Maoist Leader Daughter Letter: మావోయిస్టు అగ్రనేత మల్ల రాజిరెడ్డి కూతురు స్నేహలతా రెడ్డి తన తండ్రికి రాసిన ఉత్తరం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. “నాన్నకు ప్రేమతో కన్నీటి లేఖ..” అంటూ ఆమె తన లోపల దాచుకున్న బాడభాగ్నిని లేఖ రూపంలో పంపించారు. పొత్తిళ్ళలో పాపను విడిచి సమసమాజ స్థాపనకు అడవి బాట పట్టిన తల్లిదండ్రులు ఇరువురిని తలుచుకుంటూ రాసిన ఉత్తరం చదివిన ఎవరైనా హృదయాన్ని ద్రవింపచేస్తుంది. మంథని మండలం శాస్త్రులపల్లి వాస్తవ్యులు భారత కమ్యూనిస్టు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పోలీట్ బ్యూరో సభ్యుడు మల్లా రాజిరెడ్డి కి అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూకొద్ది రోజుల క్రితం ఛత్తీస్గఢ్ పోలీసులు ఆ నోటీసు ప్రతి పెద్దపల్లి జిల్లా మంథని మండలం శాస్త్రులపల్లి లోని మల్ల రాజిరెడ్డి ఇంటి తలుపులకు అంటించారు. అయితే మల్ల రాజిరెడ్డి అరెస్టుకు రంగం సిద్దమైందా, గతంలో ఒకసారి కేరళ రాష్ట్రంలోని అంగమాలైలో రాజిరెడ్డిని పోలీసులు పట్టుకొని కోర్టుకు హాజరు పరిచారు. అప్పుడు ఆ సంఘటన సంచలనం సృష్టించింది.
Also Read: రేవంత్ శత్రువును చంపలేదు.. ఓడించాడు
కొన్ని రోజులు రిమాండ్ లో ఉన్న ఆయన బెయిల్ పై విడుదలై తిరిగి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. కొన్ని నెలల క్రితం ఆయన ఒక ఎన్కౌంటర్ లో మృతిచెందినట్లు వీడియో వైరల్ అయ్యింది. ఆ తరువాత రాజిరెడ్డి క్షేమంగా ఉన్నట్లు మావోయిస్టు ప్రకటించడంతో వారి కుటుంబసభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే ప్రస్తుతం ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల అణచివేత కార్యక్రమాన్ని చేపట్టి సాయుధ పోలీసు బలగాలతో దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎప్పుడూ ఏ దుర్వార్త వినాల్సివస్తుందోనని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

లొంగుబాటలో అగ్రనేతలు
ఈ మధ్య కాలంలో చాలామంది అగ్రనేతలు వివిధ కారణాలతో రణం వీడి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. మావోయిస్టు పార్టీలో నూనూగు మీసాల వయస్సులో చేరి విప్లవోద్యమం లో వివిధ స్థాయిలో పనిచేసి ఎంతోమంది అమరులయ్యారు. మరికొంతమంది వృద్దాప్యం మూలంగా అనారోగ్యానికి గురై తప్పని పరిస్థితిలో లొంగుబాటులో పయనించారు. మావోయిస్టు ఉద్యమంలో మొదటి తరం నాయకుల్లో ఒకరైన మల్ల రాజిరెడ్డి మాత్రం పోలీసుల చేతికి చిక్కినా ఎన్నోసార్లు తిరిగి అడవిబాట పట్టారు. తన చిన్నారి కూతురును బంధువుల వద్ద వదిలి దశాబ్దాలుగా ఉద్యమ బాటలో ఇంకా పయనిస్తూనే ఉన్నారు. అయితే తల్లిదండ్రులకు చిన్ననాటి నుంచి దూరమై ఆ చిన్నారి తన జీవితంలో అడుగడుగున పడిన ఆవేదన వింటే హృదయం తరుక్కుపోతుంది. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పెరిగి పెద్దయి, ఉన్నత చదువులు పూర్తిచేసిన రాజన్న కూతురు స్నేహలత ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ ఖాసీం ను వివాహం చేసుకున్నారు. వారికి ఒక కూతురు కూడా జన్మించింది. ఆ చిన్నారి ఇప్పుడు తాత ఎలా ఉంటారు అని అడుగుతోందని, తన చిన్నప్పుడు నాన్న ఎలా ఉంటాడు అని తాను తన తల్లిని, బంధువులను అడిగిన జ్ఞాపకాలను తలుచుకుంటూ ఆమె సుదీర్ఘమైన లేఖ రాశారు. ఆ లేఖ పూర్తి పాఠం ఇలా ఉంది..
నాన్నా నిన్ను చివరిచూపు చూస్తానా..?
నేను క్షేమం… యుద్ధంలో ఉన్న నీ క్షేమాన్ని కోరటం అత్యాశే అవుతుంది. నిన్ను చూసే, నీతో మనసారా మాట్లాడే అవకాశం నాకెలాగూ లేదు. కనీసం నిన్ను చివరిచూపు చూస్తానో లేదోననే ఆందోళనతో…ఈ బహిరంగలేఖ రాస్తున్నాను. మొన్న నంబాల కేశవరావు అంకుల్‌ను అనాథగా దహనం చేసిన తర్వాత కనీసం నీ పార్థివదేహాన్ని చూడగలననే ఆశ కూడా కోల్పోయాను. నీతో ఇలా సంభాషించవలసి రావటమే అతి పెద్ద విషాదం. గత సంవత్సరం జరిగిన ఒక ఎన్‌కౌంటర్‌లో నీవే మరణించావని వార్త పొక్కింది. అది నిజమో, కాదో తేల్చుకోలేక వారం పాటు బాధాతప్త హృదయంతో ఉండిపోయాం. ఎన్‌కౌంటర్ వార్త విన్నప్పుడల్లా మా ఇద్దరు పిల్లలు ‘తాత ఎలా ఉంటాడమ్మా’ అని అడుగుతున్నారు. సరిగ్గా నలభై ఏళ్ల కిందట ‘నాన్న ఎలా ఉంటాడమ్మా’ అని నేను మా అమ్మని అడిగిన రోజులు నా స్మృతిపథంలోకి వచ్చాయి. కాలం చూడు ఎలా గడిచిపోయిందో. నీవు అజ్ఞాతంలోకి వెళ్లి యాభై ఏళ్లు గడిచాయి. మొన్న ఎవరో అంటే విన్నాను నీవు, మల్లోజుల కోటేశ్వరరావు, గణపతి అంకుల్ మొదటితరం నాయకులని. మీ జీవితంలో మూడోవంతు ప్రజలకు అంకితం చేసారు. ఏ మనిషికైనా ఇలాంటి జీవితం అరుదుగా లభిస్తుంది.
స్వాతంత్ర్య పోరాటంలో వీరుల గాథలను పుస్తకాలలో చదివాను. ఇప్పుడు స్వయంగా నా తండ్రే అలాంటి చరిత్రలో భాగమైనందుకు గర్వంగా ఉంది. నేను పుట్టేనాటికే నీవు విప్లవాన్ని ప్రేమించావని అమ్మ చెప్పింది. అంతకు మునుపే నీవు అమ్మను ప్రేమించావు. ఆమె నిన్ను, నీవు కోరుకున్న విప్లవాన్ని ప్రేమించి, పొత్తిళ్లలో ఉన్న నన్ను వదిలివేసి నీతో వచ్చింది. తల్లీ తండ్రీ ఉండి కూడా అనాథలా బతికాను.
నిరాదరణ, ఈసడింపులు జీవితాన్ని వెక్కిరించాయి. దుఃఖం కట్టలు తెంచుకొని నిద్రలేని రాత్రులు నాతో సహవాసం చేశాయి. బంధువులకు భారమైనప్పుడల్లా నేను గూడులేని పక్షినే. ఆరేళ్ల వయసులో అనుకుంటాను నేనున్న చోటుకు సంవత్సరం తర్వాత ఒకరోజు అమ్మ వచ్చింది. నేను అమ్మను గుర్తుపట్టలేదు. యథాలాపంగా నా ఆటలో నేను మునిగిపోయాను. ఆమె నా దరి చేరి అక్కున చేర్చుకొని ‘నేను మీ అమ్మనని’ చెప్పింది. ఈ ప్రపంచంలో ఏ తల్లికి అలాంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాను. ఇక ఆ తర్వాత అమ్మ కూడా నా దగ్గరకు రావటం తగ్గిపోయింది. నేను అక్షరాలు నేర్చుకుంటున్న సమయంలోనే నా బాగోగులు చూసుకుంటున్న వారిని వదిలి మరో చోటుకు పంపించారు. హాయిగా అమ్మ ఒడిలో నిద్రించవలసిన వయసు, చందమామ కథలు వినవలసిన సమయం, గోరుముద్దలు తినవలసిన కాలంలో బతుకు చితికి, కన్నీళ్లు మింగాల్సివచ్చింది. బాలకార్మికురాలి పాత్రలోకి జీవితం తర్జుమా అయింది. ఉదయాన్నే నిద్రలేచి, నా వయసుకు తగని పనులు చేసి, అప్పటికే అలసిపోయి బడికి వెళ్లేదాన్ని. కడుపునిండా తిండి, కంటి నిండా నిద్ర నాకు చాలా దూరంగా ఉండిపోయాయి. పారిపోవాలని ఉండేది కానీ గమ్యం తెలియదు. చనిపోవాలని అనిపించేది కానీ మార్గం తెలియదు. అప్పుడప్పుడు ఊళ్లోకి వచ్చే నీ సహచరులు కనుక్కునే యోగక్షేమాలే నాకు లభించే ఊరట. ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో డాక్టర్ కావాలని ఉండేది కానీ, నాకు సరైన దారి దొరకలేదు సరికదా దారిచూపేవాళ్లూ లేరు. అప్పుడనిపించింది. అందరిలాగా నాకు అమ్మానాన్న ఉంటే ఇష్టమైన చదువు దొరికేది కదా! అని. అంతిమంగా నావి అస్థిరమైన వానాకాలం చదువులయ్యాయి. నా ప్రమేయం లేకుండానే నేను ఉండే స్థలం, చదువు నిర్ణయం జరిగి మారుతుండేవి.
అలా హైదరాబాద్ నగరానికి మారిపోయాను. లక్షలాది మంది అనాథలను, వలస కార్మికులను తన ఒడిలో చేర్చుకున్న ఈ నగరం నాకింత చోటిచ్చింది. కాస్త జీవితాన్నిచ్చింది. కొంత జ్ఞానానిచ్చింది. కొత్త స్నేహాలు, రాజకీయాలు, సామాజిక చలనాలు, ఆచరణ, అధ్యయనం నాకింత మనోధైర్యాన్ని ఇచ్చాయి. ప్రపంచం అర్థమయ్యేకొద్దీ సాంత్వన లభించింది. సరిగ్గా ఈ సమయంలోనే నా జీవితాన్ని అల్లకల్లోలం చేసిన పిడుగులాంటి వార్త విన్నాను.
చంటి పిల్లగా నన్ను వదిలేసిపోయిన మా అమ్మ ఎన్‌కౌంటర్ అయింది (ఆగస్టు 13, 1998). అది జరిగిన నెల రోజులకు నాకు ఆ విషయం తెలిసింది. అనాథ శవంగా మా అమ్మ మిగిలిపోయింది. ఆమెను ఎవరో ఖననం చేసారు. పిచ్చిదానిలా హైదరాబాద్ రోడ్లు పట్టి తిరిగాను. రాత్రి, పగలని తేడా లేకుండా సంచరించాను. నిద్రాహారాలు మాని దుఃఖాన్ని ఆశ్రయించాను. ఒంటరిదాన్ని అయిపోయాను. కనిపించని శత్రువుతో మౌనంగా యుద్ధం చేసాను. తండ్రి ఉండీ రాలేడు. తల్లి మరణించింది. ఈ జీవితం ఎందుకని ఎన్నిసార్లు అన్పించిందో! ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీలో సీటురావటం నా జీవితానికి చుక్కానిలా అన్పించింది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం కావటం వలన మామూలు మనిషిని కాగలిగాను. కానీ నేను పెళ్లి చేసుకున్న రోజు నీవు నా పక్కన ఉంటే ఎంత బాగుండునో కదా! నీ మనుమరాలు నా కడుపులో పడినప్పుడు ఈ వార్త నీతో చెప్పాలని ఎంత ఆశపడ్డానో. అందరు స్త్రీల వలె తల్లిదండ్రుల చేతుల మీదుగా నాకు సీమంతం జరగాలని ఎన్నిసార్లు అన్పించిందో.
బాలింత వాసన తీరకముందే నా బిడ్డకు నేనే స్నానం చేయించుకోవలసి వచ్చింది. నీ చేతుల్లో ఆడుకోవాలని, నీ భుజాల మీద కూర్చోవాలని, నీ వేలు పట్టి నడవాలని ఎన్నోసార్లు కోరుకున్నాను. కనీసం నా పిల్లలనైనా నీవు ఎత్తుకుంటే చూసి మురిసిపోవాలని భావించాను. డియర్ నాన్న, నేను కోరుకున్నవేవీ జరగలేదు, జరుగుతాయనే నమ్మకం లేదు. కానీ నీవు, నీ సహచరులు క్షేమంగా ఉండాలని, నీకు ఏ ప్రమాదం జరగకూడదని బిడ్డగా నా కోరిక. నీవు కోరుకున్న పోరాటం జయాపజయాలతో నిమిత్తం లేకుండా, విరామమెరుగని నీ ప్రయాణంలో ‘మా నాన్న హీరోనే’నని నా పిల్లలకు చెప్పే రోజొకటి ఉంటుందని మాత్రం చెప్పగలను. నీవు మల్ల రాజిరెడ్డివో, మీసాల రాజన్నవో, సాయన్నవో, సంగ్రాంవో, మురళివో నాకు తెలియదు. నాకు మాత్రం బాపువే… అంటూ స్నేహలత రాసిన లేఖ సంచలనం సృష్టించింది.