MLA Lasya Nanditha: లాస్య నందిత యాక్సిడెంట్.. కుట్ర కోణంపై కీలక విషయాల వెల్లడి

ఆకాష్ నుంచి న్యాయమూర్తి, డీఎస్పీ సమక్షంలో వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఈ ప్రమాదంలో ఆకాష్ కు కాళ్లు విరిగాయి.. దీంతో మియాపూర్ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు అతనికి శస్త్ర చికిత్స చేశారు.

Written By: Suresh, Updated On : February 25, 2024 12:01 pm
Follow us on

MLA Lasya Nanditha: కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నేపథ్యంలో.. ఆ ఘటనకు సంబంధించి రోజుకో విషయం వెలుగు చూస్తోంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లాస్య నందిత డ్రైవర్ ఆకాష్ వాంగ్మూలాన్ని పోలీసులు సేకరించారు. “ఏమో సార్? ఏమీ గుర్తుకు రావడం లేదు.. కళ్ళు తెరిచి చూసేసరికి ప్రమాదం జరిగిపోయింది. ఇప్పటికీ నాకు ఒక షాక్ లాగానే అనిపిస్తోంది” అంటూ ఆకాష్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన ఆకాష్ మియాపూర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదం జరిగినప్పుడు నిద్ర మత్తులో కళ్ళు మూసుకుపోయాయని, అసలు ఏం జరిగిందో గుర్తుకు లేదని, క్షణాల్లో అంతా జరిగిపోయిందని ఆకాష్ చెప్పినట్టు తెలుస్తోంది.

ఆకాష్ నుంచి న్యాయమూర్తి, డీఎస్పీ సమక్షంలో వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఈ ప్రమాదంలో ఆకాష్ కు కాళ్లు విరిగాయి.. దీంతో మియాపూర్ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు అతనికి శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని వైద్యులు చెబుతున్నారు. ఆకాష్ వాంగ్మూలాన్ని సేకరించిన తర్వాత పోలీసులు ఔటర్ రింగ్ రోడ్డు వైపు వెళ్లారు. అక్కడ ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఉన్న సిసి కెమెరాలలో ఉన్న పుటేజిని పరిశీలించారు. అందులో ఉన్న వీడియోలు ఆధారంగా లోతుగా సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు. ” కారు ఔటర్ రింగ్ రోడ్డుపై ఎంత వేగంగా వెళ్ళింది? అది సాధారణ ప్రమాదమా? ఇందులో ఎవరి కుట్రకోణమైనా ఉందా” అనే పార్శ్వాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. అయితే ఈ ప్రమాదానికి ముందే లాస్య నందిత ప్రయాణించిన కారు విడిభాగాలు విసిరి వేసినట్టు పడి ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. రెయిలింగ్ ను ఢీకొట్టడానికి ముందు మరో వాహనాన్ని ఢీకొట్టిందేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో ముత్తంగి జంక్షన్ వైపు అటుగా వెళ్లిన వాహనాల వివరాలను పటాన్ చెరువు పోలీసులు సేకరిస్తున్నారు. ఇంతవరకు ఇలాంటి వాహనానికి సంబంధించిన ఆచూకీ లభ్యం కాలేదని తెలుస్తోంది. టిఫిన్ కోసం శామీర్ పేట నుంచి పటాన్ చెరువు వరకు లాస్య నందిత ఎందుకు వచ్చారు? అనే కారణాలను తెలుసుకునే పనిలో పోలీసులు పడ్డారు. కాగా, లాస్య నందిత మృతి కేసులో మరో విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఎమ్మెల్యే తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. రెండు వరుస ప్రమాదాల బారిన పడ్డారు. ఈనెల 22న ఆరూర్ లోని మిస్కిన్ షా దర్గాకు వెళ్లి అక్కడ పూజలు చేసి తెల్లవారుజామున తిరుగు ప్రయాణమయ్యారని తెలుస్తోంది. ఒక కారులో నందిత, పీఏ ఆకాష్, ఆమె అక్క కూతురు శ్లోక ఉన్నారు. ఈ ప్రమాదం జరగడానికి కొంత సమయానికి ముందు చిన్నారి శ్లోకను వేరే వాహనంలోకి ఎక్కించారు. ఫలితంగా ఆ చిన్నారికి ప్రాణాపాయం తప్పింది.