Praja Darbar: తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రమాణ స్వీకారం రోజే ప్రగతి భవన్ ను జ్యోతిబాపూలే ప్రజాభవన్ గా మారుస్తున్నట్టు ప్రకటించింది. మరుసటి రోజు ప్రజాభవన్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. చెప్పినట్లుగానే డిసెంబర్ 8వ తేదీన జ్యోతిబాపూలే ప్రజాభవన్ లో ప్రజా దర్బార్ నిర్వహించారు. వేలాదిగా ప్రజలు తరలివచ్చారు.
గత ప్రభుత్వంలో ఇలా..
గత ప్రభుత్వంలో ప్రజలు నేరుగా సీఎంను కానీ మంత్రుల్ని కానీ కలుసుకునే అవకాశం ఉండదు. వారు ఆకాశంలో తారల్లా ఉండేవారు. ప్రజలు ఎవరికి బాధలు చెప్పుకోవాలో తెలియదు. చివరికి కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్ మాత్రమే గతి అయ్యేది. ఆయన చూసి స్పందించి.. తన ఆఫీసుకు రిఫర్ చేస్తే సాయం అందుతుంది. లేకపోతే లేదు. ఈ పరిస్థితి వల్ల ప్రజలు తమ సమస్యలు చెప్పుకునే వ్యవస్థ లేకుండా పోయింది.
తొలిరోజే ప్రజా దర్బార్..
ప్రజల కష్టాలను గుర్తించిన రేవంత్ రెడ్డి మొదటి రోజునే… ప్రజాదర్భార్ ఏర్పాటు చేరారు. ప్రజా భవన్ గా మార్చిన ప్రగతి భవన్ లో ప్రజాదర్బార్ నిర్వహించారు. తొలిరోజు ప్రజాదర్బార్ కిటకిటలాడింది. వివిధ జిల్లాల నుంచి వేలాదిగా తరలొచ్చిన ప్రజానీకంతో హైదరాబాద్ బేగంపేటలోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్ కిక్కిరిసిపోయింది. సీఎంతోపాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దనసరి అనసూయ (సీతక్క), ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాసరెడ్డి తదితరులు దర్బార్‌లో ఉన్నారు. ముఖ్యమంత్రి సెక్రటేరియట్‌కు బయల్దేరి వెళ్లారు. ఆ తర్వాత సీతక్క… ప్రతి ఒక్కరి నుంచీ వినతిపత్రాలను స్వీకరించారు.
దరఖాస్తుల రిజిస్ట్రేషన్..
గ్రీవెన్సు రిజిస్ట్రేషన్లకు ప్రత్యేకంగా 15 డెస్కులను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రతీ విజ్ఞాపన పత్రాన్ని ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేసి, ప్రత్యేక గ్రీవెన్స్ నెంబరును కేటాయించారు. దరఖాస్తుదారులకు ప్రింటెడ్ ఎకనాలెడ్జ్‌మెంట్ ఇవ్వటంతోపాటు ఎస్‌ఎమ్‌ఎస్‌లను కూడా పంపే ఏర్పాటు చేశారు. ప్రజా దర్బార్ తొలి రోజు అనుభవంతో సీఎం రేవంత్… ఆ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
ఏది బెటర్..
వినతుల స్వీకరణ, సమస్యల పరిష్కారానికి ఎక్కువ సమయం తీసుకోకుండా, సులభంగా ఉండేందుకు వీలుగా రోజుకో మంత్రి, ఎమ్మెల్యే దర్బార్‌లో ఉండేలా సీఎం నిర్ణయించారు. దీంతో కేటీఆర్ ట్విట్టర్ కన్నా… ప్రజాదర్భార్ చాలా మంచిదే అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదువు రాని, సోషల్ మీడియా అకౌంట్ గురించి తెలియని వారే ఎక్కువ బాధితులు. నేరుగా సీఎంను కలవడం.. తమ కష్టాలు నేరుగా చెప్పుకునే అవకాశం కల్పించడం మంచి నిర్ణయం అంటున్నారు.