https://oktelugu.com/

KTR: రేవంత్ రెడ్డి బీజేపీలో చేరే ఛాన్స్ ఉందా?

శుక్రవారం ఒక ప్రైవేట్ న్యూస్ ఛానల్ నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు సంచలన విషయాలు బయట పెట్టారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : April 13, 2024 / 11:57 AM IST

    KTR

    Follow us on

    KTR: పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్, చేవెళ్ల, ఆదిలాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్ వంటి స్థానాలలో కాంగ్రెస్ ఓడిపోయేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్కెచ్ వేశారా? ఆ స్థానాలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిచే విధంగా పావులు కదుపుతున్నారా? త్వరలో రేవంత్ రెడ్డి బిజెపిలో చేరబోతున్నారా? అందువల్లే నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్, ఆదిలాబాద్, చేవెళ్ల స్థానాలలో బిజెపి అభ్యర్థులు గెలిచేలాగా చర్యలు తీసుకుంటున్నారా? త్వరలో ఓటుకు నోటు కేసులో కేంద్రం విచారణ చేస్తుంది కాబట్టే.. దానికి భయపడే రేవంత్ ఇలాంటి బీజేపీ అనుకూల నిర్ణయాలు తీసుకుంటున్నారా? ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానం చెప్పారు మాజీ మంత్రి కేటీఆర్.

    శుక్రవారం ఒక ప్రైవేట్ న్యూస్ ఛానల్ నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు సంచలన విషయాలు బయట పెట్టారు. “రేవంత్ రెడ్డి గతం బిజెపికి అనుకూలమైన సంఘంలో పనిచేశారు. అందువల్లే బిజెపికి పాజిటివ్ గా వ్యవహరిస్తున్నారు.. గతంలో హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం లో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కు రేవంత్ రెడ్డి సహకరించారు.. బల్మూరి వెంకట్ ను బలి పశువును చేశారు. ఆ తర్వాత మునుగోడు ఉప ఎన్నికల్లోనూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సహకరించారు.. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి దగ్గరగా ఉన్నారు అనడానికి సంకేతాలు” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.. ఓటుకు నోటు కేసు పై కేంద్రం త్వరలోనే విచారణ జరుపుతుంది కాబట్టి.. అందువల్లే భయపడి రేవంత్ బిజెపి అభ్యర్థులను గెలిపించేందుకు తెరవెనుక కృషి చేస్తున్నారని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.

    ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కూడా కేటీఆర్ స్పందించారు..” నాపై అనవసరంగా నిందలు వేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ తో నాకు సంబంధం లేదు. ఎవరో చేసిన దానికి నాకు అంటగడితే ఎలా? నార్కో టెస్ట్ కు నేను సిద్ధంగా ఉన్నాను.. ముఖ్యమంత్రి సిద్ధమేనా? ప్రస్తుతం పొంగులేటి, భట్టి విక్రమార్క వంటి వారి ఫోన్లు ట్యాప్ లో ఉన్నాయి.. వాటిని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఇది అబద్ధమని రేవంత్ రెడ్డి నిరూపించగలరా? పెగాసస్ సాఫ్ట్ వేర్ తో కేంద్రం ఫోన్లు ట్యాప్ చేయడం లేదా? నేను దేనికైనా సిద్ధమే? రేవంత్ సిద్ధమా?” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేటీఆర్ చేసిన ఆరోపణల నేపథ్యంలో.. కాంగ్రెస్ నాయకులు స్పందిస్తున్నారు. ఫోన్ ట్యాప్ సంస్కృతికి తెర లేపిందే కేటీఆర్ అని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. “రాధా కిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న, ప్రభాకర్ రావు, ఇతర పోలీసు అధికారుల వాంగ్మూలాలు ఇప్పటికే విచారణ అధికారులు సేకరించారు. అవన్నీ కూడా కేటీఆర్ కు వ్యతిరేకంగా ఉన్నాయి. కచ్చితంగా ఈ కేసులో ఆయన జైలుకు వెళ్లాల్సి వస్తుందని” కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకే కేటీఆర్ రేవంత్ పై విమర్శలు చేస్తున్నారని వారు మండిపడుతున్నారు.