Marwadi Go Back: ఒకప్పుడు ఉద్యమాలు ప్రజల చైతన్యంతో జరిగేవి. ప్రజలు మూకుమ్మడిగా వీధుల్లోకి వచ్చేవారు. నినాదాలు చేసే వారు. నిరసనలు చేపట్టేవారు. తమ సమస్యను పరిష్కరించుకునేవారు. ఇలాంటి ఉద్యమాలే ప్రపంచ చరిత్ర గతిని.. భారతదేశ గతిని మార్చేశాయి.
నేటి కాలంలో ఉద్యమాలు మొత్తం సోషల్ మీడియా ద్వారా జరుగుతున్నాయి. అంతటి అమెరికాలో కూడా ఇటీవల కాలంలో ట్రంప్ వ్యతిరేక ఉద్యమాలు సోషల్ మీడియా వేదిక ద్వారానే పుట్టడం విశేషం. ఇవి మాత్రమే కాదు చాలా ఉద్యమాలు సోషల్ మీడియా వేదికగానే జరుగుతున్నాయి.. ఈ ఉద్యమాలు సహించని వారు టూల్ కిట్ అంటూ ఏవేవో వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ.. ఉద్యమాలు చేసే వారు ఏమాత్రం ఆగడం లేదు. పైగా రకరకాల రూపాలలో ఉద్యమాలు చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం జరుగుతోంది. ఏకంగా అమనగల్లు అనే ప్రాంతంలో బంద్ కు పిలుపు కూడా జరిగింది. ప్రభుత్వం వెంటనే అప్రమత్తం కావడంతో ఈ బంద్ ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ఈ సమస్య మూలాలను ఒకసారి పరిశీలిస్తే.. నేటికీ గ్రామాల్లో కోమట్లు, స్వర్ణకారులు, ఇతర కులవృత్తుల వారు వారి వారి వ్యాపారాలు చేస్తున్నారు. మన తెలంగాణలోకి మార్వాడీలు ఎప్పటినుంచో వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. మొదటి నుంచి కూడా స్థానికుల వ్యాపారాలలో మార్వాడీలు వేలు పెట్టకూడదని నిబంధన ఉన్నది. అయితే అమనగల్లు ప్రాంతంలో మార్వాడీలు ఈ నిబంధన అతిక్రమించారు. దీంతో స్థానిక వ్యాపారులలో ఆగ్రహం కలిగింది.. దీంతో వారు మార్వాడీలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఇందులోకి కొన్ని శక్తులు ప్రవేశించాయి. అది కాస్త రాజకీయ రంగు పులుముకుంది. ఇది కాస్త తెలంగాణలో అశాంతిని, అభద్రతను కలగజేస్తుందని ఇంటలిజెన్స్ ద్వారా గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది.
Also Read: మృతదేహానికి ఆంబోతు నివాళి.. వైరల్!
అమనగల్లు ప్రాంతంలో ఉన్న స్థానిక వ్యాపారులు, మార్వాడీలతో సమావేశం నిర్వహించింది. ఇద్దరి మధ్య సయోధ్య కుదిరించింది. తద్వారా సమస్య పరిష్కారమైంది.
ఈ సమస్య ఇక్కడితోనే ఆగి పోయేది కాదని.. ఇంకా చాలా దూరం వెళుతుందని విశ్లేషకులు అంటున్నారు. ప్రభుత్వం ఈ సమస్యను ముగిసిపోయింది అనుకోవద్దని.. దీని మూలాలను కనుగొని పరిష్కరించే బాధ్యత తీసుకోవాలని విశ్లేషకులు అంటున్నారు.. సమస్య ప్రస్తుతం తాత్కాలికంగా పరిష్కారం మాత్రమే అయిందని.. ఇంకా అనేక రకాల రూపాలలో ఈ సమస్య తెలంగాణ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.