HomeతెలంగాణMavoist Alert: తెలంగాణవైపు మావోయిస్టుల అడుగులు.. మరోసారి వార్ జోన్ గా అరణ్యం?

Mavoist Alert: తెలంగాణవైపు మావోయిస్టుల అడుగులు.. మరోసారి వార్ జోన్ గా అరణ్యం?

Mavoist Alert: తెలంగాణ వైపు మరోసారి మావోయిస్టులు దృష్టి సారించారు. గతంలో వరుస ఎన్ కౌంటర్లు, తీవ్ర నిర్బంధం నేపథ్యంలో ఛత్తీస్ గఢ్, ఒడిశా, జార్ఖండ్ వైపు వెళ్లిన దళాలు, ప్రస్తుతం మరోసారి తెలంగాణ వైపు చూస్తున్నట్లు తెలుస్తున్నది. మావోయిస్టు పార్టీ కీలక నేతలు తెలంగాణలో అడుగుపెట్టినట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతున్నది. దీనిని గుర్తించే పోలీస్ ఉన్నతాధికారులు బలగాలను రంగంలోకి దించినట్లు తెలుస్తున్నది. ఛత్తీస్ గఢ్ లో ఆపరేషన్ కగార్ పేరిట చేపట్టిన ఏరివేత కార్యక్రమంతో మావోయిస్టులు చెల్లాచెదురైనట్లు సమాచారం అందుతున్నది. దండకారణ్యంలో పెద్ద సంఖ్యలో కేంద్ర బలగాలు తిష్ఠ వేశాయి. దీంతో మావోయిస్టులకు ఆహారం, నీరు, మందులు అందడం కష్ట సాధ్యమవుతున్నట్లు తెలుస్తున్నది. దీంతోనే సరిహద్దులు దాటి తెలంగాణలోకి అడుగు పెట్టినట్లు అనుమానిస్తున్నారు. ఇటీవల ఆయా రాష్ట్రాల్లో జరిగిన వరుస ఎన్ కౌంటర్లలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులను పార్టీ కోల్పోయింది. ప్రస్తుతం ఉన్నవారిలో ఎక్కువ మంది వయసు మీద పడి ఉండడం, ఇతర కారణాల రీత్యా ఇక ఛత్తీస్ గఢ్ ను వదిలి తెలంగాణ వైపు కదులుతున్నట్లు తెలుస్తున్నది.

తెలంగాణ అడవుల్లో కూంబింగ్
తెలంగాణ అడవుల్లో ఇప్పటికే పోలీస్ బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ మొదలు పెట్టాయి. ముఖ్యంగా పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాల ఎస్పీల ఆధ్వర్యంలో ఈ బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టుల కదలికలపై కూపీ లాగుతున్నాయి. ఇన్ ఫార్మర్ల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నాయి.

మావోయిస్టు మూవెంట్ పై కేంద్రం సీరియస్ గా ఉన్న నేపథ్యంలో గ్రేహౌండ్స్ బలగాలు ఇప్పటికే అడవుల సమీపంలోని పల్లెలను చుట్టుముట్టాయి.  మరోవైపు మావోయిస్టు సానుభూతిపరులపై నిఘా పెట్టినట్లు తెలుస్తున్నది.  సరిహద్దు జిల్లాల ఎస్పీలు ఈ ఆపరేషన్ లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ములుగు జిల్లాలో మావోయిస్టుల డంప్ పట్టుబడడం కలకలం రేపింది. ఇందులో భాగంగా పలు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రజాప్రతినిధులే లక్ష్యంగా..
ప్రజా ప్రతినిధులు, వారి అనుచరులే లక్ష్యంగా మావోయిస్టులు రెచ్చిపోయే అవకాశం ఉండడంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో పాటు ఇప్పటికే బెదిరింపులు ఎదుర్కొంటున్న నేతలకు అదనపుభద్రత కల్పిస్తున్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు మావోయిస్టు హెచ్చరికల నేపథ్యంలో అదనపు భద్రత  కల్పించారు. ఆయన కార్యాలయానికి వచ్చి పోయే వారిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. దీంతో పాటు మిగతా నియోజకవర్గాల్లోనూ మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటనల సందర్భంగా అదనపు భద్రత కల్పిస్తున్నారు.

కొన్నాళ్లుగా నివురుగప్పిన నిప్పులా..
గత కొన్నేండ్లుగా తెలంగాణలో మావోయిస్టుల కదలికలు లేవు. అడపాదడపా మినహా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు.  ఈ క్రమంలో మరోసారి రాష్ర్టంలో మావోల కదలికలంటూ ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఇప్పటికిప్పుడు పూర్తిస్థాయిలో కదలికలు లేకున్నా ఏ క్షణమైన సరిహద్దులు దాటే అవకాశం ఉందని సమాచారం ఉన్నట్లు పోలీస్ అధికారులు చెబుతున్నారు.

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular