Lok Sabha Election 2024: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చావుతప్పి కన్ను చొట్టపోయిన బీఆర్ఎస్.. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఉనికి కోసం చమటోడుస్తోంది. కేటీఆర్, హరీశ్‌రావు ఎంత తిరిగినా.. జనం నుంచి సరైన స్పందన రాకపోవడంతో కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. బస్సు యాత్ర పేరుతో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ వంద రోజుల వైఫల్యాలను ఎండగడుతున్నారు. నిరుత్సాహంగా ఉన్న బీఆర్ఎస్ క్యాడర్లో ఊపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఓటర్లను బీఆర్ఎస్వైపు మళ్లించేలా కష్టపడుతున్నారు. అయితే.. ఆశించిన ఫలితం వచ్చే అవకాశం కనిపించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే కేటీఆర్, హరీశ్‌రావు సభలతో పోలిస్తే.. బీఆర్ఎస్ కాస్త పుంజుకున్నట్లు కనిపిస్తోంది.
సోషల్ మీడియాలో సర్వే రిపోర్టు..
బీఆర్ఎస్ లోక్‌సభ ఎన్నికల్లో కనీస సత్తా చాటకపోతే.. పార్టీ ఉనికే ప్రమాదంలో పడుతుంది. ఈ నేపథ్యంలో పార్టీకి ఊపు తీసుకురావడానికి ఆ పార్టీ నేతలు సోషల్ మీడియా ద్వారా అనేక ప్రయత్నాల చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ సర్వే రిపోర్టును వైరల్ చేస్తున్నారు. వాస్తవానికి ప్రస్తుతం సర్వేలన్నీ ఆగిపోయాయి. షెడ్యూల్ ముందు వరకు నిర్వహించిన సర్వేలను అన్ని సంస్థలు నెల క్రితమే విడుదల చేశాయి. కానీ బీఆర్ఎస్ ఇప్పుడు టౌమ్స్ నౌ సర్వే అంటూ ఓ రిపోర్టును సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.
సర్వేలో షాకింగ్ సీట్లు..
ఇక ఈ సర్వే రిపోర్టులో లోక్‌సభ ఫలితాలు షాకింగ్‌లా ఉన్నాయి. బీఆర్ఎస్కు 9 నుంచి 12 సీట్లు, కాంగ్రెస్‌కు 3 నుంచి 5, బీజేపీకి 1 నుంచి 3, ఇతరులకు 1 సీటు వస్తాయని ఉంది. వాస్తవంగా టైమ్స్ నౌ సర్వే గతంలో విడుదల చేసింది. అందులో బీఆర్ఎస్కు 1 నుంచి 3 సీట్లు వస్తాయని అంచనా వేసింది. కానీ, తాజాగా టౌమ్స్‌నౌ పేరుతోనే బీఆర్ఎస్ సర్క్యులేట్ చేస్తున్న సర్వే రిపోర్టుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జోష్ నింపేందుకేనా..
బీఆర్ఎస్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న ఈ సర్వే రిపోర్టు పార్టీ శ్రేణుల్లో జోష్ తెచ్చేందుకే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుత సర్వే ఫలితాలు 2014 లేదా 2019 నాటివి అయి ఉంటాయని భావిస్తున్నారు. వాటినే మరోమారు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ సర్వే రిపోర్టు ప్రస్తుతం చేసిందే అయితే మాత్రం ఇక ఆ పార్టీకి తిరుగు ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఈ సర్వే రిపోర్టు ఏ మేరకు నిజమవుతుందో జూన్ 4న తేలిపోతుంది.