Mangli Bathukamma Song 2022: ప్రకృతిలో దొరికే పూలను పూజించే పండుగ బతుకమ్మ. దీనిపై ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నా దాని విలువ మాత్రం ఇప్పటికి తగ్గడం లేదు. మహిళల పండుగగా బతుకమ్మకు మంచి పేరుంది. ప్రతి ఏటా జరుపుకునే పండుగలలో బతుకమ్మ ప్రత్యేకతే వేరు. ప్రపంచంలో పూలను పూజించే పండుగ ఇదే కావడం గమనార్హం. ప్రకృతిని ఆరాధించే మానవుడు అందులో దొరికే పూలను సైతం భక్తిభావంతో పూజించడం నిజంగా పండుగే. ఆడపడుచుల పండుగగా ఆరాధించే బతుకమ్మకు ఇంటింటా పండుగ వాతావరణం కనిపిస్తూనే ఉంటుంది. ఆడబిడ్డల కోలాహలం సందడిగా మారుతుంది. అందమైన బతుకమ్మలను పేర్చి అందంగా పాటలు పాడుతూ నృత్యాలు చేయడం మన సంప్రదాయమే.

తొమ్మిది రోజుల పండుగకు నేడు శ్రీకారం చుడుతున్నారు. ఎంగిలిపూల బతుకమ్మగా పిలిచే నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డలు బతుకమ్మలను పేర్చి బజారులో ఉంచి ఆటలాడుతుంటారు. ఈ నేపథ్యంలో ప్రముఖ గాయని మంగ్లీ పాడిన పాట అందరిని అలరిస్తోంది. ప్రముఖ కవి గోరేటి వెంకన్న రాసిన పాటను మంగ్లీ అందంగా పాడింది. దీంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనికి మదీన్ ఎస్కే సంగీతం సమకూర్చారు. దామోదర్ దర్శకత్వం వహించారు. తన సోదరి ఇంద్రావతి చౌహాన్ తో కలిసి పాడింది.
ప్రతి బతుకమ్మ పండుగకు ఓ పాట పాడటం మంగ్లీకి అలవాటుగా మారింది. ఏదో ఒక కొత్త పాటను పాడి ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ఆమె పాడే పాటలకు ప్రేక్షకులు డ్యాన్సులు కూడా చేస్తారు. దీంతో బతుకమ్మ పాటను పాడుతూ నృత్యం చేయడం మహిళలకు మహా రంజుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో బతుకమ్మ పాటలకు భలే డిమాండ్ ఉంది. మంగ్లీ పాడే పాటలకు చాలా మంది ఫిదా అవుతుంటారు. ఆమె గొంతు వింటే చాలు నాట్యం చేయడం తెలిసిందే. అంతటి పాపులారిటీ సంపాదించుకున్న మంగ్లీ ప్రతి బతుకమ్మకు ఓ కొత్త పాట పాడుతూ అలరిస్తోంది.

వీ6 వారి చానల్ తో ప్రాచుర్యంలోకి వచ్చిన మంగ్లీ నేడు మంచి గాయనిగా పేరు తెచ్చుకుంది. వ్యాఖ్యాతగా జీవితం ప్రారంభించి ప్రస్తుతం గాయనిగా ఖ్యాతి గడించింది. పలు సినిమాల్లో కూడా పాడుతూ తన గళానికి ప్రాచుర్యం తెచ్చుకుంటోంది. మంగ్లీ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం. వీ6తో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన మంగ్లీ ఇప్పుడు ఎంతో ఎత్తుకు ఎదిగింది. తన స్వయంకృషితో పాటలు పాడుతూ ప్రముఖ సింగర్లలో ఒకరిగా నిలవడం గమనార్హం. భవిష్యత్ లో ఆమె మరిన్ని పాటలు పాడి మంచి పేరు తెచ్చుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.