HomeతెలంగాణCongress: బీఆర్ఎస్ ను అనుసరిస్తున్న కాంగ్రెస్..ఇలాగైతే కష్టకాలమే..

Congress: బీఆర్ఎస్ ను అనుసరిస్తున్న కాంగ్రెస్..ఇలాగైతే కష్టకాలమే..

Congress: ఉప ఎన్నికలు వచ్చినచోట వరాలు ప్రకటించడం.. ప్రభుత్వ పథకాలు ప్రారంభించడం.. మిగతా నియోజకవర్గాలకు కత్తెర వేసి నిధులు మళ్లించడం.. పదేళ్ల పరిపాలన కాలంలో భారత రాష్ట్ర సమితి ఇటువంటి వ్యవహారాలను దర్జాగా కొనసాగించింది. ప్రతిపక్షాలు విమర్శించినప్పటికీ లెక్క చేయలేదు. పైగా ప్రతిపక్షంలో బలంగా ఉన్న నాయకులను కొనేసింది. వారికి ఏదో ఒక పదవిని పడేసింది. ఇలాంటి వ్యవహార శైలి నచ్చక గత అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితిని ప్రజలు ఓడించారు. మూడోసారి అధికారాన్ని దక్కించుకుంటామని భావించిన కేసీఆర్ ను ప్రతిపక్షానికి పరిమితం చేశారు. అప్పట్లో భారత రాష్ట్ర సమితి కొనసాగించిన ఈ ధోరణి ని కాంగ్రెస్ విమర్శించింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్.. గత భారత రాష్ట్ర సమితి చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సింది పోయి.. అదే విధమైన రాజకీయాలను అవలంబిస్తున్నది.

లాస్య నందిత కన్నుమూయడంతో కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నికల్లో దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న పెద్ద కుమార్తె భారత రాష్ట్ర సమితి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తోంది. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థిని పోటీలో నిలిపింది.. ఈ క్రమంలో ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావిస్తోంది. కంటోన్మెంట్ నియోజకవర్గంపై వరాల జల్లు కురిపిస్తోంది. ఈ నియోజకవర్గ ప్రజలకు 6000 ఇందిరమ్మ ఇళ్ళను తొలి విడతలో మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటి వరాల జల్లు పై సొంత పార్టీ నాయకులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ పథకంలో భాగంగా అన్ని నియోజకవర్గాలకు 3,500 ఇళ్లు ప్రభుత్వం మంజూరు చేసింది. కానీ, కంటోన్మెంట్ కు 2,500 ఇళ్లు అదనంగా ఇస్తామని ప్రకటించింది. దీనిపై భారత రాష్ట్ర సమితి నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. గతంలో ఉప ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ మాట్లాడిన మాటలకు.. ఇప్పుడు చేస్తున్న చేతలకు పొంతనలేదని అంటున్నారు. ప్రజలకు వరాల ఆశ చూపించి, తమకు ఓటు వేసేలా పన్నాగాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ భారత రాష్ట్ర సమితి పై నిప్పులు చెరిగింది. ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాలపై వరాల జల్లు కురిపించడాన్ని తప్పు పట్టింది. ఇతర నియోజకవర్గాలకు కేటాయించే నిధుల్లో కోత విధిస్తూ.. ఉప ఎన్నికలు జరిగే సెగ్మెంట్లకు నిధుల వరద పారించడాన్ని విమర్శించింది.. కొత్త పథకాలకు రూపకల్పన చేయడాన్ని ఆరోపించింది..కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రాష్ట్ర సమితి చేసిన తప్పునే, కాంగ్రెస్ పార్టీ చేస్తోంది.. ఇతర నియోజకవర్గాలకు తగ్గించి, కంటోన్మెంట్ కు అదనంగా 2,500 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించి, తన ఓటు బ్యాంకు రాజకీయాన్ని ప్రదర్శిస్తోంది. మరి ఇలాంటి రాజకీయాలను రేవంత్ రెడ్డి ఎలా సమర్థిస్తారో చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular