MLA Lasya Nanditha: భారత రాష్ట్ర సమితి కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో విషాద ఛాయలు అలముకున్నాయి. గత ఏడాది ఫిబ్రవరి 19న ఆమె తండ్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతి చెందిన కొంతకాలానికే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. 1986లో జన్మించిన లాస్య నందిత కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ పూర్తి చేశారు.. తన తండ్రి సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఏనాడు కూడా ఆమె అటువైపు చూడలేదు. బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసిన తర్వాత లాస్య కొద్ది రోజులపాటు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేశారు.. సాయన్నకు అబ్బాయిలు లేకపోవడం.. అప్పటికి ఆయన అనారోగ్యంతో బాధపడుతుండడంతో.. తన రాజకీయ వారసురాలిగా పెద్ద కూతురు లాస్యను సాయన్న ప్రకటించారు. దీంతో అనివార్య పరిస్థితుల్లోనే లాస్య రాజకీయాల్లోకి ప్రవేశించారు.2015 లో కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో పికెట్ ప్రాంతం నుంచి పోటీ చేసి ఆమె ఓడిపోయారు. ఆ అపజయానికి కుంగిపోకుండా 2016 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కావాడిగూడ నుంచి పోటీ చేసి ఆమె కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. అయితే 2021లో అదే కార్పొరేషన్ నుంచి పోటీ చేస్తే ఓటమి పాలయ్యారు.
ఈలోగా సాయన్న అనారోగ్యంతో గత ఏడాది ఫిబ్రవరి 19న మృతి చెందారు. దీంతో లాస్యకు భారత రాష్ట్ర సమితి అధినేత కేసిఆర్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ టికెట్ కేటాయించారు. ఆ ఎన్నికల్లో ఆమె తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి పై 17,169 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అప్పటినుంచి నియోజకవర్గ ప్రజలకు సాయన్న లేని లోటును తీరుస్తున్నారు. ఇటీవల నల్లగొండలో భారత రాష్ట్ర సమితి కృష్ణా జలాలలో వాటా ను తేల్చాలని డిమాండ్ చేస్తూ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు హాజరవుతుండగా లాస్య నందిత వాహనం ఢీకొని ఓ హోంగార్డు దుర్మరణం చెందాడు. ఆ ప్రమాదంలో ఆమె కూడా గాయపడ్డారు. ఆ ఘటన జరిగి సరిగా వారం దాటిన తర్వాత పటాన్చెరువు సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె దుర్మరణం చెందారు. గురువారం రాత్రి మెదక్ జిల్లా సదాశివపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం తెల్లవారుజామున హైదరాబాద్ బయలుదేరారు. డ్రైవర్, పీఏ ఆకాష్ తో కలిసి ఆమె ఆకాష్ తో కలిసి తన కారులో హైదరాబాద్ బయలుదేరగా ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి సడన్ బ్రేక్ వేయడంతో.. వాహనం అదుపుతప్పి రేయిలింగ్ ను ఢీ కొట్టింది. లాస్య అక్కడికక్కడే మృతి చెందింది. డ్రైవర్, పిఏ ఆకాష్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో కారును పీఏ ఆకాష్ తోలుతున్నారు.
లాస్య నందిత మృతి చెందిందనే సమాచారం తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. నేరుగా ఆమె ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆసుపత్రిలో ఉన్న ఆమె మృతదేహాన్ని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సందర్శించి నివాళులర్పించారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువతి ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ వంటి వారు లాస్య నందిత మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి సానుభూతి తెలిపారు. లాస్య కుటుంబానికి అండగా ఉంటామని భారత రాష్ట్ర సమితి ఒక ప్రకటనలో తెలిపింది. మరో వైపు ప్రమాదానికి అతివేగం, నిద్రమత్తు కారణమని స్థానిక పోలీసులు అంటున్నారు