KTR Latest News: కేటీఆర్… తెలంగాణ ప్రజలకు పరిచయం అక్కరలేని పేరు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు యువరాజులా వెలుగొందారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అమెరికాలో ఉన్న కేటీఆర్.. రాష్ట్ర సిద్ధిస్తున్న సంకేతాలు వెలువడిన తర్వాత రాష్ట్రానికి వచ్చారు. ఉద్యమ నేపథ్యం పెద్దగా లేకపోయినా… తండ్రి పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి వచ్చారు. సిరిసిల్లలో ఉద్యమకారుడు కేకే.మహేందర్‌రెడ్డిని పక్కన పెట్టి టికెట్ తెచ్చుకుని 1,300 ఓట్లతో గెలిచారు. కానీ, తర్వాత తన పనితీరుతో నియోజకవర్గ ఓటర్లకు దగ్గరయ్యారు. వరుసగా విజయాలు సాధిస్తున్నారు. అయితే అమెరికాలో చదువుకున్న వ్యక్తిగా.. మంచి వాక్‌చాతుర్యం ఉన్న నేతగా, పనిచేసే పొలిటీషియన్‌గా గుర్తింపు ఉన్న కేటీఆర్.. 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోయిన తర్వాత సహనం కోల్పోతున్నారు. ఇంతకాలం నేతలను దుర్భాషలాడిన గులాబీ నేత.. ఇప్పుడు అధికారులపైనా నోరు పారేసుకుంటున్నారు. తాజాగా ఆయన కలెక్టర్‌పై చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో కేటీఆర్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. సామాన్యులు సైతం కేటీఆర్ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Also Read: పోలీసులు తీసుకెళ్లిన ఇంట్లోనే బర్త్‌డే చేసుకున్న కేటీఆర్
అసలు ఏం జరిగింది?
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమి, 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఒక్క స్థానంలో కూడా గెలవకపోవడం.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌పై ఒత్తిడి పెంచింది. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతలు, సీఎంతోపాటు అధికారులపైనా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. సరిగా పనిచేయడం లేదని విమర్శించడం వేరు. కానీ, టార్గెట్‌గా వ్యాఖ్యలు చేయడం గౌరవం ఇవ్వదని విశ్లేషకులు భావిస్తున్నారు. కేటీఆర్ లాంటి నేతలకు ఇవి తగదని అభిప్రాయపడుతున్నారు.
అధికారులను టార్గెట్ చేసి..
కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన తనకు అనుకూలంగా ఉన్న అధికారులను తన జిల్లాకు, నియోజకవర్గానికి బదిలీ చేయించుకున్నారు. పనులు చేయించారు. దళితులపై పోలీసులతో కాల్పులు జరిపించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అధికారం కోల్పోయారు. అధికారంలో ఉన్న వారు వారికి అనుకూలమైన అధికారులను జిల్లాకు, నియోజకవర్గానికి బదిలీ చేయించుకున్నారు. అది ఇప్పుడు కేటీఆర్‌కు మింగుడు పడడం లేదు. అధికార పార్టీకి అనుకూలంగా అధికారులు వ్యవహరించడం, విపక్ష నేతలను టార్గెట్ చేయడం.. జీర్ణించుకోలేకపోతున్నారు. ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ క్రమంలో ఏకగా ‘‘కలెక్టర్ గాని, వాని అయ్య గాని’’ అని జిల్లా పాలనాధికారినే వ్యాఖ్యానించడం ఆయనలోని అసహనానికి నిదర్శనం.
Also Read: ఇన్నాళ్లకు రేవంత్ ప్రభుత్వానికి పాత్రికేయులు గుర్తుకొచ్చారు..
జగన్‌ను ఫాలో అవుతున్నారా?
రాజకీయ నాయకులు తమ అధికారాన్ని కోల్పోయినప్పుడు, అధికారులను లక్ష్యంగా చేసుకోవడం ఆంధ్రప్రదేశ్‌లో కూడా కనిపించింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా అధికారులపై ఇలాంటి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కేటీఆర్ కూడా ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కేటీఆర్ వ్యాఖ్యలు కార్యకర్తలను ఉత్సాహ పరిచినా ఇటువంటి ప్రవర్తన ప్రజాసేవకుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తుందని, వారి నిష్పక్షపాత పనితీరును ప్రభావితం చేస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే మాజీ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ నుంచి ఇలాంటి మాటలు వస్తాయని ఎవరూ ఊహించలేదు. ఇలాంటి భాష ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందని, రాజకీయ నాయకత్వంలో నమ్మకాన్ని తగ్గిస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.