https://oktelugu.com/

RS Praveen Kumar: గులాబీ గూటిలోకి బహుజన వాదం.. ఆర్‌ఎస్‌పీ.. ఇక బీ‘ఆర్‌ఎస్‌పీ’..!

ఆర్‌ఎస్పీ చేసిన ట్వీట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘బీజేపీతో పోరాడుతున్న బీఆర్‌ఎస్‌తో బీఎస్పీ పొత్తును భగ్నం చేయడానికి ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : March 16, 2024 / 06:20 PM IST

    RS Praveen Kumar

    Follow us on

    RS Praveen Kumar: బహుజన రాజ్యం తెస్తానని బీఆర్‌ఎస్‌ పాలనకు వ్యతిరేకంగా ఐపీఎస్‌ ఉద్యోగాన్ని గడ్డి పోచలా వదిలేశారు ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌. దొర పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగే వరకు పోరాడతానని శపథం చేశారు. బహుజన వాదమే తన నినాదం అంటూ మాయావతి నేతృత్వంలోని బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ)లో చేరారు. అనతి కాలంలోనే పార్టీ తెలంగాణ అధ్యక్షుడు అయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగైదు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ ఓటమికి కారణమయ్యారు. అయితే అనూహ్యంగా పార్లమెంటు ఎన్నికల ముందు ఏ పార్టీకి వ్యతిరేకంగా ఆర్‌ఎస్పీ రాజకీయాల్లోకి వచ్చారో.. అదే పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే పొత్తుకు పార్టీ అధినేత్రి మాయావతి అంగీకరించలేదు. దీంతో బహుజనవాదాన్ని బీఆర్‌ఎస్‌ గూటికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. బీఎస్పీ అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు.

    కీలక వ్యాఖ్యలు..
    ఇక ఆర్‌ఎస్పీ చేసిన ట్వీట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘బీజేపీతో పోరాడుతున్న బీఆర్‌ఎస్‌తో బీఎస్పీ పొత్తును భగ్నం చేయడానికి ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారు. పొత్తు ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడిదుడుకులొచ్చినా ముందుకు సాగుతూ.. కష్టసుఖాలు పంచుకోవడం నేను నమ్మిన ధర్మం. బీజేపీ కుట్రలకు భయపడి నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేను. నా ప్రస్థానాన్ని ఆపలేను’ అని పేర్కొన్నారు.

    ఎక్స్‌లో ఏం శారారంటే..
    ‘ప్రియమైన బహుజనులారా.. నేను ఈ మెసేజ్‌ని టైప్‌ చేయలేకపోతున్నాను. కొత్త మార్గంలో వెళ్లే సమయం వచ్చినందున నేను ఈ విషయాన్ని తప్పక పంచుకోవాలి. దయచేసి నన్ను క్షమించండి. నాకు వేరే మార్గం లేదు. బరువెక్కిన హృదయంతో బహుజన సమాజ్‌ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నాను. బీఎస్పీ అధిష్టానం తీసుకునే కొన్ని నిర్ణయాలతో పార్టీ రాష్ట్రంలో బలహీనపడింది. అదే సమయంలో నేను కొన్ని ప్రధాన సూత్రాలపై రాజీ పడకూడదనుకుంటున్నాను. స్వేరోగా నేను ఎవరినీ నిందించను. నన్ను నమ్మిన వారిని మోసం చేయను. తెలంగాణలో బీఎస్పీ భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించుకోవాల్సింది. ఆ పార్టీ అధినేత మాయవతికి ధన్యవాదాలు. నన్ను విశ్వసించినందుకు, నన్ను నడిపించినందుకు ఎప్పటికీ మీరే నా మార్గనిర్దేశకులు. కాన్షీరామ్‌ సామాజిక న్యాయం కోసం ఎల్లవేళలా కృషి చేస్తా. నాపై విశ్వాసం ఉంచినందుకు బహుజనులందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటా. పవిత్రమైన రాజ్యాంగ విలువలు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని కాపాడటంలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గబోను. బహుజనులు స్వశక్తితో ఎదిగేందుకు నిర్విరామంగా కృషిచేస్తానని హామీ ఇస్తున్నాను. నాకు అండగా నిలిచినందుకు తెలంగాణ, భారతదేశ ప్రజలకు ధన్యవాదాలు. మళ్లీ చెబుతున్నా. చివరి వరకు బహుజన వాదాన్ని నా గుండెలో పదిలంగా దాచుకుంటా. జై భీం…’ అని ప్రవీణ్‌ రాసుకొచ్చారు.

    బీఆర్‌ఎస్‌ వైపు అడుగులు..
    అంతా ఊహించినట్టుగానే ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ అడుగులు భారత రాష్ట్రసమితివైపు పడుతున్నాయి. పది రోజుల క్రితమే ఆయన బీఆర్‌ఎస్‌లో చేరతారని ప్రచారం జరిగినా ఆయన ఖండించారు. కేవలం పొత్తు మాత్రమే అని ప్రనకటించారు. కానీ, చివరకు ఊహించిందే జరిగే అవకాశం కనిపిస్తోంది. ఆర్‌ఎస్‌పీ… ఇక బీ‘ఆర్‌ఎస్‌’పీగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవలే బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను కలిసిన ఆయన తాజాగా బీఎస్పీకి రాజీనామా చేయడంతో ఆయన త్వరలోనే బీఆర్‌ఎస్‌లో చేరడం ఖాయమని తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ టికెట్‌పైనే నాగర్‌ కర్నూల్‌ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని సమాచారం.