HomeతెలంగాణMLC Jeevan Reddy : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహంలో న్యాయం ఉంది.. మరి కాంగ్రెస్...

MLC Jeevan Reddy : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహంలో న్యాయం ఉంది.. మరి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పును సరిదిద్దుకుంటుందా?

MLC Jeevan Reddy : జగిత్యాల స్థానం నుంచి పోటీ చేసినప్పటికీ ఆ పార్టీ నేత జీవన్ రెడ్డి ఓడిపోయారు. అంతకుముందు ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఆయన గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన జగిత్యాల స్థానంలో భారత రాష్ట్ర సంత నుంచి డాక్టర్ సంజయ్ కుమార్ విజయం సాధించారు. ఆయన ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో సహజంగానే జీవన్ రెడ్డికి ఇబ్బందికరంగా మారింది. జీవన్ రెడ్డి అంతరంగం తెలుసుకోకుండానే సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇక నాటి నుంచి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పై ఆగ్రహంగా ఉన్నారు.. పలు సందర్భాల్లో సంజయ్ ని చేర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే ఇటీవల జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు హత్యకు గురయ్యారు. అయితే అతడిని భారత రాష్ట్రసమితి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చేరిన వారి హత్య చేశారని జీవన్ రెడ్డి ఆరోపిస్తున్నారు..

జీవన్ రెడ్డి అనుచరుడి హత్య

జగిత్యాల గ్రామీణ మండలం జాబితాపూర్ మాజీ ఎంపిటిసి సభ్యుడు గంగారెడ్డి (58) జీవన్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా కొనసాగుతున్నారు. ఆయన హత్యకు గురయ్యారు. ఆయన హత్యను నిరసిస్తూ జీవన్ రెడ్డి తన అనుచరులతో కలిసి జగిత్యాల – ధర్మపురి మార్గంలో ఆందోళనకు దిగారు.. అంతేకాదు గంగారెడ్డి మృతదేహం ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి జీవన్ రెడ్డి వెళ్లారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తప్పు పట్టి, నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో జీవన్ రెడ్డి వద్దకు ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్పు అడ్లూరి లక్ష్మణ్ వచ్చారు. లక్ష్మణ్ తో తన ఆగ్రహాన్ని జీవన్ రెడ్డి వ్యక్తం చేశారు. ” స్వచ్చంద సేవ ఏర్పాటు చేసుకొని సేవ చేస్తాను. మీ పార్టీ నాకు ఇచ్చిన గౌరవానికి ఓ దండం. ఇప్పటికైనా మాకు బతికే అవకాశాన్ని ఇవ్వండి. ఇంతకాలం మాకు అవమానాలు ఎదురయ్యాయి. అయినప్పటికీ పార్టీలో ఉన్నాం. ఆయనప్పటికీ మమ్మల్ని భౌతికంగా లేకుండా ఉండేలా కుట్ర చేస్తున్నారని” జీవన్ రెడ్డి తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ తో తన బాధను మొత్తం పంచుకున్నారు. అయితే జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఎంతసేపు లక్ష్మణ్ ఆయనను అనునయించే ప్రయత్నం చేశారు. ఇక ఈ వ్యవహారంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా స్పందించారు.. నిందితులను వెంటనే పట్టుకోవాలని పోలీసులకు సూచించారు.

జీవన్ రెడ్డి ఆగ్రహానికి అర్థముంది

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అగ్రహానికి అర్థం ఉంది. ఎందుకంటే ఆయన చాలా సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వరుస ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ నే నమ్ముకుని ఉన్నారు. గత పర్యాయం, ఇటీవల ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి గెలిచినప్పటికీ.. కాంగ్రెస్ కేడర్ చెక్కుచెదరకుండా ఉండకుండా తనవంతు ప్రయత్నం చేశారు. పైగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరి అభిమానాన్ని చూరగొని.. అప్పటి అధికార పార్టీ వేధింపులను తట్టుకొని గెలిచారు. ఆయన గెలుపు కాంగ్రెస్ పార్టీకి కొత్త శక్తిని అందించింది. ఆ తర్వాతనే రాష్ట్ర రాజకీయాలలో మార్పు మొదలైంది. జీవన్ రెడ్డి గెలుపును పలు సందర్భాల్లో రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. జీవన్ రెడ్డి లాంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉంటే.. ఎన్నికల్లో సులువుగా గెలవచ్చని పేర్కొన్నారు. ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లోను పార్టీ నిర్ణయానికి అనుగుణంగా జీవన్ రెడ్డి నిజామాబాద్ స్థానం నుంచి పోటీ చేశారు. సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు గట్టి పోటీ ఇచ్చారు. అయితే ఉన్నట్టుండి జీవన్ రెడ్డికి తెలియకుండానే సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం ఒక్కసారిగా చర్చకు దారి తీసింది. దీంతో గత నాలుగు నెలలుగా జగిత్యాల నియోజకవర్గం లో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ అన్నట్టుగా రాజకీయం కొనసాగుతోందని తెలుస్తోంది. చివరికి జీవన్ రెడ్డి అనుచరుడిని హత్య చేసేదాకా పరిస్థితులు వెళ్లాయని.. ఇది అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాల్సిన అవసరం ఉందని వారు చెబుతున్నారు.. లక్ష్మణ్ తో జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. త్వరలో ఆయన పార్టీ మారే అవకాశాలు కనిపిస్తున్నాయని ప్రచారం జరుగుతోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular