Komatireddy creates a sensation: తెలంగాణ రాజకీయాలలో సంచలనాలు అంతకంతకు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడు ఎటువంటి పరిణామం జరుగుతుందో అర్థం కావడం లేదు. మంత్రుల నుంచి మొదలు పెడితే ప్రతిపక్ష నాయకుల వరకు ప్రతి ఒక్కరు ఏదో ఒక విధమైన కామెంట్లు చేస్తున్నారు. అవి కాస్త సోషల్ మీడియా నుంచి ప్రధాన మీడియా వరకు విపరీతంగా చర్చలో ఉంటున్నాయి.
ఇటీవల కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై ఓ న్యూస్ ఛానల్ కథనాన్ని ప్రసారం చేసింది. ఈ కథనం తెలంగాణ రాజకీయాలనే కాదు ఏకంగా ఏపీ రాజకీయాలను కూడా ప్రభావితం చేసింది. ఈ వ్యవహారంలోకి కొంతమంది మీడియా ప్రతినిధులు ప్రవేశించడంతో మరింత వివాదంగా మారింది. దీనిపై ఏకంగా ముఖ్యమంత్రి స్పందించడం.. ఉప ముఖ్యమంత్రి కలగజేసుకోవడం.. ఆ తర్వాత బొగ్గు టెండర్లను రద్దు చేయడం వంటి పరిణామాలు జరిగాయి.
ఈ పరిణామాల కంటే ముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు. తన మీద కక్ష తీరకపోతే.. ఇంత విషం పెట్టి చంపాలని ఆవేదనతో మాట్లాడారు. ఆయన మాట్లాడిన మాటలు ఒకరకంగా తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టించాయి. ఇప్పుడు వాటిని మర్చిపోకముందే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం తెలంగాణ క్యాబినెట్లో కీలకమైన మంత్రిగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఆయన మంగళవారం తెలంగాణ విద్యా వ్యవస్థకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ” నేనే విద్యాశాఖ మంత్రిని అయితే కార్పొరేట్ పాఠశాలలను మూసి వేస్తాను. నారాయణ కాలేజీలో డిగ్రీ చేసిన వారు ఉంటే ప్రభుత్వ కాలేజీలలో పీహెచ్డీ చేసిన వారు ఉంటారు. ఏ ఉద్యోగం రాకుండా లక్షల ఉద్యోగం చేస్తున్నారు. బట్టి పట్టిస్తే వందల మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకోవాలి. విద్య అనేది వ్యాపారం కాదు. విద్యను వ్యాపారంగా మార్చడం సరికాదని” కోమటిరెడ్డి అన్నారు. మంగళవారం నల్గొండలో జరిగిన ఓ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్న శాఖను ఉద్దేశించి కోమటిరెడ్డి ఆ వ్యాఖ్యలు చేయడంతో సహజంగానే రాజకీయంగా చర్చకు దారి తీస్తోంది. కోమటిరెడ్డి మాట్లాడిన మాటలను గులాబీ మీడియా విపరీతమైన నెగిటివ్ ప్రచారం చేస్తోంది.. అయితే తాను చేసిన వ్యాఖ్యలను వేరే కోణంలో చూడవద్దని ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం గమనార్హం.