
Komati Reddy Vs Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో కలహాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పూర్తిగా చతికిల పడి వెంటిలేటర్‌పై ఉన్న పార్టీకి ఊపిరి పోసేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు. ఈ యాత్రకు సీనియర్లెవరూ కలిసి రాకపోగా, అప్పుడే ఆయన కాళ్ల మధ్య కట్టెపెట్టే ప్రయత్నం మొదలు పెట్టాడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. పార్టీలో మితిమీరిన స్వాతంత్య్రంతో నేతలే కాంగ్రెస్ పరువును బజారుకీడుస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలను సమర్ధవంతంగా ఎదుర్కోవాల్సిన నాయకులు, వారిలో వారు విమర్శలు చేసుకోవడం.. ఒకరిని ఒకరు ముందుకు వెళ్లకుండా లాగాలని ప్రయత్నం చేయడం ఆ పార్టీ పతనానికి కారణమవుతోంది.
రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలతో మళ్లీ లుకలుకలు..
తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హాథ్ సే హాథ్ జోడో పాదయాత్ర కాంగ్రెస్ పార్టీలో లుకలుకలను మళ్లీ బయటపెడుతోంది. ఒకరిని మించి ఒకరు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ నేతలు పనిచేయడం పార్టీ కార్యకర్తల్లో ఆందోళనకు కారణంగా మారింది. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పాదయాత్ర ప్రారంభంలోనే ప్రగతి భవన్‌ను బాంబులతో మావోయిస్టులు పేల్చేయాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలపై అసెంబ్లీ సాక్షిగా మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సొంత పార్టీ నేతలు తప్పు పట్టడం ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. నల్లగొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించారు. రేవంత్ అలా అనకుండా ఉండాల్సిందని పేర్కొన్న ఆయన ప్రగతి భవన్‌ను ప్రజా దర్బార్‌గా వినియోగించాలనో, ఆసుపత్రిగా వాడుకోవాలనో అంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తానికి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తప్పు అని అర్థం వచ్చేలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు.
మొదటి నుంచి రేవంత్ వ్యతిరేక వ్యాఖ్యలే..
టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయనను బాహాటంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే బీఆర్‌ఎస్ నేతలు రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేస్తుంటే, వారి విమర్శలకు మరింత బలం చేకూర్చేలా కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన చోట.. ఏదేదో మాట్లాడటం కూడా పార్టీకి ఇబ్బందికరంగా మారిందని సొంత పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదన్న చర్చ జరుగుతుంది. ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఏమాత్రం రుచించడం లేదు. సీనియర్ నాయకులు సమన్వయంతో పనిచేయకపోవడం, పార్టీ కోసం ఒక మాటగా నిలబడకపోవడం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం పెంచుతోంది. ప్రత్యర్థి పార్టీల మీద దాడి చేయకుండా సొంత పార్టీ నేతల మాటలను ఎవరికి వారు కౌంటర్ చేస్తూ ఉండడం పార్టీ పరువును బజారుకీడుస్తుంది. కాంగ్రెస్ సీనియర్లు చేస్తున్న రచ్చ హస్తం పార్టీకి భస్మాసుర హస్తంగా మారుతుంది.