TDP Janasena Alliance
TDP Janasena Alliance: ఏపీ లో రాజకీయ వాతావరణం రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే రెండు జాబితాలలో జనసేన, బిజెపి, టిడిపి కూటమి అభ్యర్థులను ప్రకటించింది.. ఈ జాబితా నేపథ్యంలో అధికార వైసిపి అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తుందోననే ఆసక్తి అందరిలోనూ కలిగింది. చాలామంది జగన్ ప్రకటించే జాబితా కోసం ఆత్రుతగా ఎదురు చూశారు. అయితే వారందరి ఎదురుచూపులకు చెక్ పెడుతూ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల వివరాలను శనివారం ప్రకటించారు. జాబితాలో జగన్మోహన్ రెడ్డి కాస్త వైవిధ్యాన్ని ప్రదర్శించారు. వాస్తవానికి గత కొద్ది నెలలుగా సర్వే పేరుతో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను జగన్ దూరం పెట్టారు. ఎన్నికల్లో చాలామందికి టిక్కెట్ ఇవ్వలేదు. అదే సంప్రదాయాన్ని అభ్యర్థుల జాబితాలో ప్రదర్శించారు. ముఖ్యంగా ఏపీలోని కీలకమైన నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ, కొణిదెల పవన్ కళ్యాణ్ పై మహిళా అభ్యర్థులను జగన్మోహన్ రెడ్డి నిలబెట్టారు. దీంతో ఏపీలో చర్చ మొదలైంది.
పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో వైసీపీ తరఫున వంగ గీతను అభ్యర్థిగా ప్రకటించారు. నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి స్థానంలో లావణ్యను బరిలో నిలిపారు. హిందూపురం నుంచి పోటీ చేస్తున్న బాలకృష్ణపై దీపికను నిలబెట్టారు. జగన్ రూపొందించిన ఈ కూర్పు పై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో మంగళగిరి స్థానంలో నారా లోకేష్ పై ఆళ్ల రామకృష్ణారెడ్డిని పోటీలో నిలిపారు. ఆ ఎన్నికల్లో రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. గత ఎన్నికల్లో హిందూపురం స్థానం నుంచి బాలకృష్ణపై వైసిపి నుంచి ఇక్బాల్ హుస్సేన్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో బాలకృష్ణ విజయం సాధించారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక స్థానాల నుంచి పోటీ చేశారు. భీమవరంలో వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ చేతిలో ఓటమిపాలయ్యారు. గాజువాకలో పోటీ చేస్తే వైసిపి అభ్యర్థి తిప్ప నాగిరెడ్డి చేతిలో పవన్ కళ్యాణ్ పరాజయం పొందారు. అయితే ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం స్థానం నుంచి బరిలోకి దిగారు. గత ఎన్నికల్లో పిఠాపురం స్థానం నుంచి పెండెం దొరబాబు వైసీపీ నుంచి విజయం సాధించారు. అయితే ఇటీవల సర్వేలో ఆయనకు అనుకూలంగా ఫలితాలు రాకపోవడంతో జగన్మోహన్ రెడ్డి ఆయనను మార్చారు. ఆయన స్థానంలో వంగా గీతకు అవకాశం కల్పించారు.
ఇటు పవన్ కళ్యాణ్ పై వంగా గీత, అటు నారా లోకేష్ పై లావణ్య, బాలకృష్ణపై దీపికను పోటీలో పెట్టి సరికొత్త రాజకీయానికి జగన్ మోహన్ రెడ్డి తెర లేపారని తెలుస్తోంది. వాస్తవానికి ఈ ముగ్గురు యువతులు కూడా ఉన్నత విద్యావంతులు. రాజకీయ నేపథ్యం అంతంతమాత్రంగా ఉన్నవారు. అలాంటి వారిని బరిలో పెట్టడం ద్వారా ప్రతిపక్ష కూటమికి మాట్లాడే అవకాశం లేకుండా చేసినట్టు తెలుస్తోంది. ముగ్గురు కీలక నాయకులపై ఆడవాళ్ళను పోటీలో పెట్టిన నేపథ్యంలో ఏం జరుగుతుందోననే చర్చ ఏపీలో మొదలైంది. ఆ ముగ్గురు ఆడవాళ్లను పోటీలో ఉంచడం ద్వారా జగన్.. లోకేష్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కు మాట్లాడే అవకాశం, విమర్శలు చేసే లేకుండా చేసినట్టు తెలుస్తోంది