Maganti Sunitha mass warning: ఎన్నికలు అన్నాక ఓటములు సహజం. గెలుపులు కూడా సహజమే. కానీ ఈ విషయాన్ని కొంతమంది నాయకులు వేరే విధంగా చూస్తారు. ఎన్నికలను అత్యంత పర్సనల్ గా తీసుకుంటారు. తద్వారా ఓటమి ఎదురైతే దారుణంగా విమర్శలు చేస్తారు. ఓటమి తట్టుకోలేక ఆ ఫ్రస్ట్రేషన్ తో రకరకాల వ్యాఖ్యలు చేస్తారు. తెలంగాణలో ఈ తరహా రాజకీయ నాయకులకు ఇటీవల కాలంలో కొదువ లేకుండా పోయింది. ఇప్పుడు ఈ జాబితాలోకి జూబ్లీహిల్స్ గులాబీ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత చేరిపోయారు.
ఎన్నికల సమయంలో.. ముఖ్యంగా ప్రచార సమయంలో సునీత సింపతి కోసం ఏడ్చారు. తన భర్త మాగంటి గోపీనాథ్ ఆశయ సాధనకు కృషి చేయాలని.. తనకు ఆ బాధ్యత అప్పగించాలని జూబ్లీహిల్స్ ఓటర్లను కోరారు. గడపగడప తిరుగుతూ ప్రచారం చేశారు. ప్రచారంలో తన కొడుకును, ఇద్దరు కుమార్తెలను కూడా భాగస్వాములను చేశారు. సునిత వెంట కేటీఆర్ కూడా ఉన్నారు. సునీత, కేటీఆర్ కలిసి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడిచిన మూడుసార్లు గోపీనాథ్ ఎమ్మెల్యేగా గెలవడం.. ముఖ్యంగా 2023 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా సీట్లు వచ్చినప్పటికీ.. జూబ్లీహిల్స్ స్థానంలో తన భర్త గెలవడంతో.. సునీత విజయం మీద భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ జూబ్లీహిల్స్ ఓటర్లు వేరే విధంగా స్క్రిప్ట్ రాశారు. దీంతో సునీతకు ఓటమి తప్పలేదు.
వాస్తవానికి ఎన్నికల్లో ఓటమిని స్పోర్టివ్ గా తీసుకోవాలి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలిచే విధంగా ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పాలి. అవసరమైతే కార్యకర్తలలో ధైర్యాన్ని పెంపొందించే మాటలు మాట్లాడాలి. కానీ వీటిని పక్కనపెట్టి సునీత వేరే విధంగా మాట్లాడారు.. నైతిక విజయం తనదే అంటూ మాట్లాడిన ఆమె.. ఎమ్మెల్యేగా గెలిచిన నవీన్ యాదవ్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు..”జన్మకో శివరాత్రి సామెత మాదిరిగా ఎన్నికల్లో గెలిచావు. గోపీనాథ్ ఉన్నన్ని రోజులు మూసుకుని కూర్చున్నావు. గోపీనాథ్ లేడు కాబట్టి ఇవాళ బయటకు వచ్చి నీ ప్రతాపం చూపిస్తున్నావు. ఇది నీ గెలుపు కాదు. అందరూ కలిసి చేసిన గెలుపు ఇది. చెప్తున్న కదా నైతికంగా నేను ఎప్పుడో గెలిచాను. నువ్వు రౌడీయిజం చేసి గెలిచావు. ప్రతి బూత్ లో రిగ్గింగ్ చేశావు. దొంగ ఓట్లు వేయించుకున్నావని” మాగంటి సునీత ఆరోపించారు. మాగంటి సునీత ఇలాంటి మాటలు మాట్లాడతారని గులాబీ పార్టీ నాయకులు కూడా ఊహించలేదు. ఓటమి తట్టుకోలేక.. ఆమె తీవ్రమైన ఫ్రస్టేషన్ లో ఇలా మాట్లాడారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి ఎమ్మెల్యే అవ్వడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపిస్తున్నారు.