Lorry washed away: మొంథా తుఫాను రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన నష్టాన్ని కలిగించింది. కోతకు వచ్చిన పంటలు మొత్తం నీళ్ల పాలు కావడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలలో వరి పంట కోతకు వచ్చింది. పత్తి సేకరణ దశలో ఉంది. మొక్కజొన్న కూడా నూర్చే దశకు వచ్చింది. మిర్చి పూత దశలో ఉంది. పసుపు, అపరాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పంటలు కీలక దశలో ఉన్నాయి.
రైతులు ఎన్నో అప్పులు తీసుకొచ్చి.. ఎంతో శ్రమకు ఓర్చి పంటలు సాగు చేస్తే.. అవి తీరా చేతికి వచ్చే దశలో మాయదారి వర్షం విస్తారంగా కురిస్తే.. విపరీతమైన వరద ముంచెత్తితే.. ఆ నష్టం విపరీతంగా ఉంటుంది. ఆ కష్టం అంచనాలకు అందకుండా ఉంటుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇదేవిధంగా ఉంది. ఏ రైతును చూసినా కన్నీటి పర్యంతమవుతున్నాడు. ఏ పంట చేను చూసినా వరద నీటితో కనిపిస్తోంది. వాస్తవానికి ఇంతటి ఉత్పాతాన్ని.. ఈ స్థాయిలో దారుణాన్ని ఎన్నడూ చూడలేదని రైతులు అంటున్నారు. ముఖ్యంగా అక్టోబర్ చివరి వారంలో ఏనాడు కూడా ఈ స్థాయిలో వర్షం కురవలేదని రైతులు వాపోతున్నారు.
విస్తారంగా కురిసిన వర్షాలు తెలుగు రాష్ట్రాలను ముంచెత్తాయి. వరద నీరు కూడా విపరీతంగా వచ్చింది. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాలు నీటమునిగాయి. భారీగా ఆస్తి నష్టం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం పల్లిపాడు లో వరద నీరు పోటెత్తడంతో చూస్తుండగానే ఓ డి సి యం కొట్టుకుపోయింది. అందులో సరుకులు ఉన్నాయా? ఇంకా ఏదైనా సామగ్రి ఉందా? అనే విషయం తెలియ రాలేదు. కానీ చూస్తుండగానే ఆ వాహనం కొట్టుకుపోవడంతో చుట్టుపక్కల వారు భయంతో వణికి పోయారు. వరద నీరు విపరీతంగా రావడంతో ఆ ప్రాంతంలో రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. దీనికి తోడు భారీగా వర్షం కురవడంతో కనీ వినీ ఎరగని స్థాయిలో వరద వచ్చింది. దీంతో రాకపోకలు ఆగిపోయాయి. అయితే ఆ డీసీఎం డ్రైవర్ వరదను అంచనా వేయలేదా? దూర ప్రయాణం కాబట్టి ఎలాగైనా సరే వెళ్ళిపోవాలి అనుకున్నాడా? కారణం ఏమైనా సరే చూస్తుండగానే వాహనం కొట్టుకపోవడం ఒకరకంగా భయభ్రాంతులకు గురిచేసింది.
