KTR – MLA Shankar Naik : వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవానికి సంబంధించి తెలంగాణ ముఖ్యమైన మంత్రి కేటీఆర్ శుక్రవారం మహబూబాబాద్ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. మహబూబాబాద్ పట్టణ శివారులో ఏర్పాటుచేసిన వెజ్ అండ్ నాన్ వెజ్ వెజిటేబుల్ మార్కెట్ ను కేటీఆర్ ప్రారంభించారు. ఇదంతా ఒక ఎత్తయితే ప్రారంభోత్సవానికి హాజరైన కేటీఆర్ అక్కడి ఎమ్మెల్యే శంకర్ నాయక్ ను తోసి వేయడం.. దానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో చర్చనీయాంశంగా మారింది.
వాస్తవానికి కేటీఆర్ ప్రత్యేక హెలికాప్టర్లో బేగంపేట నుంచి బయలుదేరారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మైదానంలో ల్యాండ్ అయ్యారు. అక్కడి నుంచి మార్గంలో వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ వద్దకు చేరుకున్నారు. దానిని స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ రాకను పురస్కరించుకుని స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. అక్కడ విద్యార్థులతో కేటీఆర్ మీద పూలు చల్లించే ఏర్పాటు చేశారు. స్వతహాగా పూలు అంటే ఎలర్జీ ఉన్న కేటీఆర్ అవి వద్దని వారించారు. ఈ విషయం తెలియని కేటీఆర్ బలవంతం చేయడం, మంత్రి చేతిలో చేయి వేయడంతో ఆయనకు ఆగ్రహం తెప్పించింది. ఒక్కసారిగా అసహనంతో తన కిలో నుంచి ఎమ్మెల్యే చెయ్యిని తోసి వేశారు. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ గా మారింది. దీంతో రకరకాల పుకార్లు షికార్లు చేశాయి.
శంకర్ నాయక్ ఆగడాలు పెరిగిపోయాయని, భూ దందాలు మిటి మీరి పోవడం వల్లే కేటీఆర్ ఎమ్మెల్యే పై విసుగు చెందారని మీడియాలో వార్తలు ప్రసారమయ్యాయి. ఇది తనకు ప్రతి బంధకంగా మారడంతో మేల్కొన్న ఎమ్మెల్యే అసలు వీడియో విడుదల చేశారు. పూలు అంటే కేటీఆర్ కు ఎలర్జీ ఉన్న నేపథ్యంలోనే తన చేయిని తోసివేశారని, అంతేతప్ప తనంటే వ్యతిరేకత కాదని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఈ వీడియో వైరల్ గా మారడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎమ్మెల్యే శంకర్ నాయక్ గతంలో కలెక్టర్ ప్రీతి మీనా తో అనుచితంగా ప్రవర్తించారు. ముఖ్య మంత్రి ఆగ్రహానికి గురయ్యారు. రైతు ధర్నాలో ఎంపీ కవిత చేతిలో నుంచి మైక్ లాక్కున్నారు. ఇక ఇటీవల ఆయన అనుచరులు ఆగడాలు నియోజకవర్గంలో మితిమీరిపోవడంతో ప్రగతి భవన్ వద్దకు ఫిర్యాదులు వెళ్లాయి. ఇవన్నీ జరుగుతుండగానే కేటీఆర్ అతనిపై అసహనం వ్యక్తం చేయడం, దానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారడంతో ఎమ్మెల్యే పై అధిష్టానం గుర్రుగా ఉందని చర్చ మొదలైంది. అయితే ఈసారి మహబూబాబాద్ నియోజవర్గం నుంచి ఎంపీ కవిత ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. మరి దీనిని శంకర్ నాయక్ ఏ విధంగా అడ్డుకుంటారో చూడాల్సి ఉంది.
