MLC Kavitha: నాటి నుంచి కల్వకుంట్ల కవిత పెద్దగా కనిపించింది లేదు. నాడు ఆమె చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చుకునే విధంగా అడుగులు వేసింది కూడా లేదు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత మరుసటి రోజు కేటీఆర్ కు కవిత రాఖీ కట్టారు. ఆ తర్వాత కెసిఆర్ దగ్గరికి వెళ్లారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఆయనతో గడిపారు. అనంతరం ఆమె బయటకి కనిపించలేదు. మధ్యలో ఒకసారి మాత్రం ఆస్పత్రిలో చెకప్ చేయించుకునేందుకు వెళ్లారు. అప్పుడు మాత్రమే ఆమె వీడియోలు మీడియాలో దర్శనమిచ్చాయి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అభియోగాలు ఎదుర్కొంటూ.. జైలు శిక్ష అనుభవించిన ఆమె గైనిక్ సమస్యలు ఎదుర్కొన్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమెకు ఢిల్లీలో ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందించారని సమాచారం. మధ్యలో ఆమె భర్త అనిల్ కూడా ములాఖాత్ లో పరామర్శించారని వార్తలు వినిపించాయి. అయితే బెయిల్ మంజూరు అనంతరం హైదరాబాద్ వచ్చిన కవిత.. బయట పెద్దగా కనిపించడం లేదు. రాష్ట్రంలో హైడ్రా, కేటీఆర్ బావమరిది ఫామ్ హౌస్ వ్యవహారం, లగచర్ల వంటి ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ ఆమె బయటకు రావడం లేదు.
సమగ్ర సర్వే తో..
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం సమగ్ర సర్వే నిర్వహిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా టీచర్లు ఈ సర్వేలో పాలు పంచుకుంటున్నారు. ప్రతీ ఇంటికి వెళ్లి వివరాలను సేకరిస్తున్నారు. ఇదే క్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటికి కూడా ప్రభుత్వ ఉద్యోగులు సర్వే నిమిత్తం వెళ్లారు. ఆ సమయంలో ఆమె వెంట భర్త అనిల్ కుమార్ ఉన్నారు. అయితే ఎన్యుమరేటర్లు కాకుండా కవితనే ఆ ఫారంలో వివరాలు మొత్తం నింపారు.. రేవంత్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సర్వేను బోగస్.. ఆరు గ్యారంటీల అమలును తప్పించుకోవడానికి చేస్తున్న స్టంట్ అని ఆరోపిస్తున్న సమయంలో.. కవిత స్వయంగా ఆ ఫారం నింపడం విశేషం. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయి..” మీరు సర్వే ను నిందించారు. రేవంత్ లక్ష్యాన్ని దెప్పి పొడిచారు. కానీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వయంగా సర్వే పత్రాలలో వివరాలను నమోదు చేస్తున్నారు. ఆమెలాగా మీరు కూడా ప్రభుత్వానికి సహకరించాలి. అప్పుడే ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. ప్రభుత్వ లక్ష్యం సక్రమయింది కాబట్టే కవిత తన వివరాలను పొందుపరిచారు. సర్వే చేస్తున్న అధికారులకు సహకరించారు.. కానీ ఇదే కేటీఆర్, హరీష్ రావులు మాత్రం ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా వారు ప్రభుత్వానికి సహకరిస్తే మంచిదని.. అప్పుడే ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయని” కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానిస్తున్నారు.