వేసిన నేపథ్యంలో.. మంగళవారం అంటే మార్చి 19న ఆ కేసు విచారణకు రానుంది. దీంతో సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందననే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే పలుమార్లు కవితను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు విచారించారు. అయితే అప్పుడు ఆమె తనకు ఏం తెలియదు అన్నట్టుగా సమాధానం చెప్పారు. ఇప్పుడు వారం పాటు కస్టడీలో ఏమేం ప్రశ్నలు అడగబోతున్నారు? ఆమె ద్వారా ఎలాంటి సమాచారం రాబడతారు? అనే ప్రశ్నలు భారత రాష్ట్ర సమితి నాయకులను ఉత్కంఠకు గురిచేస్తున్నాయి.. కస్టడీ తర్వాత ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఎలాంటి అడుగులు వేస్తారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ప్రస్తుతం కవిత సోదరుడు కేటీఆర్ ఢిల్లీలోనే ఉన్నారు. కవిత తరపు న్యాయవాది మోహిత్ రావుతో మంతనాలు జరుపుతున్నట్టు తెలిసింది. మరోవైపు సోమా భరత్ అనే న్యాయవాది కూడా ఢిల్లీలోనే ఉన్నారు. మరికొంతమంది న్యాయ నిపుణులతో చర్చలు జరిపిన తర్వాత.. కేసు పై ఎలా ముందుకెళ్లాలో సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

కవితను కస్టడీలోకి తీసుకోవడం ద్వారా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో జరిగిన పరిణామాలపై మరింత లోతుగా ఈడి అధికారులు సమాచారం సేకరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఆమె ఏమైనా వివరాలు చెబితే వాటి ఆధారంగా ఈడి అధికారులు తదుపరి అడుగులు వేస్తారు. ఇప్పటివరకు ఈ కేసులో ప్రత్యక్షంగా ఉన్న వారంతా అరెస్టు అయ్యారు. ఒక్క ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తప్ప.. అరవింద్ ను అరెస్టు చేయాలంటే.. ముందు కవితను అరెస్టు చేయాల్సిన పరిస్థితి ఈడికి ఏర్పడినట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కవిత కూడా ఎలాగూ ఈడి అధికారుల కస్టడీలో ఉన్న నేపథ్యంలో ఆమె తెలిపిన వివరాల ఆధారంగా తదుపరి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ను ఈడి అధికారులు అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జైల్లో ఉన్నారు.