KTR: తెలంగాణలో ఎన్నికలు ముగిసినా.. రాజకీయ వేడి తగ్గడం లేదు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రోజుకో అంశాన్ని ఎంపిక చేసుకుని రచ్చ చేస్తున్నారు. మొన్నటి వరకు ఆరు గ్యారంటీలపై ఆందోళన చేసిన బీఆర్‌ఎస్.. తర్వాత రుణమాఫీపై సవాళ్లు విసిరింది. తర్వాత రుణమాఫీ అందరికీ కాలేదని ఆందోళన చేసింది. ఇప్పుడు హైడ్రాపై కూల్చివేతలపై మాటల యుద్ధం జరుగుతోంది. అక్రమ నిర్మాణాలను ఇప్పటికే కూల్చివేస్తున్న హైడ్రా ఇప్పుడు జన్వాడలోని కేటీఆర్ ఫామ్‌హౌస్‌గా చెప్పుకుంటున్న ఇంటిపై దృష్టి పెట్టింది. దీంతో కేటీఆర్ మిత్రుడు అయిన ప్రదీప్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. కానీ, అక్కడ ఆయనకు ఊరట లభించలేదు. కూల్చకుండా స్టే ఇవ్వలేదు. నిబంధనల ప్రకారం వెళ్లాలని హైడ్రాకు హైకోర్టు సూచించింది. ఇదిలా ఉంటే.. ఈ ఫాంహౌస్ తనది కాదని కేటీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి ప్రకటించడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. దీనిపై అధికార కాంగ్రెస్‌తోపాటు విపక్ష బీజేపీ నేతలు కూడా మండిపడుతున్నారు. బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌తోపాటు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు కేటీఆర్ ప్రకటనను ఖండిస్తున్నారు. నాడు ఫాంహౌస్‌పై డ్రోన్ ఎగరేసినందుకు రేవంత్‌రెడ్డిని అరెస్టు చేసి జైల్లో పెట్టిన రేవంత్ ఇప్పుడు తనది కాదని తప్పించుకోవడంపై నిలదీస్తున్నారు.
కేసు ఎందుకు పెట్టినట్లుల..
జన్వాడ ఫామ్‌హౌస్ కేటీఆర్‌ది కాకుంటే గతంలో రేవంత్ రెడ్డిపై ఎందుకు కేసు నమోదు చేశారు అన్న ప్రశ్నలనే ఇటీ కాంగ్రెస్, అటు బీజేపీ నాయకుల వేస్తున్నారు. ప్రజల్లో కూడా ఇప్పుడు ఇదే ప్రశ్న తలెత్తుతోంది. నాడు సొంత ఫామ్‌హౌస్ ఇప్పుడు లీజు ఎలా అయిందని కేంద్ర మంది బండి సంజయ్ నిలదీశారు. అక్రమంగా నిర్మించిన ఫామ్ హౌస్‌ల కూల్చివేతను ఆయన సమర్థించారు. నాడు రేవంత్‌పై కేసు పెట్టడం ద్వారా కేటీఆర్ ఇపుపడు బుక్కయ్యారు. కూల్చివేతల వరకు వచ్చే వరకు బద్నాం కాకుండా ఉండేందుకు ఫామ్‌హౌస్ తనది కాదని తప్పుంచుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
హామీలు పక్కదారి..
ఇక తెలంగాణలో రోజుకో అంశంపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు యుద్ధం చేసుకుంటూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కదోవ పట్టిస్తున్నట్లు తెలుస్తోంది. రేవంత్‌రెడ్డి కావాల్సింది కూడా ఇదే. ప్రస్తుత ఆర్థిక పరిస్థితిలో ఆరు గ్యారంటీలు అమలు చేసే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ వైఫల్యాలపై ప్రజల్లో నిత్యం చర్చ జరిగేలా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే విగ్రహాలపై, ఇప్పుడు ఫాంహౌస్, హైడ్రా అంశాలపై రచ్చ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల వరకు ఇలాంటి అంశాలతో కవర్‌చేసినా తర్వాత ప్రజల నుంచి పాలకులు వ్యతిరేకత ఎదుర్కొనక తప్పదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రతిపక్ష బీఆర్‌ఎస్ కూడా నిర్మాణాత్మక పాత్ర పోషించకుండా చిన్నచిన్న అంశాలపై చర్చ చేయడం సరికాదని పేర్కొంటున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చేలా చూడాల్సిన బాధ్యత బీఆర్‌ఎస్‌పై ఉందని సూచిస్తున్నారు.