Bandi Sanjay : రాజకీయ నాయకులు బయటికి ఎన్నో విమర్శలు చేసుకుంటారు. అదే స్థాయిలో ఆరోపణలు చేసుకుంటారు. ఈ విమర్శలు నిజమని.. ఈ ఆరోపణలు యదార్ధమని భావించి కింది స్థాయి కార్యకర్తలు రెచ్చిపోతారు.. సోషల్ మీడియాలో యుద్ధాలు చేసుకుంటారు. అవసరమైతే పరస్పరం దాడులు కూడా చేసుకుంటారు. ఇంత జరిగినా కూడా రాజకీయ నాయకులు వారిని సముదాయించే ప్రయత్నం చేయరు. పైగా మరింత మంట పెట్టే విధంగా వ్యవహరిస్తుంటారు. మరింత ఘాటుగా వ్యాఖ్యలు చేస్తూ వివాదాన్ని ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటారు.. ఆ మంటల్లో చలికాచుకొని తమ ప్రయోజనాలను మరింత పెంచుకుంటారు రాజకీయ నాయకులు. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యం వల్ల రాజకీయ నాయకుల అసలు రంగులు బయటపడుతున్నాయి. వారి నిజరూపాలు దర్శనమిస్తున్నాయి.. ఒకవేళ ఈ సోషల్ మీడియా గనుక లేకుంటే.. రాజకీయ నాయకుల నిజ స్వరూపాలు బయటికి కనిపించేవి కాదు.
తెలంగాణలో భారత రాష్ట్ర సమితికి, భారతీయ జనతా పార్టీకి కొన్నాళ్లపాటు యుద్ధమే జరిగింది.. ముఖ్యంగా బండి సంజయ్ భారతి జనతా పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భారత రాష్ట్ర సమితితో నిత్యం యుద్ధమే జరిగేది. బండి సంజయ్ ని భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు జైలుకు కూడా తరలించింది. చిన్న చిన్న కారణాలతోనే అరెస్టు చేసింది. అప్పట్లో ఈ ఘటనలు సంచలనంగా మారాయి. భారత రాష్ట్ర సమితి అధికారం కోల్పోయిన తర్వాత ఆ తరహా సంఘటనలు తెలంగాణలో జరగడం లేదు. పైగా బండి సంజయ్ రెండవ పర్యాయం కరీంనగర్ పార్లమెంటు స్థానం నుంచి గెలిచి.. ప్రస్తుతం హోమ్ శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు. ఒకప్పటిలాగా బండి సంజయ్ తెలంగాణ రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషించలేకపోతున్నారు. అప్పుడప్పుడు కాస్త ఘాటు వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో ఉంటున్నారు. బండి సంజయ్ ఇటీవల ఓ నాయకుడిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అవి పార్టీలో చర్చకు దారి తీసాయి. కొద్దిరోజులపాటు మీడియాలో ప్రముఖంగా నానిన బండి సంజయ్.. ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారారు. అయితే ఈసారి ఆయన ఎవరి మీద ఎటువంటి విమర్శలు చేయలేదు. ఆరోపణలు చేయలేదు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బోనాల వేడుకలు జరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.. బోనాల వేడుకల్లో పాల్గొన్న బండి సంజయ్.. మేకల మండి ప్రాంతంలో బిజెపి నాయకుడి ఇంట్లో భోజనం చేశారు. బిజెపి నాయకుడి ఇంట్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి భోజనం చేయడం పెద్ద విషయం కాదు. కాకపోతే హోం శాఖ సహాయ మంత్రి తో కార్మిక శాఖ మాజీమంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు కూడా పాల్గొన్నారు. వారిద్దరూ ఆ బిజెపి నాయకుడి ఇంట్లో కలిసి భోజనం చేశారు. ఇటీవల పాతబస్తీలో బోనాల వేడుకలు జరిగినప్పుడు బిజెపి నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలలో బండి సంజయ్, ప్రీతి రెడ్డి ఫోటోలను ఏర్పాటు చేశారు.. భారత రాష్ట్ర సమితిలో కొనసాగుతున్న ప్రీతి రెడ్డి, బిజెపిలో ఉన్న బండి సంజయ్ తో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పట్ల చర్చ జరుగుతోంది. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం మల్లారెడ్డి కి సంబంధించిన ఆస్తులను ధ్వంసం చేసింది. ముఖ్యంగా ఆయన నిర్మించిన కాలేజీలలో కొన్ని నిర్మాణాలు అక్రమంగా ఉన్నాయంటూ పడగొట్టింది. భవిష్యత్తులో మరిన్ని కూల్చివేతలు ఉంటాయని సంకేతాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే మల్లారెడ్డి కోడలు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ని కలవడం చర్చనీయాంశంగా మారింది. ఆస్తులను కాపాడుకునేందుకు ప్రీతి రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరుతారా? అందువల్లే ఆమె అనుచరులు ఈ స్థాయిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారా? బండి సంజయ్ తో లంచ్ మీటింగు అందువల్లేనా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే వీటిపై త్వరలోనే క్లారిటీ వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
కేంద్రమంత్రి బండి సంజయ్ తో ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు భేటీ
మేకలమండి బీజేపీ లీడర్ ఇంట్లో కేంద్రమంత్రితో కలిసి ప్రీతిరెడ్డి లంచ్ మీటింగ్.
పాతబస్తీ బోనాల్లోనూ బండి సంజయ్ ఫోటోతో ప్రీతిరెడ్డి ఫ్లెక్సీల ఏర్పాటు.
బీఆర్ఎస్ లో ఉన్న ప్రీతిరెడ్డి … బండిసంజయ్ ను కలవడంపై ఇరు… pic.twitter.com/s4j1utwMAE— ChotaNews App (@ChotaNewsApp) July 21, 2025