MLAs’ romance leaked : మరో ఆరు నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగా సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది.. ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి మొదలుపెడితే ముఖ్యమైన మంత్రి కేటీఆర్ దాకా విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ డైలమాలో ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. గత చరిత్రను మొత్తం తవ్వుతున్నారు. ప్రతి సమావేశంలోనూ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. సరే రాజకీయ పార్టీ కాబట్టి, మూడో సారి అధికారంలోకి రావాలి అనుకుంటోంది కాబట్టి ఈ మాత్రం విమర్శలు చేయడం సహజమే.. కానీ ఆదిలోనే హంసపాదు లాగా భారత రాష్ట్ర సమితికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రతి బంధకంగా మారారు. విపక్షాలకు విమర్శలు చేసే అధికారాన్ని ఇస్తున్నారు. సోషల్ మీడియాలో అభాసు పాలవుతున్నారు. సమాజానికి సుద్ధులు చెప్పాల్సింది పోయి, తామే అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రజల ముందు తలవంచుతున్నారు.
ఇటీవల భారత రాష్ట్ర సమితికి సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేల మీద విపరీతమైన ఆరోపణలు వస్తున్నాయి. భూ తగాదాలు, భూ కబ్జాలు, బెదిరింపుల వంటి కేసులు ఎమ్మెల్యేల మీద చాలానే ఉన్నాయి. అయితే తాజాగా మహిళలను వేధిస్తున్న కేసులు నమోదవుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రెజ్లర్లకు బహిరంగంగా మద్దతు పలికిన కేటీఆర్ ఈ విషయంలో మిన్న కుంటుండడం ఒకింత విస్మయాన్ని కలిగిస్తోంది. ఇక బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గయ్య ఘటన మరువక ముందే తాజాగా హైదరాబాద్ నగరానికి చెందిన ఓ ఎమ్మెల్యే వివాదంలో ఇరుక్కున్నాడు. ఒక మహిళా కార్పొరేటర్ తో ద్వంద్వార్థాలతో మాట్లాడటం, అర్ధరాత్రి పూట ఫోన్ చేయడం, ఆయన మాటలకు సంబంధించి వాయిస్ రికార్డులు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండడం సంచలనం కలిగిస్తోంది. ఈ పంచాయతీ ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు చేరిందని తెలుస్తోంది. ఆ ప్రజాప్రతినిధిపై చర్యలు తీసుకున్నందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది.
హైదరాబాద్ నగరానికి చెందిన ఆ ఎమ్మెల్యే గతంలో ఒక పార్టీలో ఉండేవారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం భారత రాష్ట్ర సమితి అధికారంలోకి రావడంతో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. గతంలో ఒక పార్టీలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమకారులపై దాడులు చేసిన చరిత్ర ఆయనది. ఉద్యమకారులపై కేసులు పెట్టిన ఘనత కూడా ఆయనదే. అలాంటి ఆయన భారత రాష్ట్ర సమితికి చెందిన ఒక సీనియర్ నాయకుడు సతీమణి పై మనసు పడ్డారు. గ్రేటర్ పరిధిలో కీలకమైన ఎమ్మెల్యే కావడం, పైగా ఈ ఎమ్మెల్యే నియోజకవర్గం పరిధిలోనే ఆ కార్పొరేటర్ డివిజన్ ఉండడంతో ఆయన మరింత రెచ్చిపోయారు. హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల సమయంలో ఏర్పడిన పరిచయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. చివరికి ఆమెను వేధించడం మొదలుపెట్టారు.. ఇది ఎంత దాకా వెళ్ళిందంటే ” రాత్రిపూట భోజనం చేయ్. భోజనం చేయకపోతే నీరసపడిపోతావు” అని వ్యక్తిగత కుశల ప్రశ్నలు వేసే దాకా వెళ్ళింది. మొదట్లో దీనిని అంతగా సీరియస్ గా తీసుకోని ఆ మహిళా కార్పొరేటర్ భర్త.. ఈమెకు వచ్చే ఫోన్ లపై నజర్ పెట్టారు.. ఆయన అనుమానం నిజం కావడంతో వెంటనే ఈ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. ఇదే సమయంలో అవి మీడియాలో లీక్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం నెలకొంది.
సీటు ఉంటుందా
ఇక మహిళా కార్పొరేటర్ పై వేధింపులకు సంబంధించి ఆ ఎమ్మెల్యే పై అధిష్టానం త్వరలో చర్యలు తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఇక ఎమ్మెల్యే నియోజకవర్గంలోని కీలక నేతకు టికెట్ ఇచ్చే విషయాన్ని అధిష్టానం పరిశీలిస్తున్నది. బుధవారం ప్రగతి భవన్ లో ఆ నియోజకవర్గానికి చెందిన కొంతమంది నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమైనట్టు తెలుస్తోంది. ఇక ఈ ఎమ్మెల్యే సంబంధించి పలు వ్యవహారాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అసలే పరిస్థితి బాగోలేదు కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఈయనకు కాకుండా మరో కీలకమైన టిక్కెట్ ఇచ్చి పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని ముఖ్యమంత్రి అన్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికలకు ముందే భారత రాష్ట్ర సమితిలోకి ఆ ఎమ్మెల్యే వచ్చారు. ఐదు సంవత్సరాలు కాకముందే అపప్రదను మూటకట్టుకుని వెళ్ళిపోతున్నారు.. ఈ వ్యవహారం మొత్తం చూస్తున్న తెలంగాణ ఉద్యమకారులు తగిన శాస్తి జరిగిందని అంటున్నారు.. ఈ వ్యవహారం మొత్తం లో తన పేరు ప్రముఖంగా వినిపిస్తుండడంతో ఆ ఎమ్మెల్యే కలత చెందినట్టు ప్రచారం జరుగుతున్నది. ముఖ్యమంత్రి తన నియోజకవర్గ నేతలతో సమావేశం నిర్వహిస్తున్న దాన్ని తెలుసుకుని.. తాను కూడా భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని ఆ ఎమ్మెల్యే అనుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది