Land Kabja : ఇదో భూ దందా. నిబంధనలకు వక్రభాష్యం చెబుతూ సాగించిన పంథా! కళ్ల ముందు విలువైన భూమి.. పైగా ఆ భూ యజమాని ఇక్కడ లేరు. ఇదే అదునుగా ముందుకెళ్లారు. జేబుకు తెలియకుండా పర్స్ కొట్టేసినట్టు.. యజమానికి తెలియకుండా భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇలా చేసింది ఎవరో అక్రమార్కులో.. కేటుగాళ్లో కాదు. అక్షరాలా భారత రాష్ట్ర సమితి నాయకులు. ఈ భూ తంత్రంలో అసలు సూత్రధారులు, పాత్రధారులు బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ చైర్మన్ కేశవరావు కుమారులు అని బాధితులు ఆరోపిస్తున్నారు.. ఏకంగా వ్యవస్థలనే మేనేజ్ చేశారని అంటున్నారు.. అంతా ష్ గప్ చుప్ గా భూమిని కొట్టేశారని అంటున్నారు. బాధితులు కథనం ప్రకారం.. ఈ కబ్జా వివరాలు ఇలా ఉన్నాయి..

యజమానులకు తెలియకుండా భూమి రాసేసుకున్నారు
బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ చైర్మన్ కె.కేశవరావు కుమారుల భూ కబ్జా చేశారని బాధితులు కోర్టుకెక్కారు.. ఆయన తనయులు ఫోర్జరీ పత్రాలతో ఎన్నారై మహిళకు చెందిన ఖరీదైన భూమిని కబ్జా చేశారని ఈ ఫిర్యాదు సారాంశం. అంతే కాదు దానిని వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీని వెనుక పెద్ద కథ నడిపించారని అంటున్నారు.. కేకే పెద్ద కుమారుడు విప్లవ్ కుమార్ తనకు ఆమె పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చినట్లు ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టించాడని ఆధారాలు బయటపడ్డాయి.. దాని ఆధారంగా తమ్ముడు వెంకట్‌కు ఆ భూమిని కేవలం రూ.3 లక్షలకు రిజిస్ట్రేషన్ చేశాడు. విప్లవ్ కుమార్ ప్రస్తుతం తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా కొనసాగుతున్నాడు. 2013లో ఈ దొంగ రిజిస్ట్రేషన్ వ్యవహారం జరిగింది. అప్పటి రిజిస్ట్రేషన్ కార్యాలయ విలువ ప్రకారమే భూమి విలువ రెండు కోట్లదాకా ఉండటంతో ఆదాయ పన్ను శాఖ అమెరికాలో ఉంటున్న ఆ భూమి అసలు యజమాని జయమాల, భాస్కర్‌రావు దంపతులకు రూ.కోటిన్నర ఆదాయం లెక్కలు చెప్పాలని నోటీసులు పంపింది. నోటీసులు చూసి నివ్వెరపోయిన జయమాల దంపతులు ఇండియాకు వచ్చి తవ్వేసరికి తమ భూమిని కేకే తనయులు దొంగ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తేలింది.

పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదు.
ఈ వ్యవహారంలో జయమాల, భాస్కర్‌రావు పోలీసులను ఆశ్రయించారు. ఈ వ్యవహారానికి పాల్పడింది అధికార పార్టీ ఎంపీ కుమారులు కావడంతో వారు కేసు నమోదు చేసేందుకు భయపడ్డారని అంటున్నారు.. దాంతో వారు చేసేందేం లేక న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారు. కేసు నమోదుకు ఆదేశాలు తెచ్చుకున్నారు. హైదరాబాద్ నగరానికి చెందిన జి.భాస్కర్‌రావు, జి.జయమాల దంపతులు 35 ఏళ్ల క్రితం అమెరికాలోని న్యూజెర్సీకి వెళ్లి స్థిరపడ్డారు. బంజారాహిల్స్‌రోడ్డు నెంబరు 12 ఎన్‌బీటీ నగర్‌లో సర్వే నెంబరు 129లో 939 గజాల స్థలాన్ని 1983లో టి.సుదర్శన్‌రెడ్డి అనే వ్యక్తితో కలిసి కొన్నారు. 1998లో సుదర్శన్‌రెడ్డి మరణించడంతో ఆయన కుటుంబీకులు ఆ భూమిలో తమ వాటాను వేరే వాళ్లకు విక్రయించారు. జయమాల దంపతులు మాత్రం తమ స్థలాన్ని విక్రయించుకుండా అలానే ఉంచారు. గతేడాది నవంబర్‌లో జయమాల భర్త భాస్కర్‌రావుకు మెయిల్ ద్వారా 2014-15కు గాను కోటిన్నర ఆదాయానికి పన్ను లెక్క చెప్పాలని నోటీసు వచ్చింది. ఆదాయపన్ను శాఖను వారు వాకబు చేయగా.. 2013లో బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 12లోని స్థలం అమ్మకం ద్వారా వచ్చిన సొమ్ముకు లెక్క చెప్పలేదని గుర్తు చేశారు. విక్రయించని స్థలానికి పన్ను ఎలా వేస్తారో తేల్చుకుందామని ఇండియాకు వచ్చారు.

ఆరా తీస్తే..
రిజిస్ట్రేషన్ కార్యా లయానికి వెళ్లి ఆరా తీయగా కేకే కుమారుడు విప్లవ్ కుమార్‌కు జయమాల స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తే, దాని ద్వారా విప్లవ కుమార్ ఆ భూమిని తన తమ్ముడు వెంకట్‌కు కేవలం రూ.3 లక్షలకు అమ్మినట్లు ఉంది. తన సంతకం ఫోర్జరీ చేశారని తెలుసుకున్న జయమాల ట్రూత్ ల్యాబ్‌ను ఆశ్రయించారు. ఏప్రిల్ 4న ట్రూత్ ల్యాబ్ ఇచ్చిన నివేదిక ప్రకారం.. పవర్ ఆఫ్ అటార్నీపై ఉన్న సంతకం ఫోర్జరీ అని తేల్చింది. వీటి ఆధారంగా జయమాల 2013 నాటి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేకే కుమారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏప్రిల్ 14న బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు పెట్టేందుకు విముఖత చూపించారు. దీంతో 15న ఇదే విషయాన్ని నగర పోలీసు కమిషనర్, పశ్చిమ మండలం డీసీపీకి ఉత్తరం రాశారు. ఎవరూ స్పందించలేదు. ఇక చేసేది లేక జయమాల నాంపల్లి మూడో ఏసీఎంఎం కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశం మేరకు గత నెల 16న బంజారాహిల్స్ పోలీసులు విప్లవ్‌కుమార్, వెంకటేఽశ్వరరావుపై ఐపీసీ 417,464,465,470,471 రెడ్ విత్ 120(బి)ఐపీసీ కింద కేసులు నమోదు చేశారు. విచారణను మాత్రం పట్టించుకోవడం లేదు. పైగా క్యాబి నెట్‌లో ఓ ముఖ్యమైన మంత్రి వారిపై చర్యలు తీసుకోవద్దని ఏకంగా డీజీపీని ఆదేశించినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈవ్యవహారం మీద ఆ ఎన్‌ఆర్‌ఐ దంపతులు సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్ని స్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.