KTR Campaign: తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ, రాజకీయ ప్రచార పద్ధతులు మారిపోతున్నాయి. సిట్టింగ్ స్థానం గెలిచి అధికార కాంగ్రెస్‌కు షాక్ ఇవ్వాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ప్రచారాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్లారు. సాధారణ సభలు, మేనిఫెస్టోలు దాటి ప్రత్యర్థుల ప్రసంగాలను ఆయుధంగా మార్చి ప్రజల్లో చర్చ రేపుతున్నారు. రేవంత్‌రెడ్డి గతంలో ఇచ్చిన హామీలు, వ్యాఖ్యలు వీడియోస్, క్లిప్స్ రూపంలో ప్రదర్శించటం ద్వారా ‘వారు చెప్పింది – వారు చేసేది‘ అనే చూపిస్తున్నారు.
సోషల్ మీడియా వేదికగా
ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వేదికలపై బీఆర్ఎస్ సైబర్ టీమ్ ఈ ప్రచారాన్ని వేగంగా విస్తరిస్తోంది. ‘సాక్ష్యాలతో మాట్లాడుతున్నాం’ అనే ట్యాగ్‌లైన్‌తో ప్రచారం సాగుతుండటంతో ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. కేటీఆర్ వ్యక్తిగతంగానూ ఈ వీడియోలను షేర్ చేయడం, అర్థవంతమైన వ్యాఖ్యలతో పోస్ట్ చేయడం ప్రచార ప్రభావాన్ని మరింత పెంచుతోంది. రేవంత్ రెడ్డి గతంలో చేసిన హామీలు అమలుకాలేదనే విమర్శను ఆధారంగా తీసుకుని బీఆర్ఎస్ ప్రచారం సాగిస్తోంది. రైతు రుణమాఫీ, ఉద్యోగ నోటిఫికేషన్లు, అభివృద్ధి ప్రాజెక్టులు వంటి అంశాలపై చేసిన వాగ్దానాలను మళ్లీ ప్రజల ముందుకు తెచ్చి ‘మాట నిలబెట్టుకోని నాయకుడు’ అనే ఇమేజ్ను బలపరుస్తుంది.
ప్రచారంలో కొత్త ఒరవడి..
తెలంగాణలో రాజకీయ ప్రచారం ఇప్పుడు కేవలం సభలు, రోడ్‌షోలకే పరిమితం కాకుండా డిజిటల్ ప్రదేశంలో నిర్ణయాత్మక స్థానాన్ని దక్కించుకుంది. ప్రసంగాల కట్స్, గ్రాఫిక్స్, డేటా ఆధారిత వీడియోలతో ప్రచారం జరగడం కొత్త ధోరణి. కేటీఆర్ ఈ మార్పును ముందుగానే గుర్తించి, ఆధునిక కమ్యూనికేషన్ పద్ధతులను సమర్థవంతంగా వినియోగిస్తున్నారు. ప్రజలు ఈ ప్రచారాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. కొందరు దీన్ని స్పష్టమైన పాలన విశ్లేషణగా స్వాగతిస్తుండగా, మరికొందరు ‘వ్యక్తిగత విమర్శలకు వేదికగా భావిస్తున్నారు. కానీ రాజకీయ పరంగా, ఇది ప్రచారాన్ని కొత్త వైపు మలుస్తోంది అనే విషయమాత్రం స్పష్టం.
కేటీఆర్ తీసుకున్న ఈ వ్యూహం, తెలంగాణ ఎన్నికల్లో ప్రచారానికి కొత్త నిర్వచనం ఇచ్చింది. స్వీయ ఘనతకన్నా, ప్రత్యర్థుల మాటలతోనే దాడి చేసే డిజిటల్ యుగం రాజకీయ ఆయుధంగా మారింది. రాబోయే వారాల్లో ఈ ప్రచారం ఫలితాలు ఎన్నికల సమీకరణాలపై ఎంత ప్రభావం చూపుతాయో చూడాలి.
Next level campaigning by KTR ❗️
Exposing Congress with their own words, Revanth Reddy’s unfulfilled promises on screen #JubileeHillsByElection pic.twitter.com/46tnk9nzWc
— YSR (@ysathishreddy) November 4, 2025