Malkajgiri: మల్కాజిగిరి ట్రెండ్ : ఈటల గెలుస్తాడా? ప్రత్యర్థుల వశమవుతుందా?

బీజేపీకి బీఆర్ఎస్‌,కాంగ్రెస్‌ల నుంచి అస్స‌లు పోటీ ఉండ‌క‌పోవ‌చ్చ‌ని స‌ర్వే సంస్థ‌లు ఎక్స్‌ఫెక్ట్ చేస్తున్నాయి. పోలింగ్ స‌ర‌ళిని బ‌ట్టి చూస్తే ఈసారి మొత్తం పోలైన ఓట్ల‌లో ఈటెల‌కు 46 శాతం వ‌ర‌కు ఓట్లు రావొచ్చ‌ని అంచ‌నా వేస్తున్నాయి.

Written By: Neelambaram, Updated On : May 15, 2024 1:22 pm

Malkajgiri

Follow us on

Malkajgiri: మ‌ల్కాజిగిరి పార్ల‌మెంట్ సెగ్మెంట్..ఇదొక మినీ ఇండియా. దేశంలోనే అతిపెద్ద లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గ‌మైన ఈ సెగ్మెంట్ లో దాదాపు అన్ని రాష్ట్రాల‌కు సంబంధించిన ప్ర‌జ‌లు నివ‌సిస్తున్నారు. అయితే విభిన్న ప్రాంతాల‌కు చెందిన ప్ర‌జ‌ల‌కు నిల‌య‌మైన ఈ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌తీసారి ఆస‌క్తిక‌ర తీర్పునిస్తుంది. 2019 ఎన్నిక‌ల్లో ఇక్క‌డి నుంచి ప్ర‌స్తుత‌ రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ త‌ర‌పున బ‌రిలో నిలిచి గెలుపొందారు. అంత‌కు ముందు ఇక్క‌డి నుంచే బీఆర్ఎస్ నేత‌,మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఈసారి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మూడు ప్ర‌ధాన పార్టీలు బీజేపీ,కాంగ్రెస్‌,బీఆర్ఎస్‌లు త‌మ పార్టీల అభ్య‌ర్థుల గెలుపుకోసం శ‌త విధాలుగా ప్ర‌య‌త్నించాయి. బీజేపీ త‌ర‌పున ఈట‌ల రాజేంద‌ర్,కాంగ్రెస్ త‌ర‌పున ప‌ట్నం సునీతా మ‌హేంద‌ర్ రెడ్డి,బీఆర్ఎస్ త‌ర‌పున రాగిడి ల‌క్ష్మారెడ్డిలు గెలుపు కోసం హోరాహోరీ ప్ర‌య‌త్నాలు చేశారు.

అయితే ఇంత‌టి ట‌ఫ్ కాంపిటిష‌న్ ఇచ్చిన త‌రుణంలో ఈసారి మ‌ల్కాజిగిరిపై దేశ వ్యాప్తంగా అంద‌రి దృష్టి ప‌డింది. ఇక్క‌డి నుంచి ఎవ‌రు ఎంపీగా గెలుపొందుతార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. బీజేపీ త‌ర‌పున బ‌రిలో ఉన్న ఈటెల రాజేంద‌ర్ గెలుస్తాడా..? లేక బీఆర్ఎస్ అభ్య‌ర్థి రాగిడి,సునీతా మ‌హేంద‌ర్ రెడ్డిలు గెలుస్తారా..? అనే దానిపై జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది. వాస్త‌వానికి తెలంగాణ‌లో బీజేపీ గెలిచే స్థానాల్లో అత్య‌ధిక మెజార్టీ మ‌ల్కాజిగిరి సెగ్మెంట్‌లోనే రావొచ్చ‌ని భాజ‌పా నాయ‌క‌త్వం భావించింది. ఈటెల రాజేంద‌ర్ భారీ మెజార్టీతో మ‌ల్కాజిగిరిలో కాషాయ జెండాను ఎగుర‌వేస్తార‌ని ఆ పార్టీలు ధీమాగా ఉన్నారు. మ‌ల్కాజ్ గిరి సెగ్మెంట్ మొత్తం 7 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలున్నాయి. ఇందులో గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఏడింటికి ఏడు బీఆర్ఎస్ అభ్య‌ర్థులే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అయితే పార్ల‌మెంట్ ఎన్నిక‌కు వ‌చ్చేస‌రికి మాత్రం ప‌రిస్థితుల్లో పూర్తిగా మార్పు వ‌చ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. ఈసారి ఈ సెగ్మెంట్ నుంచి బీజేపీ విజ‌య‌ఢంకా మోగించ‌వ‌చ్చ‌ని అన్ని స‌ర్వేలు చెబుతున్నాయి. అంతేకాదు ఈట‌ల‌కు బంఫ‌ర్ మెజార్టీ ఖాయ‌మ‌ని అంచ‌నా వేస్తున్నాయి.

బీజేపీకి బీఆర్ఎస్‌,కాంగ్రెస్‌ల నుంచి అస్స‌లు పోటీ ఉండ‌క‌పోవ‌చ్చ‌ని స‌ర్వే సంస్థ‌లు ఎక్స్‌ఫెక్ట్ చేస్తున్నాయి. పోలింగ్ స‌ర‌ళిని బ‌ట్టి చూస్తే ఈసారి మొత్తం పోలైన ఓట్ల‌లో ఈటెల‌కు 46 శాతం వ‌ర‌కు ఓట్లు రావొచ్చ‌ని అంచ‌నా వేస్తున్నాయి. మొత్తం నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్‌లోనూ బీజేపీ స్ప‌ష్ట‌మైన ఆధిక్య‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తుంద‌ని మెజార్టీ స‌ర్వే సంస్థ‌లు చెబుతున్నాయి. అంతేకాక ఈటెల రాజేంద‌ర్‌కు బీసీ వ‌ర్గాలు ద‌న్నుగా నిలిచిన‌ట్లు వెల్ల‌డిస్తున్నాయి. మొత్తంగా బీజేపీ ఈసారి 46-56 శాతం ఓట్ల‌ను సాధించే అవ‌కాశాలుండ‌గా..కాంగ్రెస్ 20-30 శాతం ఓట్లు..బీఆర్ఎస్ 15-20 శాతానికే ప‌రిమితం కావొచ్చ‌ని అంచ‌నా వేస్తున్నాయి.