Medaram Jatara: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర. రెండేళ్లలకోసారి జరిగే ఈ జాతరకు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివస్తారు. ఈ ఏడాది జరుగనున్న మేడారం జాతర ఫిబ్రవరి 21న ప్రారంభం కానుంది. 24వ తేదీ వరకు జాతర జరుగుతుంది. దీంతో ఫిబ్రవరి 20 నుంచి పాఠశాలలపై జాతర ఎఫెక్ట్ పడింది. బుధవారం పగిడిద్ద రాజు, సారలమ్మ గద్దెలకు రానున్నారు. దీంతో చాలా మంది మంగళవారం నుంచే మేడారం బయల్దేరారు.
ఏర్పాట్లు పూర్తి..
మరోవైపు మేడారం జాతరలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. నాలుగు రోజుల్లో 2 కోట్ల మంది సమ్మక్క, సారలమ్మ దర్శనానికి వస్తారని అంచనా వేశారు. ఆర్టీసీ భక్తుల కోసం 6 వేల బస్సులు నడుపుతోంది. ఇక పోలీసులు 15 వేల మందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. 600 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వందల ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. జంపన్నవాగు పరిసరాల్లో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.
ములుగు జిల్లాలో నాలుగు రోజులు సెలవులు..
మేడారం జాతర నేపథ్యంలో ములుగు జిల్లాలోని పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. నాలుగు రోజులపాటు సులవులు ప్రకటిస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు. నాలుగు రోజులు జిల్లాలో విద్యాసంస్థలను మూసి వేయాలని ఆదేశించారు. ఆదివారం కూడా సెలవు కావడంతో మొత్తం వరుసగా ఐదు రోజులు సెలవులు వచ్చాయి.
ప్రభుత్వ కార్యాలయాలకు కూడా..
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతోపాటు ప్రభుత్వ కార్యాలయాలు కూడా పనిచేయవని కలెక్టర్ తెలిపారు. ఫిబ్రవరి 21, 22, 23, 24 తేదీల్లో ఈ సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. ప్రజలు గమనించి సహకరించాలని కోరారు. ఇక జాతరకు కోటి మందికిపైగా వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు మేడారం జాతరను తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర పండుగగా గుర్తించారు. ఈ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అయితే కేంద్రం జాతీయ పండుగగా గుర్తించకుండా ఏటా కొన్ని నిధులు మంజూరు చేస్తోంది.