HomeతెలంగాణTelangana Politics: కారుకు బైబై.. చేయికి జైజై...

Telangana Politics: కారుకు బైబై.. చేయికి జైజై…

Telangana Politics : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతోపాటు స్థానిక సంస్థల్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో లేకపోవడం, స్థానికంగా పార్టీ అభ్యర్థులు కూడా గెలవకపోవడంతో భారాస పార్టీకి చెందిన స్థానిక సంస్థల మెజార్టీ ప్రజాప్రతినిధులు ప్రత్యామ్నాయంగా ‘చేయి’ పట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ’కారు’ దిగి ’హస్తం’ గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలకు ఆరు నెలలోపు జరుగనున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ తరఫున పోటీ చేయాలని ప్రస్తుత బీఆర్‌ఎస్‌ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు భావిస్తున్నారు. ఇక మున్సిపల్‌ ఎన్నికలకు మరో ఏడాది గడువు ఉండడంతో చైర్మన్‌/చైర్‌పర్సన్, వైస్‌ చైర్మన్‌/వైస్‌ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసానికి కాంగ్రెస్‌ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 90 శాతం మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్‌ పాలకవర్గాలే ఉన్నాయి. పదేళ్లుగా బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండడంతో అన్ని మున్సిపాలిటీలను బీఆర్‌ఎస్‌ తన ఖాతాలో వేసుకుంది. అయితే ఇప్పుడు బీఆర్‌ఎస్‌ ఓడిపోవడంతో, విపక్షంలో ఉన్న కాంగ్రెస్‌ నేతలు వాటిని తమ ఖాతాలో వేసుకునేందుకు పావులు కదుపుతున్నారు.

బెల్లంపల్లి, మంచిర్యాల..
ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని తెలంగాణలోని బెల్లంపల్లి, మంచిర్యాల మున్సిపాలిటీల్లో ప్రస్తుత చైర్మన్, వైస్‌ చైర్మన్‌పై అవిశ్వాసానికి కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నం చేస్తున్నారు. బెల్లంపల్లిలో మొన్నటి వరకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఉండగా, ఇప్పుడు కాంగ్రెస్‌ గెలిచింది. దీంతో కాంగ్రెస్‌ కౌన్సిలర్లు అవిశ్వాస అస్త్రం సంధించారు. ఈమేరకు కమిషనర్‌కు పార్టీలకు అతీతంగా సంతకాలతో లేఖ ఇచ్చారు. ఇక మంచిర్యాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మొన్నటి వరకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దివాకర్‌రావు ఉన్నారు. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్‌ నేత ప్రేమ్‌సాగర్‌రావు గెలిచారు. దీంతో మంచిర్యాల మున్సిపాలిటీ పాలకవర్గంపై అవిశ్వాసానికి రహస్యంగా మంతనాలు జరుపుతున్నారు.

నిర్మల్, ఖానాపూర్‌లో..
నిర్మల్, ముథోల్‌ స్థానాలను మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. ఖనాపూర్‌లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఈ మూడు నియోజకవర్గాల్లోనూ మొన్నటి వరకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు ఈసారి ఓడిపోయారు. దీంతో ఆ పార్టీ శ్రేణులు అంతర్మథనంలో పడ్డాయి. నిర్మల్‌ పురపాలక సంఘం చైర్మన్‌తోపాటు మెజార్టీ కౌన్సిలర్లు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన జిల్లాలోని సీనియర్‌ నాయకులతో మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది. నిర్మల్‌ పురపాలక సంఘంలో 42 వార్డులు ఉండగా.. 2020 జనవరిలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ 30, కాంగ్రెస్‌ 7, ఏఐఎంఐఎం రెండు స్థానాలు కైవసం చేసుకోగా.. స్వతంత్రులు ఇద్దరు, బీజేపీ నుంచి ఒక్కరు గెలుపొందారు. కొన్ని నెలలు గడిచిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచిన కౌన్సిలర్లు ఒక్కొక్కరూ పార్టీలు మారారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఒక్క కౌన్సిలర్‌ కూడా లేరు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చేరేందుకు బీఆర్‌ఎస్‌కు చెందిన 16 మంది కౌన్సిలర్లు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. మిగతా 14 మందిలో ఒకరు మూడు నెలల క్రితం బీజేపీలో చేరారు. మరో ఆరుగురు కూడా అందులో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మిగిలిన ఏడుగురు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.

= ఇక కొత్తగా ఏర్పడిన ఖానాపూర్‌ పట్టణంలో 12 వార్డులు ఉండగా.. అప్పుడు జరిగిన ఎన్నికల్లో భారాస ఆరు, కాంగ్రెస్‌ అయిదు, ఒక స్థానంలో బీజే పీ గెలిచింది. గతేడాది ఇక్కడి మున్సిపల్‌ చైర్మన్‌ అంకం రాజేందర్‌పై తొమ్మిది మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మాన నోటీసును అప్పటి జిల్లా కలెక్టర్‌ వరుణ్‌రెడ్డికి అందించారు. ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా చాలా పురపాలక సంఘాల చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాల అలజడి నెలకొనగా.. కొత్త మున్సిపల్‌ చట్టం ప్రకారం ‘పుర’పాలకవర్గం కొలువుదీరి నాలుగేళ్లు పూర్తయితేనే అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చే అవకాశం ఉంది. ఆ సమయంలోనే అవిశ్వాస తీర్మాన నోటీసులపై ప్రభుత్వం స్పందించలేదు. వచ్చే జనవరి నెలాఖరుతో నాలుగేళ్ల ‘పుర’పాలన ముగియనున్న నేపథ్యంలో ఖానాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఇక్కడి పురపాలక సంఘంలో తొమ్మి మంది కౌన్సిలర్లు సమాయత్తమవుతున్నట్లు తెలిసింది

ఆర్మూర్‌లోనూ..
ఇక నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మున్సిపాలిటీలోనూ ప్రస్తుత పాలకవర్గంపై అవిశ్వాసానికి కౌన్సిలర్లు కసరత్తు చేస్తున్నారు. మంగళవారం మెజారిటీ కౌన్సిలర్లు రహస్యంగా సమావేశమయ్యారు. మొన్నటి వరకు ఆర్మూర్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఉండగా, ప్రస్తుతం అక్కడ బీజేపీ గెలిచింది. దీంతో వీళ్లు కూడా పాలకవర్గాన్ని దించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 26 మంది కౌన్సిలర్లు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. అవిశ్వాసానికి అనుమతి ఇవ్వాలని కోరారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular