MLA Rajagopal Reddy Liquor Shops New Rules: ఎన్నికల్లో పోటీ చేసామా.. ఓటర్లకు డబ్బులు ఇచ్చామా.. కడుపునిండుగా మందు పోసామా.. ఎమ్మెల్యేలుగా గెలిచామా.. పదవులను సొంతం చేసుకున్నామా.. కాంట్రాక్టర్లు పొంది దండిగా సంపాదించామా.. చాలామంది నాయకుల తీరు ఇలానే ఉంది. అధికారపక్షం, ప్రతిపక్షం అని తేడా లేకుండా అందరూ ఎమ్మెల్యేలు ఇలానే వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వారి వల్ల ప్రజాస్వామ్యానికి అర్థమే మారిపోతోంది. అయితే ఈ తరహా ప్రజాప్రతినిధులు ఉన్న నేటి కాలంలో.. ఓ ఎమ్మెల్యే మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
ఆ ఎమ్మెల్యే మరెవరో కాదు.. ఉమ్మడి నల్గొండ జిల్లా లోని మునుగోడు నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. స్వతహాగానే కాంట్రాక్టర్ అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అప్పట్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత క్రమక్రమంగా ఎదిగారు. తన కాంట్రాక్టు సంస్థ ద్వారా చాలావరకు పనులు చేపట్టారు. చివరికి మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే అయ్యారు. గులాబీ పార్టీ హవా సాగిన 2018 సంవత్సరంలో ఆయన గట్టిగా నిలబడ్డారు. ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటారు. అప్పట్లో బీజేపీలో చేరినప్పటికీ.. ఆ తర్వాత ఆయన మళ్ళీ కాంగ్రెస్ గూటికి రావాల్సి వచ్చింది.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి, గులాబీ పార్టీ నాయకుడు ప్రభాకర్ రెడ్డి మీద విజయం సాధించారు. గతంలో ఎదురైన ఓటమికి బలమైన బదులు తీర్చుకున్నారు.
కోమటి రెడ్డి రాజ గోపాల్ రెడ్డి శైలి మొదటి నుంచి కూడా పూర్తిగా విభిన్నమైనది. ఆయన ముక్కు సూటిగా ఉంటారు. ఏ విషయమైనా సరే కుండ బద్దలు కొట్టినట్టు చెబుతుంటారు. ముఖ్యంగా మద్యం విషయంలో రాజగోపాల్ రెడ్డి ధోరణి రెండో మాటకు తావులేని విధంగా ఉంటుంది. ఆయన అప్పట్లోనే ఎన్నికల ప్రచారంలో తన నియోజకవర్గంలో బెల్ట్ షాపులు ఉండకూడదని ఒక స్పష్టమైన వైఖరి పెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగానే అడుగులు వేశారు. ఎందుకంటే మద్యం తాగితే వ్యక్తి ఆరోగ్యం మాత్రమే కాదు, కుటుంబ ఆరోగ్యం కూడా నాశనం అవుతుంది. ఆర్థికంగా కూడా తీవ్రంగా నష్టం ఏర్పడుతుంది. ఇక ఆ మనిషిని మాత్రం నమ్ముకున్న ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోతుంది. పైగా మద్యానికి బానిసైన వారు అకాల మరణాలను పొందుతున్నారు. దీనివల్ల చనిపోయిన వ్యక్తుల భార్యలు మధ్యలోనే విదవలు అవుతున్నారు. ఇలాంటి వ్యవహారాలు చూసి చూసి రాజగోపాల్ రెడ్డి మద్యానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. తద్వారా నియోజకవర్గ ప్రజల బాగోగులు మాత్రమే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు.
తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం షాపుల ఏర్పాటుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అయితే తన నియోజకవర్గంలో మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విభిన్నమైన షరతులు విధించారు. తన నియోజకవర్గంలో మద్యం షాపులను ఈ ప్రాంతానికి చెందిన వారు మాత్రమే నిర్వహించాలని షరతు పెట్టారు. మద్యం షాపులను సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకే నిర్వహించాలని హుకుం జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో బెల్ట్ షాపులు ఉండకూడదని.. బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. అంతేకాదు ఇష్టానుసారంగా మద్యం గనుక అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది.. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.
మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపులను సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకే తెరవాలి.
ఈ పాలసీలు తెలంగాణ వ్యాప్తంగా తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతాను – ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.#rajagopalreddy #wineshops #telangana # pic.twitter.com/and1bVA8gj— Journalist Scoop (@journalistscoop) October 14, 2025