KTR : పస్తులుంటున్న నేతన్నలకు చేతినిండా పని కల్పించింది. సిరిసిల్లలో మూలన పడిన మరమగ్గాల పరిశ్రమకు బతుకమ్మ చీరల ఆర్డర్లతో జవసత్వాలు ఇచ్చింది. అయితే, కార్మికులకు చేతినిండా పని కల్పిస్తున్న సర్కారు.. వస్త్రోత్పత్తిదారులకు మాత్రం బకాయిలు చెల్లించడం లేదు. దీంతో ప్రభుత్వ ఆర్డర్లు గుదిబండగా మారుతున్నాయి. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు రూ.100 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయి. తాజాగా ఉత్పత్తి అవుతున్న బతుకమ్మ చీరలకు సంబంధించి ఇంతవరకు డబ్బులు విడుదల చేయకపోవడంతో మరో రూ.130 కోట్ల వరకు రావాల్సి ఉంది. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు బతుకమ్మ చీరలతోపాటు రంజాన్, క్రిస్మస్, సోషల్ వెల్ఫేర్, కేసీఆర్ కిట్, ఆర్వీఎంకు సంబంధించిన ఆర్డర్లు వస్తున్నాయి. 2021-22లో రూ.11.06 కోట్లు, 2022-23లో రూ.28.26 కోట్లు, 2023-24లో రూ.71.52 కోట్ల బకాయిలు ఉన్నాయి. మొత్తం రూ.110.84 కోట్ల బకాయిలు ఉండగా రూ.21 కోట్లు విడుదలయ్యాయి.
50 కోట్లు విడుదల
తాజాగా శుక్రవారం ప్రభుత్వం టెస్కోకు రూ.50 కోట్లు విడుదల చేసింది. ఈ ఏడాది బతుకమ్మ చీరల పంపిణీ కోసం రూ.350 కోట్లతో కోటి చీరల ఉత్పత్తికి ఆర్డర్లు ఇచ్చింది. సిరిసిల్లలో 126 ఎస్‌ఎస్ఐ యూనిట్లు, 139 మ్యాక్స్ సొసైటీల ద్వారా ఉత్పత్తి జరుగుతోంది. ఇప్పటికే 50 లక్షల చీరలను సిద్ధం చేసి ఇతర జిల్లాల్లోని గోదాములకు పంపిస్తున్నారు. బతుకమ్మ చీరలు ఉత్పత్తి చేస్తున్న ఎస్‌ఎస్ ఐ, మ్యాక్స్ సొసైటీల యూనిట్ల నిర్వాహకులు అప్పులు తెచ్చి కార్మికులకు వేతనాలు చెల్లిస్తున్నారు. చిన్న చిన్న వ్యాపారులు కూడా వడ్డీలకు అప్పులు తీసుకుని నూలు దిగుమతి చేసుకుంటున్నారు. అయితే, నిధులు విడుదల చేయకపోవడంతో ప్రభుత్వం అందిస్తున్న మీటరకు రూ.34.50 సరిపోక నష్టపోతున్నామని వ్యాపారులు చెబుతున్నారు. మంత్రి కేటీఆర్ జిల్లాకు వచ్చిన ప్రతిసారీ బకాయిలపై మొర పెట్టుకుంటూనే ఉన్నారు.
లక్ష్యం దిశగా చీరల ఉత్పత్తి..
బతుకమ్మ పండుగ సందర్భంగా సెప్టెంబరు 15లోగా కోటి బతుకమ్మ చీరల ఉత్పత్తి పూర్తి చేసి అన్ని జిల్లాలకు పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వం 5.56 కోట్ల మీటర్ల బట్ట ఉత్పత్తికి సంబంధించిన ఆర్డర్లను ఇచ్చింది. ఇందులో ఇప్పటి వరకు 12,500 మరమగ్గాలపై 4 కోట్ల మీటర్ల బట్ట ఉత్పత్తి జరిగింది. 50 లక్షల చీరలు రెడీ అయ్యాయి. సిరిసిల్లలో ప్రాసెసింగ్, ప్యాకింగ్ ప్రక్రియ కూడా మొదలైంది. ఈ సంవత్సరం బతుకమ్మ చీరలను 25 రంగులు, 25 డిజైన్లతో దాదాపు 525 వెరైటీల్లో ఉత్పత్తి చేస్తున్నారు. ఇందుకోసం సిరిసిల్లలోని 139 మ్యాక్స్ సొసైటీలకు 3.70 కోట్ల మీటర్లు, 126 ఎస్‌ఎ్‌సఐ యూనిట్లకు కోటి 84 లక్షల మీటర్ల ఉత్పత్తి ఆర్డర్లను ఇచ్చారు. ఈసారి రూ.350 కోట్లతో 95 లక్షల 90 వేల 700 చీరలను ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటిలో పెద్దవాళ్ల కోసం 9 మీటర్ల చీరలను, యువతుల కోసం 5.50 మీటర్ల చీరలను తయారు చేస్తున్నారు. ఈసారి చీరతోపాటు జాకెట్ పీస్‌ను విడిగా అందించనున్నారు. సిరిసిల్లలో 16,106 మరమగ్గాలకు ఆర్డర్లు ఇవ్వగా 12,500 మరమగ్గాలపై ఉత్పత్తి జరుగుతోంది. దీంతోపాటు అనుబంధంగా ఉన్న పరిశ్రమల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పని చేసే 15 వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు.