
Musical floating fountain : విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతున్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పటికే పెట్టుబడులను ఆకర్షిస్తూ అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చారు. ఫార్ములా ఈ-రేస్ నిర్వహిస్తూ అందరి చూపు హైదరాబాద్‌వైపు తిప్పుకునేలా చేశారు. తాజాగా హైదరాబాద్ నగరం ఫార్ములా ఈ-రేస్‌కు సిద్ధమవుతున్న వేళ.. హుస్సేన్ సాగర్‌లో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. హైదరాబాద్ నగరం అందానికి మరింత వన్నె తెచ్చేలా.. మరో అదనపు ఆకర్షణగా.. మరో నగీషీగా మ్యూజికల్ ఫ్లోటింగ్ ఫౌంటెయిన్ నిలిచింది. గురువారం రాత్రి దీనిని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రారంభించారు.
బుర్జ్ ఖలీఫా తరహాలో..
హైదరాబాద్ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టిపెట్టారు. నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. దుబాయిలో బుర్జ్ ఖలీఫా వద్ద ఉన్నట్లుగా.. ఒకవైపు నూతన సచివాలయం, మరో వైపు అంబేద్కర్ భారీ విగ్రహం, ఎదురుగా బుద్ధుడి విగ్రహం.. వీటన్నింటికీ శోభ తెచ్చేలా రూ.17.02 కోట్ల వ్యయంతో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఈ ఫ్లోటింగ్ ఫౌంటెయిన్, లేజర్ షో ఏర్పాటు చేశారు.
ప్రత్యేక ఆకర్షణగా..
ప్రతీరోజు రాత్రి 7 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఫౌంటెయిన్ విన్యాసాలు వీక్షించవచ్చన్నారు. ఫార్ములా ఈ రేస్‌కు నగరం ముస్తాబవుతున్న వేళ ఈ ఫౌంటెయిన్∙ప్రారంభం కావడం మరింత ఆకర్షణగా మారింది. నగర సందర్శనకు వచ్చే పర్యాటకులకు ఈ మ్యూజికల్ ఫౌంటెయిన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. పర్యాకులను ఆకట్టుకునేందుకు ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డును సుందరంగా తీర్చిదిద్దేందుకు ఈ మ్యూకిల్ ఫౌంటెయిన్ నిర్మాణంతోపాటు లేజర్ షోకు హెచ్‌ఎండీఏ శ్రీకారం చుట్టింది. లుంబినీ పార్క్, ఎన్టీఆర్ మార్గ్‌లో నిలబడి కూడా ఈ ప్రదర్శనను చూడవచ్చు. ఫాంటెయిన్, లేజర్ షో పొడవు 180 మీటర్లు, వెడల్పు 10 మీటర్లు, 90 మీటర్ల ఎత్తుతో కొనసాగుతోంది. ఇందులో 3 జతల లేజర్లు ఉంటాయి. ఒక్కో లేజర్‌ను ఒక్కో థీమ్‌తో రూపొందించారు. దేశభక్తి గేయాలు, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా మ్యూజికల్ థీమ్స్ ప్రదర్శిస్తున్నారు. ప్రతిరోజూ మూడు షోలు, వారాంతాల్లో నాలుగు షోలు ఉంటాయి.
భిన్న సంస్కృతి, అన్నివర్గాల ప్రజలకు నిలయమై విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణ ప్రభుత్వం మరో నగీషీని అద్దడం అందరినీ ఆకర్షిస్తోంది. ఈ ఫ్లోటింగ్ మ్యూజికల్ ఫౌంటెయిన్ అంతర్జాతీయ పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుందని ప్రభుత్వం చెబుతోంది.