Aarogyasri AP: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ( aarogyasree ) విషయంలో ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? ప్రైవేట్ నెట్ వర్క్ ఆసుపత్రుల సమ్మెను పట్టకుండా ఎందుకు వ్యవహరిస్తోంది? దీని వెనుక ఉన్న కారణమేంటి? అటు నెట్వర్క్ ఆసుపత్రులు ఎన్ని రోజులు పట్టు పట్టడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? ఇప్పుడు దీనిపైనే ఆసక్తికర చర్చ నడుస్తోంది. సాధారణంగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల సమ్మె అంటే ఒకటి రెండు రోజులు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా 20 రోజులు దాటుతోంది. కానీ ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో చలనం లేదు. దీనిపై రకరకాల చర్చ నడుస్తోంది. ప్రభుత్వం నుంచి సంచలన ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ఆ భయంతోనే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మెను కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఒక భయంతోనే నెట్వర్క్ ఆసుపత్రులు ఈ సమ్మెను కొనసాగిస్తున్నట్లు ప్రచారం అయితే మాత్రం సాగుతోంది.
* రెండు దశాబ్దాల చరిత్ర..
ఏపీలో( Andhra Pradesh) ఆరోగ్యశ్రీ పథకానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతూ వచ్చాయి. అయితే దాదాపు అన్ని ప్రభుత్వాల్లోనూ బిల్లులు పెండింగ్లో ఉండేవి. వారు వినతులు ఇచ్చేవారు. సమ్మె హెచ్చరికలు జారీ చేసేవారు. ప్రభుత్వం సైతం దిగివచ్చేది. పెండింగ్ బిల్లులు చెల్లించేవారు. యధావిధిగా సేవలు కొనసాగిస్తూ వచ్చేవారు. కానీ ఇప్పుడు ఏకంగా 20 రోజులు దాటిపోయింది కానీ.. ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరణ కాలేదు. ప్రైవేట్ నెట్ వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రం కొనసాగుతున్నాయి. కొంతమంది చికిత్సలను వాయిదా వేసుకుంటున్నారు.
* యూనివర్సల్ హెల్త్ స్కీమ్ తో..
రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడానికి.. ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రుల( private network hospitals) ఆందోళనకు ఒకే ఒక కారణం ఉన్నట్లు తెలుస్తోంది. అదే యూనివర్సల్ హెల్త్ స్కీమ్. ఇది పూర్తిగా బీమా పథకం. రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలకు ప్రభుత్వమే బీమా చెల్లిస్తుంది. సంబంధిత బీమా కంపెనీ అనారోగ్యానికి గురైతే పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. 25 లక్షల రూపాయల క్యాష్ లెస్ వైద్య సేవలు అందించాలి. ఈ ఏడాది సెప్టెంబర్ లోనే ఈ కీలక యూనివర్సల్ హెల్త్ స్కీంకు ఏపీ క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. త్వరలోనే ఈ పథకం అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకనుంచి ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వాలు చెల్లింపులు చేయవు. సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీ మాత్రమే ఆ చెల్లింపులు చేస్తుంది.
* చెల్లింపులు నిలిచిపోతాయని..
రాష్ట్రవ్యాప్తంగా 2500 వరకు ప్రైవేటు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు ఉన్నాయి. ఆపై ప్రభుత్వ ఆసుపత్రుల్లో సైతం ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయి. అయితే ఇప్పటివరకు ప్రభుత్వమే ఏడాదికి ప్రతి కుటుంబానికి 5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించేది. అయితే వైసిపి హయాంలో చివరి ఆరు నెలల పాలనలో ఈ మొత్తాన్ని 25 లక్షలకు పెంచారు. కానీ ఇది ప్రభుత్వంపై అదనపు భారం. అందుకే యూనివర్సల్ హెల్త్ స్కీమ్ తెస్తే ప్రభుత్వం పై భారం తగ్గుతుంది. తక్కువ సమయంలోనే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయి. గతంలో ఆరోగ్యశ్రీ ఆపరేషన్ అప్రూవల్ కోసం దాదాపు మూడు రోజులు పట్టేది. కానీ ఇప్పుడు 6 గంటల వ్యవధిలోనే ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆరోగ్యశ్రీ ఆపరేషన్లకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఒకసారి యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అమలు చేస్తే తమ పాత బకాయిలు నిలిచిపోతాయని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు భావిస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో దాదాపు 2, 700 కోట్ల రూపాయల బకాయి ఉండేది. ఒకవైపు కూటమి ప్రభుత్వం చెల్లింపులు చేస్తూనే వచ్చింది. కానీ ఇప్పుడు ప్రైవేట్ నెట్ వర్క్ ఆసుపత్రులకు చెల్లించాల్సింది మూడు వేల కోట్ల రూపాయలకు పైమాటే. యూనివర్సల్ హెల్త్ స్కీం వస్తే ప్రభుత్వం నుంచి ఎక్కడ చెల్లింపులు నిలిచిపోతాయి అన్న ఆందోళన నెట్వర్క్ ఆసుపత్రులకు ఉంది. అందుకే సమ్మెను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.