Mallu Bhatti Vikramarka: సీఎం పదవి రాకపోవడం పట్ల..భట్టి ఆసక్తి కరమైన కామెంట్స్

రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ముందు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని ఆశించిన మాట నిజమేనని, అధిష్టానం ముందు కూడా అదే విషయాన్ని చెప్పానని పేర్కొన్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : December 7, 2023 1:57 pm

Mallu Bhatti Vikramarka

Follow us on

Mallu Bhatti Vikramarka: తెలంగాణ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 65(సీపీఐ తో కలిపి) సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. సీనియర్ నాయకులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, గడ్డం ప్రసాద్ వంటి వారు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.. అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ముందు మూడు రోజులు పలు నాటకీయ పరిణామాలు జరిగాయి. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని సీనియర్ నాయకులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు వంటి వారు వ్యతిరేకించినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వారిని కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీకి పిలిపించుకొని సర్ది చెప్పడంతో రేవంత్ రెడ్డి కి లైన్ క్లియర్ అయింది.
భట్టి ఆసక్తికర వ్యాఖ్యలు

రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ముందు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని ఆశించిన మాట నిజమేనని, అధిష్టానం ముందు కూడా అదే విషయాన్ని చెప్పానని పేర్కొన్నారు. కానీ అధిష్టానం రేవంత్ రెడ్డి వైపు మొగ్గుచూపిందన్నారు. అధిష్టానం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. తన జిల్లాలో ఇప్పటివరకు జలగం వెంగళరావు మాత్రమే ముఖ్యమంత్రి అయ్యారని, ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తనకు ఆ అవకాశం కల్పిస్తారని భావించానన్నారు. కానీ ఉపముఖ్యమంత్రిగా పనిచేయాలని అధిష్టానం ఆదేశించడంతో.. ఆ పదవి బాధ్యతలు స్వీకరిస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, అందరికీ పదవులు లభించాలంటే కష్టమని అన్నారు. పార్టీ లైన్లోనే తాను పనిచేస్తానని, ఇందులో ఎటువంటి భేషాలకు తావులేదన్నారు. తెలంగాణ అభివృద్ధికి తామంతా పాటు పడతామని పేర్కొన్నారు.

ఎందుకు తలవంచినట్టు

వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి మెరుగైన సీట్లు లభించడంతో భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెంచుకున్నారు. ఇటీవల మధిరలో ఆయన ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు జలగం వెంగళరావు తర్వాత తనకు ఆ అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. తనని గెలిపిస్తే ఆ స్థానంలో ఉంటానని వివరించారు. కానీ అధిష్టానం రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపడంతో భట్టి విక్రమార్కకు ముఖ్యమంత్రి పదవి లభించలేదు. అధిష్టానం ఎదుట తన వాణి వినిపించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. కేసి వేణుగోపాల్ వంటి వారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎందుకు కావాలో, ఆయన ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఎందుకు ఉందో స్పష్టంగా వివరించడంతో విక్రమార్క వెనక్కి తప్పుకోవలసి వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తుందని, దీనివల్ల అధికార భారత రాష్ట్ర సమితికి చిక్కులు తప్పవని విక్రమార్క భావించారు. కానీ రేవంత్ రెడ్డి వైపు అధిష్టానం మొగ్గు చూపడంతో భట్టి ముఖ్యమంత్రి కల నెరవేరలేదు.