HomeతెలంగాణDelhi Liquor Scam: కవిత తరఫున కేటీఆర్ న్యాయ పోరాటం ఫలిస్తుందా?

Delhi Liquor Scam: కవిత తరఫున కేటీఆర్ న్యాయ పోరాటం ఫలిస్తుందా?

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టయి, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల విచారణలో ఉన్న భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తరఫున ఆమె సోదరుడు, భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ న్యాయపోరాటం చేస్తున్నారు. కొద్దిరోజులుగా ఢిల్లీలోనే ఉంటున్న కేటీఆర్.. కవితను జైలు నుంచి విడుదల చేయించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. లాయర్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. సీనియర్ లాయర్ల సూచనలతో దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఫిర్యాదులు దాఖలు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల తీరును నిరసిస్తూ మొత్తం 537 పేజీల సమగ్ర వివరాలతో కవిత తరఫున న్యాయవాది మోహిత్ రావు సోమవారం సుప్రీంకోర్టులో ఓ ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ అంశంపై కేటీఆర్ సుదీర్ఘంగా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.

బయటికి వచ్చే అవకాశాలు లేవా?

ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు కవితను PMLA కింద అరెస్టు చేసిన నేపథ్యంలో.. బెయిల్ వచ్చే అవకాశాలు తక్కువని వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. సుఖేశ్ చంద్రశేఖర్ కూడా తీహార్ జైల్లోనే ఉన్నారు. ఆయన ఏకంగా తన న్యాయవాది ద్వారా కవితకు రెండు పేజీల లేఖ కూడా రాశారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత ఎలాంటి పాత్ర పోషించారు చూచాయగా చెప్పారు. కవిత నోరు విప్పితే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్టవుతారని.. ఆయనను కాపాడే ప్రయత్నం చేస్తే కవిత ఇంకా ఇబ్బందుల్లో పడుతుందని ఒకరకంగా హెచ్చరించే ప్రయత్నం చేశారు. అంటే ఈ కేసు మరిన్ని సంక్లిష్టతలు ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో సుఖేష్ ఇదే స్థాయిలో లేఖలు విడుదల చేశారు. అప్పట్లో ఆ లేఖలను భారత రాష్ట్ర సమితి నాయకులు ఖండించారు. కవిత తప్పుపట్టారు. కానీ కొంత కాలం తర్వాత ప్రస్తుతం అతడు చెప్పినట్టుగానే జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఓడిపోయింది.. ఆ పార్టీ ఓడిపోయిన కొద్ది రోజులకే కవిత అరెస్టయ్యారు.

అనిల్ కవితను కలవలేదు..

ఇక ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల విచారణలో ఉన్న కవితను మంగళవారం కేటీఆర్ ఒకరే కలిశారు. ఆదివారం కవితను ఆమె భర్త అనిల్, హరీష్ రావు తో కలిసి కేటీఆర్ పరామర్శించారు. సోమవారం కవితను కేటీఆర్, హరీష్ రావు పరామర్శించారు. మంగళవారం అనిల్, హరీష్ కాకుండా కేటీఆర్ ఒక్కరు మాత్రమే వెళ్లారు. కవిత భర్తకు ఇప్పటికే ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు తాఖీదులు ఇచ్చారు. దీంతో ఆయన పది రోజుల వరకు హాజరు కాలేనని ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల కు లేఖ పంపారు. దీంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన కవితను కలవడానికి వీలుపడదు. నిబంధనల ప్రకారం సాయంత్రం ఐదు గంటలకు కవిత విచారణ సమయం ముగుస్తోంది. ఐదు గంటల 30 నిమిషాలకు వైద్యుల బృందం కవితకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. 6 గంటలకు ఎన్ ఫోర్స్ మెంట్ డిప్యూటీ డాక్టర్ భానుప్రియ మీనా కార్యాలయం నుంచి వెళ్ళిపోతున్నారు. ఇక మంగళవారం కవితను కలిసే సమయంలో కోర్టు మార్పులు చేసింది. ఆరు నుంచి ఏడు గంటల వరకు కుటుంబ సభ్యులను కలవడానికి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.

గోప్యత పాటిస్తున్న అధికారులు

కవితను విచారిస్తున్న క్రమంలో.. ఏ అంశాల మీద ప్రశ్నలు అడుగుతున్నారో..ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు వీడియో రికార్డింగ్ చేస్తున్నారు.. అయితే గతంలో ఇదే కేసుకు సంబంధించి కవిత సెల్ ఫోన్ లను ఈడి అధికారులకు అప్పగించారు. ఇటీవల కవితను అరెస్ట్ చేసినప్పుడు ఆమె, ఆమె వ్యక్తిగత సిబ్బంది ఫోన్లను ఈడి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని అన్ లాక్ చేశారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. గతంలో కవిత చాలావరకు ఫోన్లను ధ్వంసం చేశారని.. వాటిని రిట్రైవ్ చేయడం ద్వారా సమాచారాన్ని తిరిగి సేకరించే ప్రయత్నాన్ని ఈడి అధికారులు చేస్తున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. మరి అప్పుడు కవిత ఇచ్చిన సెల్ ఫోన్ల ద్వారా ఈడి అధికారులు ఏమైనా సమాచారాన్ని సేకరించారా? లేదా కవిత వేరే ఫోన్లను ఇచ్చి ఈడి అధికారులను తికమకపెట్టారా? ప్రస్తుత ఫోన్లలో ఏమైనా సమాచారం దాగుందా? కొంతకాలం గడిస్తే తప్ప ఈ ప్రశ్నలకు సమాధానాలు లభించడం కష్టం. మరోవైపు అనుబంధ పిటిషన్లు దాఖలు చేసేందుకు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular