Ponguleti ED case: మనకు అనుకూలంగా ఉంటే ఒక విధంగా.. వ్యతిరేకంగా ఉంటే మరొక విధంగా మాటలు వస్తుంటాయి. రాజకీయ నాయకుల నోట నుంచి ఈ మాటలు మరింత ఎక్కువగా వస్తుంటాయి. వీటిని ఒకవేళ ఎవరైనా పాత్రికేయులు గుర్తు చేస్తే రాజకీయ నాయకులకు కోపం వస్తుంది. “అదేంటి నేను మాట్లాడుతుంటే మీరు వినాలి కదా.. ఇష్టానుసారంగా ప్రశ్నలు వేస్తే ఎలా” అనే అసహనం రాజకీయ నాయకుల నుంచి వస్తుంది. అందుకే రాజకీయ నాయకులు చెప్పింది మాత్రమే పాత్రికేయులు వినాలి. వారు అన్న మాటలను యధావిధిగా రాయాలి.. మీ చిత్తం మా ప్రాప్తం అన్నట్టుగా ప్రవర్తించాలి.
Also Read: కవితక్కకు దారేది?
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి ప్రతిపక్షంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లు ఇచ్చి గెలిపించిన జిల్లాలలో ఖమ్మం కూడా ఉంది. ఖమ్మంలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలు ఉంటే తొమ్మిది స్థానాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ జిల్లా నుంచి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భట్టి విక్రమార్క మంత్రుల కొనసాగుతున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రిగా, భట్టి విక్రమార్క ఆర్థికమంత్రిగా, తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. గ్రూపు రాజకీయాలను అలా ఉంచితే.. ఈ ముగ్గురి మధ్య చెప్పుకునే స్థాయిలో వైరం లేదు.. గొప్పగా భావించే స్థాయిలో స్నేహం కూడా లేదు. అంటే ఎప్పటికయ్యేది ప్రస్తుతమో.. అనే సామెతను వీరి ముగ్గురి విషయంలో అన్వయించుకోవచ్చు. ఒకరి నియోజకవర్గంలో మరొకరు వేలు పెట్టకుండా ఈ ముగ్గురు వ్యవహరిస్తున్నారు. వీరి సంగతి ఏంటో చూద్దామని భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శుక్రవారం ఖమ్మం జిల్లాకు వచ్చారు. ఖమ్మం జిల్లాలో గతంలో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంలో పనిచేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. సహజంగానే మైకు దొరికితే కేటీఆర్ రెచ్చిపోతారు. పైగా ఆయన ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ అంటే చాలు ఒంటి కాలు మీద లేస్తున్నారు. శుక్రవారం ఖమ్మంలో జరిగిన సమావేశంలోనూ అదే స్థాయిలో రెచ్చిపోయారు. భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు పై ఉదారత చూపించిన కేటీఆర్.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మాత్రం గట్టిగానే అర్సుకున్నారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసులు నమోదు చేశారని.. కానీ అవి అంతటితోనే ఆగిపోయాయని కేటీఆర్ పేర్కొన్నారు.. కేంద్రంలో ఉన్న బిజెపి పెద్దలతో కాంగ్రెస్ నాయకులు అంట కాగుతున్నారని మండిపడ్డారు. వాస్తవానికి బలమైన ఆధారాలు లభించినప్పటికీ శ్రీనివాసరెడ్డిని కేంద్ర దర్యాప్తు సంస్థలు వదిలివేశాయని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు కేంద్ర దర్యాప్తు సంస్థలు పొంగులేటి ఇంట్లో దాడులు చేసినప్పుడు వేలకోట్ల నగదు వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయని.. మీడియా ప్రతినిధులు వాటిని స్క్రోలింగ్స్ కింద.. బ్రేకింగ్ న్యూస్ ల కింద వేశారని.. ఇప్పుడు మాత్రం కేంద్ర దర్యాప్తు సంస్థలు నిశ్శబ్దాన్ని పాటిస్తున్నాయని కేటీఆర్ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి లెక్కలు తేల్చుతామని కేటీఆర్ స్పష్టం చేశారు.. బిర్యానీ కోసం ఆశపడి తెలంగాణ ప్రజలు అన్నాన్ని ఆగం చేసుకున్నారని.. ఇదే ఖమ్మం జిల్లా నుంచి 2028 ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి విజయ డంకాను మోగిస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు.. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇద్దరు మంత్రులను వదిలిపెట్టి ప్రధానంగా శ్రీనివాసరెడ్డిని లక్ష్యంగా చేసుకోవడం వెనుక ఉద్దేశం ఏమిటనే చర్చలు సాగుతున్నాయి.
Also Read: లోకేష్.. కేటీఆర్.. కలయిక కథేంటి?
తారకరామారావు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు కూడా స్పందిస్తున్నాయి. గతంలో శ్రీనివాసరెడ్డి ఇంటికి వచ్చినప్పుడు కేటీఆర్ టిఫిన్ తిన్నది, భోజనం చేసింది, రాజకీయంగా ఎటువంటి స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చింది.. ఆ తర్వాత ఎలా మోసం చేసింది ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రస్తావిస్తున్నారు. గతంలో కేటీఆర్ శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వచ్చినప్పటి ఫోటోలను గుర్తు చేస్తున్నారు. మొత్తంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. అందువల్లే సోషల్ మీడియాలో గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు.
ఫుట్బాల్ ఆడే బాధ్యత మాదే: కేటీఆర్
కాంగ్రెస్, బీజేపీ బంధం.. బడే భాయ్-చోటే భాయ్ బంధం
పొంగులేటి ఇంటిపై ఈడీ దాడులు జరిగి ఏడాది గడుస్తున్నా ఎవరూ మాట్లాడడం లేదు
నీళ్లు చంద్రబాబుకు, నిధులు రాహుల్ గాంధీకి మళ్లుతున్నాయి
– మాజీ మంత్రి కేటీఆర్ pic.twitter.com/6fJbtu0AKq
— BIG TV Breaking News (@bigtvtelugu) July 18, 2025