Malla Reddy AI Lessons: సంపాదనకు అలవాటు పడ్డ మనిషి ప్రతి దాంట్లో కూడా డబ్బునే చూస్తాడు. పైసా పెట్టుబడి పెడితే ఎంత లాభం వస్తుందో ముందుగానే అంచనా వేస్తాడు.. అటువంటివారు ఎందరో అడుగుపెట్టినా సరే ధనలక్ష్మి పరుగులు తీసుకుంటూ వస్తుంది. ఇటువంటి అదృష్ట జాతకులు కొంతమంది మాత్రమే ఉంటారు. అందులో మన మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సార్ మొదటి స్థానంలో ఉంటాడు.
పాల వ్యాపారంతో మొదలుపెట్టి.. పూలను అమ్మే స్థాయికి ఎదిగి.. బోర్వెల్ వ్యాపారం స్టార్ట్ చేసి.. ఎన్నో పాఠశాలలు.. కళాశాలలు.. ఇప్పుడు ఏకంగా దేశంలోనే ఏఐ యూనివర్సిటీ.. ఇలా చెప్పుకుంటూ పోతే మల్లారెడ్డి కథ ఈ కథనంతోనే ముగియదు. ఎన్ని రకాల విమర్శలు ఉన్నా.. మల్లారెడ్డి స్టయిల్ వేరే విధంగా ఉంటుంది. తన పొలిటికల్ లీడర్ కాకముందు ఒక వ్యాపారి. వ్యాపారిగా విజయం సాధించిన తర్వాత.. తన ఆస్తులను కాపాడుకునేందుకు రాజకీయాల్లోకి వచ్చారు. చాలామంది ఆయన సేవ చేయడానికి వచ్చారు అంటారు గాని.. ఒక వ్యాపారి సమాజ సేవ చేయడం ఈ దేశం ఇంతవరకు చూడలేదు. ఇకముందు చూసే అవకాశం లేదు.
తాజాగా మల్లారెడ్డి ప్రొఫెసర్ అవతారం ఎత్తారు.. ఏఐ పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు. అందులో ఏం నేర్చుకోవాలి.. ఎలా నేర్చుకోవాలి.. అనుభవాన్ని ఎలా ఉపయోగించుకోవాలి.. ఈ కాలానికి మనల్ని మనం ఎలా మార్చుకోవాలి అనే అంశాల మీద పాఠాలు చెప్పారు. జీవిత సారాన్ని అవపోసన పట్టిన వ్యక్తిగా మల్లారెడ్డి వాస్తవాలను చెప్పుకుంటూ పోయారు.. చాలామంది ఆయన మాటలకు కనెక్ట్ అయ్యారు.. అయితే చివర్లో మల్లారెడ్డి ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఇంత చెప్పిన తర్వాత ఏఐ ఎందుకు ఎంచుకోవాలి.. ఏ ఐ ద్వారా ఏం జరుగుతోంది.. భవిష్యత్తులో వచ్చే మార్పుల గురించి స్పష్టంగా చెప్పారు. ఆయన ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి తనకు తానే ఒక బ్రాండ్ గా మారిపోయి ప్రచారం చేసుకుంటున్నారు.
గతంలో ఉత్తర ప్రదేశ్ లో యూనివర్సిటీ పెడుతున్నట్టు మల్లారెడ్డి ప్రకటించారు. దానికంటే ముందు హైదరాబాదులో యూనివర్సిటీని ప్రారంభిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో కూడా త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఢిల్లీ.. రాజస్థాన్ వంటి ప్రాంతాలలో కూడా ఆయన విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం. మొత్తానికి పాలు, పూలు, బోర్ వెల్, రాజకీయాలలో దండగానే సంపాదించిన మల్లారెడ్డి.. ఇప్పుడు విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసి కూడా అంతకుమించి అనే స్థాయిలో వెనకేసుకుంటున్నారు. ఎంతైనా మల్లారెడ్డి బుర్రే బుర్ర.
