Amaravati Largest Railway Station: చంద్రబాబు సీఎంగా ఉంటే అంతే.. భారీ ప్రాజెక్టులు.. కొత్త కొత్త రంగాలు.. పరిశ్రమల, పెట్టుబడులు.. దీనికైతే కొదవ ఉండదు. విజనరీ అని అందుకే అంటారు. ముందుగానే ఆలోచించుకొని చంద్రబాబు చేస్తోన్న ఈ పనులు ఏపీ రూపురేఖలే మార్చబోతున్నాయి.ఇప్పటికే విశాఖలో గూగుల్ డేటా సెంటర్ తో ఏఐ హబ్ ను ఏర్పాటు చేయబోతున్న చంద్రబాబు ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ను కేంద్రం సాయంతో ఏపీలో నెలకొల్పబోతుండడంతో మన అందరికీ గర్వకారణంగా మారింది..
భారత రైల్వే చరిత్రలో ఒక నూతన అధ్యాయం రూపుదిద్దుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి సమీపంలో దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర అభివృద్ధి దిశలో ఇది ఒక కీలకమైన మైలురాయిగా భావిస్తున్నారు.
ప్రపంచ స్థాయి డిజైన్ – విశాలమైన విస్తీర్ణం
ఈ ప్రతిష్ఠాత్మక రైల్వే స్టేషన్ డిజైన్ అమెరికాలోని న్యూయార్క్ గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్, లండన్ సెయింట్ పాంక్రాస్ వంటి ప్రపంచ ప్రసిద్ధ కేంద్రాల నమూనాలో రూపొందించబడుతోంది. ఎయిర్‌పోర్ట్ తరహాలో అత్యాధునిక టెర్మినల్స్, సౌకర్యాలతో స్థాపించనున్న ఈ స్టేషన్ సుమారు 1,500 ఎకరాల విస్తీర్నంలో నిర్మించబడనుంది. మొత్తం 24 ప్లాట్‌ఫామ్స్, 4 టెర్మినల్స్ ఉండగా, రోజుకు దాదాపు 3 లక్షల ప్రయాణికులు ఈ స్టేషన్ ద్వారా రాకపోకలు సాగించే అవకాశం ఉంది.
భారీ పెట్టుబడి – విస్తృత కనెక్టివిటీ
ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 2,245 కోట్లు కేటాయించింది. రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణలో భాగంగా 57 కిలోమీటర్ల బ్రాడ్ గేజ్ లైన్, అలాగే 3.2 కిలోమీటర్ల మేర కృష్ణా నదిపై కొత్త బ్రిడ్జ్ నిర్మాణం ప్రణాళికలో ఉంది. చెన్నై, కోల్కతా, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రధాన మెట్రో నగరాలతో నేరుగా రైల్వే లింకులు ఏర్పాటు చేయడం ద్వారా అమరావతి దేశవ్యాప్తంగా కీలక ట్రాన్సిట్ హబ్‌గా ఎదగనుంది.
ఆర్థికాభివృద్ధికి చోదకశక్తి
రాజధాని ప్రాంతంలో ఏర్పడనున్న ఈ ప్రాజెక్టు 2–3 సంవత్సరాల్లో పూర్తి కానుంది. రానున్న కాలంలో ఈ కొత్త రైల్వే స్టేషన్ ప్రాంతీయ రవాణా, వ్యాపార వృద్ధి, ఉపాధి అవకాశాలకు గణనీయమైన ఉత్సాహాన్ని అందిస్తుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల ఏర్పాటు ద్వారా అమరావతి నగరం దేశంలోని ఆధునిక రైల్వే నెట్‌వర్క్‌లో ఒక కీలక కేంద్రంగా రూపుదిద్దుకోనుందనే విశ్లేషణ నిపుణులది.
ఏపీకి చారిత్రాత్మక ప్రాజెక్టు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టు, సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన “విశ్వ స్థాయి నగరం – అమరావతి” స్వప్నానికి కొత్త ఊపు తీసుకురానుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది ఒక చారిత్రాత్మక మౌలిక సదుపాయాల బహుమతిగా నిలిచిపోనుంది.