ED attack : తెలంగాణ రాష్ట్రంలో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు పంజా విసురుతున్నారు. వరుస దాడులతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. బుధవారం తెల్లవారుజాము నుంచి రాష్ట్రంలో 16 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలకు దిగారు. కడపటి వార్తలు అందే సమయానికి నగదు, ఇతర డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర బలగాల సహాయంతో భారీ బందోబస్తు ఏర్పాటు మధ్య సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఏం జరుగుతుందో అంతు పట్టకుండా ఉంది.
ఈసారి మెడికల్ కాలేజీల వంతు
సాధారణంగా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అక్రమార్కుల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తూ ఉంటారు. లేదా అవినీతికి పాల్పడే రాజకీయ నేతల కార్యాలయాలు, ఇళ్ళల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తూ ఉంటారు. ఈ తనిఖీల్లో నగదు లేదా మరేదైనా పట్టుబడితే కోర్టుకు సమర్పిస్తారు. ఆధారాలు సక్రమంగా చూపించని పక్షంలో కోర్టు ద్వారా కేసు నమోదు చేయిస్తారు. కానీ ఈసారి తెలంగాణలో యాదృచ్ఛికంగా వైద్య కళాశాలలో విస్తృతంగా దాడులు జరుగుతున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు లోతుగా తనిఖీలు జరుపుతున్నారు.
వాస్తవానికి వైద్య విద్య అనేది కోట్ల వ్యాపారం లాగా మారిపోయింది. ప్రభుత్వం విస్తృతంగా వైద్య కళాశాలలో నిర్మించినప్పటికీ పీజీ వైద్య విద్య కళాశాలల సంఖ్య మన రాష్ట్రంలో తక్కువే. ఎంబిబిఎస్ పూర్తి చేస్తే ప్రయోజనం ఉండదు కాబట్టి చాలామంది పీజీ చేస్తూ ఉంటారు. అయితే ఈ పీజీకి ఏర్పడిన డిమాండ్ ను వైద్య కళాశాల యాజమాన్యాలు క్యాష్ చేసుకుంటున్నాయి. కోట్లకు కోట్లు డొనేషన్ల పేరుతో వసూలు చేసి అడ్డగోలుగా దండుకుంటున్నాయి.
ఇలాంటి వ్యవహారం కాళోజి వైద్య విశ్వవిద్యాలయం దృష్టికి రావడంతో దీనికి సంబంధించిన ఆధారాలతో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులకు లేఖ రాసింది. ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఏమిటో తేల్చాలని కోరింది. దీంతో రంగంలోకి దిగిన కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు బుధవారం ఉదయం నుంచి విస్తృతంగా తనిఖీలు మొదలుపెట్టారు. ముఖ్యంగా కామినేని ఆసుపత్రిలో సోదాలు నిర్వహించారు. ఈ ఆసుపత్రికి అనుబంధంగా ఉన్న వైద్య కళాశాలలో పీజీ సీట్లు అడ్డగోలుగా అమ్ముకున్నారని, రేటు ఎక్కువ వచ్చేందుకు బ్లాక్ కూడా చేశారని ప్రచారం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన ఆధారాలు కాలోజీ యూనివర్సిటీకి రావడంతో ఆ విశ్వవిద్యాలయ బాధ్యులు కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇక బుధవారం ఉదయం ప్రారంభమైన తనిఖీలు రాత్రి పొద్దుపోయేదాకా కొనసాగాయి. అయితే పేరుపొందిన కార్పొరేట్ ఆసుపత్రులు కూడా ఈ దందాలో ఉండడం విశేషం. కామినేని ఆసుపత్రి నిర్వాహకులు పీజీ వైద్య సీట్ల కోసం భారీగా డబ్బులు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే అధికారులు నిర్వహించిన సోదాల్లో పలు కీలక ఆధారాలు రాబట్టినట్టు ప్రచారం జరుగుతుంది. అయితే మొన్ననే భారత రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్యేల మీద కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు తనిఖీలు నిర్వహించారు. వారి సంస్థల్లో సోదాలు జరిపారు. కొంతమేర నగదు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. దీనిని మర్చిపోకముందే తాజాగా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు సోదాలు నిర్వహించడం, అధికార పార్టీకి దగ్గరగా ఉండే ఆసుపత్రుల నిర్వాహకుల ఇళ్లల్లో దాడులు జరగడం, అది కూడా ఎన్నికలకు ముందు జరగడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది